Begin typing your search above and press return to search.

‘రాయచోటి’లో వైసీపీ నేతలురెండు వర్గాలుగా మారి రాళ్లతో కొట్టేసుకున్నారు

By:  Tupaki Desk   |   15 May 2022 2:54 AM GMT
‘రాయచోటి’లో వైసీపీ నేతలురెండు వర్గాలుగా మారి రాళ్లతో కొట్టేసుకున్నారు
X
ఏపీ అధికార పక్షంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటి వరకు విపక్షాలే లక్ష్యంగా విరుచుకుపడిన వారు.. ఇప్పుడు కొన్నిచోట్ల వారిలో వారేకొట్టేసుకుంటున్నారు. పార్టీ అన్న తర్వాత అంతర్గత పోరు మామూలే. కానీ.. తాజాగా మాత్రం పట్టపగలు.. అందరూ చూస్తుండగా.. వైసీపీలోని రెండు వర్గాల వారు బాహాబాహీకి దిగటమే కాదు.. రాళ్లతో దాడి చేసుకున్న వైనం షాకింగ్ గా మారింది. దీనికి రాయచోటి వేదికగా మారింది. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లెలో చోటు చేసుకున్న ఈ రచ్చకు ఒక భూవివాదమే కారణమని చెబుతన్నారు.

భూవివాదం కాస్తా అధికార పార్టీకి చెందిన ఇరు వర్గాల వారు ఒకరిపై ఒకరు రాళ్ల దాడి చేసుకునే వరకు వెళ్లిన వైనాన్ని చూస్తే.. లక్కిరెడ్డి పల్లెలో 1.05 ఎకరాల భూ వివాదమే కారణమని చెబుతున్నారు. 2019లో చిన్నమండెం మండల జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు మేఘన బావ.. వైసీపీ నేత శ్రీనివాసులు రెడ్డి కొన్నారు. ఈ భూమికి డిమాండ్ పెరగటంతో పాత యజమానుల నుంచి 2022లో వైసీపీకి చెందిన లక్కిరెడ్డి పల్లె ఎంపీపీ సుదర్శన్ రెడ్డి అనుచరులు (నరసింహరాజు.. సభాపతి నాయుడు) కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.

అంటే.. ఒకే భూమిని ఇరువురు కొనుగోలు (డబుల్ రిజిస్ట్రేషన్) చేశారన్న మాట. తాజాగా భూమిని కొనుగోలు చేసిన నరసింహరాజు.. సభాపతి నాయుడు భూమిని చదును చేసి ప్లాట్లుగా మార్చారు. దీని గురించి తెలిసిన శ్రీనివాసులు రెడ్డి కోర్టును ఆశ్రయించారు. దీంతో.. వివరాలు పరిశీలించిన న్యాయస్థానం శ్రీనివాసులు రెడ్డికి అనుకూలంగా ఆర్డర్ ఇచ్చింది. దీంతో.. శ్రీనివాసులు రెడ్డి అనుచరులను పెట్టి.. భూమిని తన అధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఇదే సమయంలో ఎంపీపీ సుదర్శన్ రెడ్డి వర్గీయులు వివాదం ఉన్న భూమి వద్దకు చేరుకున్నారు. మాటా మాటా పెరిగి చివరకు చేతల వరకు వెళ్లటమే కాదు.. ఇరు వర్గాల వారు రాళ్లతో దాడి చేసుకునే వరకు వెళ్లింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాల వారిని చెదరగొట్టే పరయత్నం చేశారు. పోలీసులు సీన్లోకి వచ్చినా.. లెక్క చేయని వైసీపీ వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్ల దాడికి పాల్పడ్డారు.

ఈ గొడవలో శ్రీనివాసులు రెడ్డి వాహనం ధ్వంసం కాగా.. అందులో మారణాయుధాలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. అంతేకాదు.. గొడవ జరుగుతున్న దగ్గరకు శ్రీనివాసులు రెడ్డి గన్ ను తీసుకురాగా.. పోలీసులు అతడ్ని వారించారు. ఇరు వర్గాల వారు పరస్పరం ఫిర్యాదు చేసుకోగా.. కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఉదంతం జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇంతకాలం విపక్షాల మీద పడిన వైసీపీ నేతలు ఇప్పుడు తమలో తామే కొట్టేసుకుంటున్నారన్న మాట పలువురి నోట వినిపిస్తుండటం గమనార్హం.