Begin typing your search above and press return to search.

ఉన్న '10'లో ముగ్గురు ఆ జిల్లా వారే.. దిమ్మ తిరిగే దెబ్బ తీసిన నెల్లూరు

By:  Tupaki Desk   |   24 March 2023 9:29 AM GMT
ఉన్న 10లో ముగ్గురు ఆ జిల్లా వారే.. దిమ్మ తిరిగే దెబ్బ తీసిన నెల్లూరు
X
ఎంతలో ఎంత మార్పు. నాలుగేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న 10 స్థానాల్లో పదింటిని సొంతం చేసుకొని తిరుగులేని అధిక్యతను ప్రదర్శించింది వైసీపీ. జగన్ సాధించిన సంచలన విజయంలో కీలక భూమిక పోషించింది. నాటి అధికార పార్టీకి దిమ్మ తిరిగే షాకిచ్చిన నెల్లూరు.. ఇప్పుడు తిరుగులేని ముఖ్యమంత్రిగా చెలామణీ అవుతున్న జగన్ కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలాంటి అనుభవాన్ని మిగిల్చిందని చెప్పాలి. తాజాగా జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ఓటమిని ఎదుర్కొన్న వేళ.. ఎక్కడ తప్పు జరిగింది? పార్టీకి వ్యతిరేకంగా ఓటేసిన వారెవరు? అన్న అంశంపై క్రాస్ చెక్ జరగటం.. నలుగురిలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉమ్మడి నెల్లూరు జల్లాకు చెందిన వారిగా గుర్తించారు.

2014 ఎన్నికల్లో పది స్థానాల్లో ఏడు స్థానాలు నాటి విపక్షమైన వైసీపీ విజయం సాధిస్తే.. మూడింటిలో టీడీపీ విజయం సాధించింది. ఇక.. 2019 ఎన్నికల విషయానికి వస్తే.. మొత్తం 10స్థానాలకు పది స్థానాలు వైసీపీ క్లీన్ స్వీప్ చేయగా.. టీడీపీకి చేదుఅనుభవాన్ని మిగిల్చింది. అలాంటి జిల్లాకుచెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఈ రోజున టీడీపీ అభ్యర్థికి ఓటేయటంతో.. షాకింగ్ అనుభవం పార్టీకి.. పార్టీ అధినేతకు ఎదురైన పరిస్థితి.

మూడున్నరేళ్ల వ్యవధిలో ఎలాంటి పార్టీ ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటోన్నది అన్నది ఇప్పుడు చర్చగా మారింది. కోటం రెడ్డి విషయంలో అంతా ఓపెన్ అయినప్పటికీ.. మిగిలినఇద్దరు ఎమ్మెల్యేల విషయానికి వస్తే.. అదంతా జగన్ స్వయంక్రతాపరాధమని చెబుతున్నారు. ఏ విషయాన్ని అయినా కుండబద్ధలు కొట్టినట్లుగా చెప్పటానికి అస్సలు సందేహించనితనమే తాజాగా కొంప ముంచినట్లుగా చెబుతున్నారు.

వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వటం.. ఇవ్వకపోవటం అన్న విషయాన్ని ఇప్పటి నుంచే చెప్పేయటం జగన్ చేసిన మొదటి తప్పిదంగా చెబుతున్నారు. పార్టీ సమీకరణాల కారణంగా టికెట్ ఇవ్వలేని విషయాన్ని.. చెప్పాల్సిన సమయంలో చెప్పాలే కానీ.. ముందే చెప్పేయటం ద్వారా అవసరం లేని తలనొప్పుల్ని తెచ్చి పెట్టుకున్నారని చెప్పాలి. ఇదే.. తిరుగులేని అధిక్యతను ప్రదర్శించిన జిల్లా నుంచిఎన్నికైన సొంత పార్టీ నేతలు షాకిచ్చేలా చేసిందంటున్నారు. తాజా అనుభవంతో అయినా ముఖ్యమంత్రి జగన్ పాఠాలు నేర్చుకుంటారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.