Begin typing your search above and press return to search.

తెలంగాణా వైసీపీ : నిన్న మంత్రి... నేడు ఇద్దరు ఎంపీలు... రేపు...?

By:  Tupaki Desk   |   17 May 2022 4:50 PM GMT
తెలంగాణా వైసీపీ : నిన్న మంత్రి... నేడు ఇద్దరు ఎంపీలు... రేపు...?
X
ఏపీని ఏలుతున్న వైసీపీ తెలంగాణాకు విశేష ప్రాధాన్యత ఇస్తోంది అనుకోవాలి. దానికి కళ్లెదుట ఉదాహరణలు ఉన్నాయి. నిన్నటికి నిన్న తెలంగాణాకు పుట్టి పెరిగిన చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీకి మంత్రి పదవి ఇచ్చారు. ఆమె మూలాలు ఆంధ్రావి అని సరిపెట్టుకుంటే ఈ రోజు చూస్తే ఇద్దరు రాజ్యసభ ఎంపీలను ఏకంగా తెలంగాణా నుంచి ఎంపిక చేశారు.

నిజానికి ఏపీలో అయిదు కోట్ల జనాభా ఉన్నారు. అందులో రాజకీయాల్లో ఎందరో ఉన్నారు. వైసీపీలో కూడా చాలా మంది ఉన్నారు. కానీ వారిని కాదని తెలంగాణాకు చెందిన ఆర్ క్రిష్ణయ్య, నిరంజన్ రెడ్డిలకు రాజ్యసభ‌ పదవులు ఇవ్వడం పట్ల పార్టీలోపలా బయటా చర్చ బాగా సాగుతోంది.

అయితే దీనికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సజ్జల రామక్రిష్ణారెడ్డి బదులిస్తూ రాజ్యసభ ఎంపీల ఎంపీకను జాతీయ స్థాయి దృక్కోణంలో చూడాలని, వారికి ప్రాంతాలు పరిధులు ఉండవని చెప్పారు. ఇక బీసీలకు సింబల్, జాతీయ బీసీ నేత ఆర్ క్రిష్ణయ్య కాబట్టి ఆయనకు ఎంపీ టికెట్ ఇస్తే తప్పేంటి అని మంత్రి బొత్స సత్యనారాయణ కూడా సమర్ధించుకున్నారు.

నిజమే రాజ్యసభ ఎంపీలే కాదు, లోక్ సభ ఎంపీలు కూడా ఎక్కడ నుంచి ఎక్కడైనా పోటీ చేయవచ్చు. జాతీయ పార్టీలు అలా ప్రయోగాలు చేస్తూంటాయి. కానీ పక్కా ప్రాంతీయ పార్టీ వైసీపీలో అలాంటి జాతీయ భావాలు ఉండడమే చిత్రమని అంటున్నారు.

ఇక వైసీపీలో తీరు చూస్తే రానున్న రోజుల్లో పదవులు వాటి అర్హతలు బట్టి ఏపీ అభ్యర్ధులు ఎవరూ దొరకకపోతే ఎక్కడ ఉన్నా తెచ్చి ఇస్తామని అంటున్నట్లుగానే ఉంది అనుకోవాలి. నిజానికి పదవులు అన్నవి ఎవరికైనా కావాలీ. ఎవరైనా ఆశిస్తారు.

దాని కోసమే వారు పార్టీలను నమ్ముకుంటారు. కానీ వైసీపీ మాత్రం చిత్రమైన జాతీయ భావన వాదనను తెర ముందుకు తెచ్చి ఎంపీ పదవులు పంచడం పైననే చర్చ సాగుతోంది. ఇక ఆర్ క్రిష్ణయ్య విషయం చూస్తే ఆయన తెలంగాణా రాష్ట్రంలోని రాళ్లగుడుపల్లి గ్రామం, మోమిన్ పేట్ , వికారాబాద్ జిల్లాకు చెందిన వారు. ఆయన 1994లో బీసీ సంఘాన్ని ప్రారంభించి జాతీయ స్థాయికి ఆ ఉద్యమాన్ని తీసుకెళ్లారు.

అంతవరకూ బాగానే ఉన్నా ఆయనను ఏరి కోరి మరీ ఏపీ తరఫున వైసీపీ రాజ్యసభకు ఎంపిక చేయాల్సిన దాని మీదనే చర్చ మొత్తం సాగుతోంది. ఇదిలా ఉంటే ప్రముఖ న్యాయవాది నిరంజన్ రెడ్డికి రాజ్యసభ సీటు ఇచ్చారు. ఆయన ఉండేది హైదరాబాద్, సుప్రీం కోర్టు లాయర్ గా ప్రాక్టీస్ కాబట్టి ఢిల్లీలో గడుపుతారు.

ఇక ఆయన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ లో పుట్టారు. ఫక్తు తెలంగాణా వాసి. దాంతో ఆయనను ఎంపిక చేయడం పట్ల కూడా పార్టీలో అసంతృప్తి ఉంది. అయితే ఆయన జగన్ వ్యక్తిగత కేసుల లాయర్ గా ఉన్నారు దాంతో ఆయనను రాజ్యసభకు పంపించారు అని అంటున్నారు. ఇక్కడ బిగ్ ట్విస్ట్ ఏమిటి అన్నది చూస్తే ఈ ఇద్దరికీ వైసీపీలో ప్రాధమిక సభ్యత్వమే లేదు. అదన్న మాట మ్యాటర్.

పదవుల విషయంలో తెలంగాణాకు న్యాయం చేస్తున్న వైసీపీ పెద్దలు సొంత పార్టీ వారికీ, ఏపీవాసులకు ఎపుడు న్యాయం చేస్తారు అన్న ప్రశ్నలు అయితే వస్తున్నాయి. మొత్తానికి తెలంగాణాలో వైసీపీ అన్న పార్టీ అయితే ఎక్కడా లేదు. కానీ వైసీపీ పదవులు అందుకుంటున్న వారితో అక్కడ ఆ పార్టీ పేరు మాత్రం బాగా నానుతోంది. అలా పార్టీ జెండా అక్కడ ఎగురుతోంది అనుకోవాలి.