బాబాయ్... విశాఖకు బై బై....?

Sun Mar 19 2023 11:00:01 GMT+0530 (India Standard Time)

YSRCP Leader Yv Subba Reddy

ఉత్తరాంధ్రా ఎమ్మెల్సీ సీటు గెలిచి జగన్ కి గిఫ్ట్ ఇస్తామని తెగ ఊదరగొట్టిన నేతలు ఇపుడు ఫలితాన్ని చూసి షాక్ తిన్నారు. ఎలక్షనీరింగ్ అంటే ఇదీ అని తెలుగుదేశం వారికి పాఠాలు చెప్పింది. ఎమ్మెల్యే ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక్కటి కావు అని కూడా చాటి చెప్పింది. ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే పట్టభద్రులను నమోదు చేయించడమే అని వైసీపీ నేతలు చాలా మంది అనుకున్నారు. అయితే ఆ పని కూడా అనేకమంది నేతలు చేయలేదు. ఇక ఎన్నికల ప్రచారంలో కూడా పెద్దగా పాలుపంచుకోలేదు.అంతా మొక్కుబడి తంతుగా పనిచేశారు అని అంటున్నారు. సీనియర్ మంత్రులు బొత్స సత్యనారాయణ ధర్మాన ప్రసాదరావు లాంటి వారు ఉండి కూడా ఎమ్మెల్సీ ఎన్నికలను పెద్దగా పట్టించుకోలేదు అన్న విమర్శలు ఉన్నాయి. ఇక విశాఖ విజయనగరం జిల్లాల పార్టీ ఇంచార్జి వైవీ సుబ్బారెడ్డి నెల రోజుల పాటు విశాఖలో మకాం పెట్టి ఏమి సాధించారు అన్న ప్రశ్న కూడా పార్టీ నుంచి వస్తోంది.

ఎంతసేపూ గుడు గుడు గుంచం అన్న మాదిరిగా విశాఖలో కొన్ని ప్రాంతాలు తిరిగి కరపత్రాలు పంచేస్తే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేస్తారా అని గేలిచేస్తున్నారు ఇపుడు సొంత పార్టీలోని వారే. ఓటరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అటూ ఇటూ విసిరేసినట్లుగా ఉంటారు. అలాంటి వారిని కలుసుకోవడానికి బలమైన నెట్ వర్క్ అవసరం. అధికార పార్టీకి అన్ని హంగులు ఉనాయి. కానీ పట్టుదల మాత్రం లేదు.

గెలిచేస్తాములే అన్న అతి ధీమా ఉంది. ఇక వైవీ సుబ్బారెడ్డి చుట్టూ నాయకులు చేసి అంతా చేశామని చెప్పుకొస్తే పెద్దాయన కూడా అదే నిజం అనుకున్నారు. గెలిచేస్తున్నామని భావించారు. ఆయన ఇంచార్జిగా బాధ్యతలు తీసుకున్న తరువాత తొలి ఎన్నిక ఇది. దాంతో ఆయన మీద వత్తిడి చాలానే ఉంది. కానీ వైవీ సుబ్బారెడ్డి  ఈ ఎన్నికలను ఈజీగా తీసుకున్నారా లేక గెలుపు మీద ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారా అన్నది అర్ధం కాలేదు కానీ చివరికి చేదు ఫలితం మాత్రం మూటకట్టుకున్నారు అంటున్నారు.

మరో వైపు చూస్తే తెలుగుదేశం నాయకులు అంతా కసిగా పనిచేశారు. కళా వెంకటరావు మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహరావు నుంచి శ్రీకాకుళం నేతలు జట్టుగా కట్టుగా పనిచేస్తే విజయనగరంలో  తెలుగుదేశం  జిల్లా ప్రెసిడెంట్ కిమిడి నాగార్జున నుంచి ఇతర కీలక నేతలు కదిలారు. విశాఖలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అయ్యన్నపాత్రుడు సహా సీనియర్లు తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత వంటి వారు తెగ తిరిగారు.

కసి టీడీపీలో ఉంటే ఖుషీగా వైసీపీ శిబిరం కనిపించింది. చివరికి పనిచేసిన వారిదే విజయం అన్నట్లుగా రిజల్ట్ వచ్చింది. ఓట్లు జాగ్రత్తగా నమోదు చేసుకున్న టీడీపీ అంతే జాగ్రత్తగా వారిని ఒకటికి పదిమార్లు కలసివచ్చింది. అదే విధంగా వారిని పదిలంగా పోలింగ్ బూతుల వరకూ తీసుకువచ్చి ఓట్లేయించుకుంది.

ఇపుడు ఉత్తరాంధ్రా వైసీపీ నేతలు ఇంత భారీ ఓటమి ఎలా వచ్చింది అని ఆలోచిస్తున్నారు. తేలిగ్గా గెలవాల్సిందే కదా అని చెప్పుకుంటున్నారు. చివరికి కొందరు నాయకులు తేల్చింది ఏంటి అంటే వైసీపీ అభ్యర్ధి ఎంపిక తప్పుట. అంటే ఇండైరెక్ట్ గా జగన్ మీదకే నేరం నెట్టేశారు అన్న మాట.

చివరిగా చెప్పాలంటే పాపం పెద్దాయన వైవీ సుబ్బారెడ్డి అని అనుకోవాల్సిందే. ఆయనకు ఉత్తరాంధ్రా రాజకీయం తెలియదు. ఇలా వచ్చి అలా వెళిపోయే ఆయనకు అతి పెద్ద బాధ్యత పెట్టారు. ఇపుడు అంతా కలసి ముంచేశారు అని అంటున్నారు. దాంతో అసలే ఇంచార్జి బాధ్యతలు ఈ బరువుల పట్ల మొదటి నుంచి కాస్తా విముఖంగా ఉంటూ వస్తున్న బాబాయ్ ఇపుడు విశాఖకు బై బై అనేసేలా ఉన్నారని అంటున్నారు.

అదే జరిగితే ఎమ్మెల్సీ ఓటమికి తొలి వికెట్ పడింది అంటే ఆయనేనా అన్న చర్చ కూడా పార్టీలో వస్తోంది. ఇంకో వైపు ఉత్తారాంధ్రాలో పార్టీ ఓటమి పట్ల వైసీపీ హై కమాండ్ సీరియస్ గా ఉందని అంటున్నారు. దాంతో ఏమి చెప్పాలి అన్న టెన్షన్ నేతల్లో ఉంది అంటున్నారు.