Begin typing your search above and press return to search.

హైకమాండ్ పెట్టిన చిచ్చు : గడప దాటకుండానే వైసీపీలో అగ్గి...?

By:  Tupaki Desk   |   12 May 2022 4:30 PM GMT
హైకమాండ్ పెట్టిన చిచ్చు : గడప దాటకుండానే వైసీపీలో అగ్గి...?
X
విశాఖ ఆరు నియోజకవర్గాలతో కొత్త జిల్లాగా మారిన తరువాత టీడీపీకి పొలిటికల్ గా స్ట్రాంగ్ గా ఉంది. 2019 ఎన్నికల్లో ఇక్కడ నాలుగు సీట్లూ టీడీపీ గెలుచుకుంది. మూడేళ్ళు గడచినా పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గణబాబు సీనియర్ నేత. ఆయన మూడు సార్లు గెలిచిన నేపధ్యం ఉంది.

అలాంటి సీట్లో వైసీపీ ప్రతీ ఎన్నికకూ ఒక అభ్యర్ధిని మార్చుతోంది. సరైన నాయకత్వం ఈ రోజుకు లేకపోవడం ఒక లోటు గా ఉంది. అయితే వర్గ పోరు కూడా మరో వైపు గట్టిగానే ఉంది. అయినా మూడేళ్ల పాటు చూసీ చూడనట్లుగా వదిలేసిన హై కమాండ్ సడెన్ గా పశ్చిమ లో వైసీపీ ఇంచార్జిని మార్చేసింది.

అది కూడా గడప గడపకు వైసీపీ ప్రభుత్వం కార్యక్రమం మొదలవుతుంది అనగా ఉన్న ఇంచార్జిని తీసేయడంతో అగ్గి రాజుకుంది. దాంతో అంతా గందరగోళం అయోమయం ఏర్పడింది. అప్పటిదాకా ఇంచార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ ని తీసేసి డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ ని నియమించారని రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డితో పాటు జిల్లా ప్రెసిడెంట్ అవంతి శ్రీనివాసరావు కేవలం మౌఖిక ఆదేశాలు జరీ చేయడంతో మళ్ళ వర్గం ఖంగు తింది. ఆ మీదట భగ్గుమంది.

ఇక గడప గడపకు ప్రభుత్వం పేరుతో కార్యక్రమానికి రెడీ అవుతున్న వారికి ఇలా శ్రీముఖం హై కమాండ్ ఇచ్చేసినట్లు అయింది. దాంతో మాజీ ఎమ్మెల్యే అనుచరులు, పది మంది దాకా కార్పోరేటర్లు సమావేశమై అధినాయకత్వం తీరు మీద మండిపడ్డారు. అంతే కాదు తమకు న్యాయం జరిగేంతవరకూ పార్టీ కార్యక్రమాలలో అసలు పాలు పంచుకోరాదని కూడా నిర్ణయించారు.

కనీసం సమాచారం ఇవ్వకుండా హై కమాండ్ ఎలా పార్టీ ఇంచార్జిని మారుస్తుంది అని మళ్ల వర్గం ప్రశ్నిస్తోంది. ఇది తమకు అవమానమని కూడా అంటోంది. తాడో పేడో తేల్చుకుంటామని కూడా చెబుతోంది. ఈ పరిణామాలతో అసలే అంతంతమాత్రంగా ఉన్న పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీకి కొత్త చిక్కులు వచ్చాయని అంటున్నారు.

ఇదిలా ఉంటే మళ్లకు 2019లో టికెట్ ఇస్తే దారుణంగా ఓడిపోయారని అంటున్నారు. గత మూడేళ్ళుగా ఆయన పార్టీ యాక్టివిటీస్ లో పెద్దగా కనిపించలేదని కూడా అంటున్నారు. మరో వైపు చూస్తే ఆయన మీద కొన్ని వ్యక్తిగత కేసులు కూడా ఉండడంతో ఆయన పార్టీకి టైమ్ ఇవ్వలేకపోతున్నారు అని అంటున్నారు.

సరే పార్టీకి పనిచేయని వారు ఉంటే వారిని ముందే చెప్పి పక్కన పెట్టవచ్చు కానీ సడెన్ గా అది కూడా పార్టీ ప్రతిష్టాత్మకంగా గడప గడప కార్యక్రమం చేపట్టిన వేళ ఇలా పార్టీని వీధిన పడేయాల్సిన అవసరం ఏముందని అంటున్నారు. ఇక చిచ్చు కూడా హై కమాండ్ పెట్టడమే చిత్రంగా ఉందని అంటున్నారు. ఏది ఏమైనా పార్టీ పటిష్టత కోసం రూపొందించిన ఈ కార్యక్రమం గడప దాటకుండానే పార్టీలో చిచ్చు రేగడంతో పశ్చిమ‌లో ఫ్యాన్ పార్టీ ఫ్యూచర్ ఏంటి అన్నది చర్చగా ఉంది.