Begin typing your search above and press return to search.

సెంటు భూమి కోసం వైసీపీ నేత‌ల డిష్యుం.. డిష్యుం.. సీఎం సొంత జిల్లాలోనే!

By:  Tupaki Desk   |   15 May 2022 1:46 PM GMT
సెంటు భూమి కోసం వైసీపీ నేత‌ల డిష్యుం.. డిష్యుం.. సీఎం సొంత జిల్లాలోనే!
X
వారంతా వైసీపీ నాయ‌కులు.. పైగా.. సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌పకు చెందిన నేత‌లు. బ‌హుశ ఈ కార ణంగానేనేమో.. నేత‌లు రెచ్చిపోయారు. కేవ‌లం సెంటు భూమి కోసం.. నాయ‌కులు.. ఒకరిపై సినిమాను మ‌రిపించిన విధంగా ఫైట్ చేసుకున్నారు. పోనీ.. పోలీసులు రంగంలోకి దిగిన త‌ర్వాతైనా.. వారు త‌ప్పుకొ న్నారా? అంటే.. ఏకంగా రివాల్వ‌ర్ పైకి క‌నిపించేలా.. వ్య‌వ‌హ‌రిస్తూ.. నాయ‌కులు.. క‌త్తులు.. రాడ్ల‌తో రెచ్చి పోయారు. రాళ్లు విసురుకున్నారు. మొత్తంగా సీఎం జ‌గ‌న్ సొంత జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న సంచ‌ల‌నంగా మారింది.

ఎక్క‌డంటే..

సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లోని రాయ‌చోటి నియోజ‌వ‌ర్గంలో ఉన్న లక్కిరెడ్డిపల్లె మండల కేంద్రంలో ఎమ్మెల్యే, చీఫ్ విప్‌, గ‌డికోట శ్రీకాంత్‌రెడ్డి వర్గీయుడు, ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, చిన్నమండెం మండలానికి చెందిన వైసీపీ నాయకుడు శ్రీనివాసులరెడ్డి (ఏపీ ఫైబర్‌ నెట్‌ ఎండీ మధుసూదన్‌రెడ్డికి స్వయానా సోదరుడు) మధ్య సెంటు భూమికి సంబంధించిన‌ వివాదం ఏర్ప‌డింది. దాదాపు పది నిమిషాల పాటు యథేచ్ఛగా ఇరువర్గాల వారు రాళ్ల వర్షం కురిపించుకున్నారు.

ఆయుధాలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో శ్రీనివాసులరెడ్డి వర్గీయులు పలువురు గాయపడ్డారు. ఇతడిని చెందిన వాహనాలు సైతం ధ్వంసం అయ్యాయి. శ్రీనివాసులరెడ్డి తన లైసెన్స్‌డ్‌ రివాల్వర్‌ను అందరికీ కనిపించేలా నడుముకు కట్టుకుని హల్‌చల్‌ చేశాడు. ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి వందలాది మంది అనుచరులతో దాడికి దిగాడు. మొత్తం ఈ ఘర్షణ లక్కిరెడ్డిపల్లె పోలీసుల సమక్షంలోనే జరిగినా ఘర్షణను సద్దుమణిగించేలా పోలీసులు గట్టి చర్యలు తీసుకోలేదని పలువురు విమర్శిస్తున్నారు.

అచ్చం సినిమాలో ఫైటింగ్‌ జరిగే విధంగా వందలాది మంది పట్టపగలు ఘర్షణకు దిగారు. చేతుల్లో రాళ్లు, ఆయుధాలతో కలబడ్డారు. పలువురికి రక్తగాయాలయ్యాయి. తమ ముందే రాళ్లతో కొట్టుకుంటూ ఉన్నా వారిని చెదరగొట్టి ఘర్షణను అదుపు చేయకుండా.. ఘర్షణకు పాల్పడుతున్న వారిని ప్లీజ్‌ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అంటూ.. పోలీసులు బుజ్జగించారని పలువురు విమర్శిస్తున్నారు. సాధారణంగా ఎక్కడైనా ఘర్షణలకు పాల్పడితే అదీ పోలీసుల సమక్షంలో అయితే పోలీసు ట్రీట్‌మెంటు వేరే లెవల్‌లో ఉంటుంది.

అయితే, శనివారం జరిగిన ఘర్షణలో మాత్రం పోలీసులు మరీ ఫ్రెండ్లీ పోలీసుల్లాగా వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి. ఆయుధాలతో దాడులకు దిగి భయానక వాతావరణాన్ని సృష్టించిన వారిపైన నామమాత్రపు కేసులతో అధికార పార్టీకి స్వామిభక్తిని చాటుకున్నారని వైసీపీ నాయకులే గుసగుసలాడు తున్నారు.

ఇదీ.. కేసు!

అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లె గ్రామంలోని సర్వే నెంబరు 718లో 1.05 సెంట్ల భూమి విషయమై ఏపీ ఫైబర్‌నెట్‌ ఎండీ మధుసూదన్‌రెడ్డి సోదరుడు శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి అనుచరుడు, లక్కిరెడ్డిపల్లె ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి మధ్య వివాదం ఉంది. ఈ స్థల వివాదంపై కోర్టులో కేసులు నడుస్తు న్నాయి. ఈ భూమికి సంబంధించి రాయచోటి ఐదవ అదనపు కోర్టు, లక్కిరెడ్డిపల్లె జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులోనూ.. శ్రీనివాసులరెడ్డికి అనుకూలంగా ఇంజక్షన్‌ ఆర్డర్‌ వచ్చింది.

ఈ ఇంజక్షన్‌ ఆర్డర్‌ను శ్రీనివాసులరెడ్డి పోలీసులకు పంపించి, శనివారం ఎక్స్‌కవేటర్‌, ట్రాక్టర్లు, కూలీలతో స్థలంలోకి వెళ్లారు. స్థలంలో పనులు చేస్తుండగా.. ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి తన అనుచరులతో వచ్చి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కోర్టు ఉత్తర్వులు తమకు అనుకూలంగా ఉన్నప్పటికీ సుదర్శన్‌రెడ్డి తన అనుచరులతో కలిసి దాడులకు పాల్పడ్డారని శ్రీనివాసులరెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు.