Begin typing your search above and press return to search.

విశాఖ రాజధాని...వైసీపీకి అతి పెద్ద పజిల్

By:  Tupaki Desk   |   22 March 2023 9:23 AM GMT
విశాఖ రాజధాని...వైసీపీకి అతి పెద్ద పజిల్
X
వైసీపీ గెలిచేనాటికే ఏపీకి అమరావతి రాజధాని ఉంది. ఎన్నికల వేళ కూడా దాన్ని ఎక్కడా కదపమని వైసీపీ ప్రమాణం కూడా చేసి ఉందాయే. ఇక జగన్ దాని మీద ఒట్టేసి మరీ తాడేపల్లిలో భారీ భవంతిని కట్టుకున్నారు. ఇక గెలిచిన తరువాత మాత్రం వ్యూహం మారింది. ఆరు నెలల వ్యవధిలో అమరావతిని పక్కన పెట్టేసి మూడు రాజధానుల పాట అందుకున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్నా ఆ చిక్కు ముడి వీడిపోవడంలేదు.

ఎంతో ఉత్సాహంగా విశాఖ మన రాజధాని అని ప్రకటించిన వైసీపీకి ఇపుడు ఉత్తరాంధ్రా ఎమ్మెల్సీ ఫలితాలు గట్టిగానే జవాబు చెప్పేశాయి. అవి మింగుడుపడని పరిణామంగా ఉంది. ఇంకో వైపు విశాఖ రాజధాని అంటే జనాలు ఆదరించడంలేదు అని తెలిసిపోతోంది. కానీ రాయలసీమ వాసులు మాత్రం మాకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది అంటూ వైసీపీ మీద గుస్సా పెంచుకుని యాంటీ అయిపోయారు.

ఇలా ఉన్నది అనుకున్నదీ రెండూ పోయాయి, అమరావతిలో అసలే వ్యతిరేకత ఉంది, దీంతో మూడు రాజధానుల వ్యూహం మూడు చోట్లా తప్పు అన్నట్లుగా తయారు అయింది. ఇపుడు ఏమి చేయాలి అన్నదే వైసీపీ పెద్దలకు ఏ మాత్రం పాలు పోవడంలేదు. మూడు రాజధానుల నినాదాన్ని ఎన్నికల వేళకు జాగ్రత్తగా వైసీపీ ఉంచుకుంది. ఆ నినాదంతో అన్ని చోట్లా ఓట్లను దండీగా పొందవచ్చు అన్నదే వైసీపీ ఆలోచన.

కానీ మధ్యలో వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికలు మొత్తం ఊదేశాయి. ఇపుడు వైసీపీకి కొత్త నినాదం లేదు మూడు రాజధానుల మీద విధానం కూడాలేదు. నిజంగా ఒక ఎన్నిక ఇంత పని చేస్తుందా అన్నది వైసీపీ పెద్దలు అసలు ఊహించలేకపోయారు. ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా చిన్నవి అని బయటకు చెబుతున్నా దాని ప్రభావం మాత్రం వైసీపీ కొంప ముంచేటంతగా ఉండడంతో గుక్క తిప్పుకోలేకపోతున్నారు.

ఈ పరిణామాల నేపధ్యంలో కిం కర్తవ్యం అన్నది వైసీపీకి ఏ కోశానా తోచడం లేదు అంటున్నారు. వైసీపీలో విశాఖ రాజధాని విషయంలో అయోమయం ఏ స్థాయిలో ఉందో ఆ పార్టీ మంత్రుల ప్రకటనలే అద్దం పట్టేలా ఉన్నాయి. మంత్రి గుడివాడ అమరనాధ్ అయితే విశాఖకు ముఖ్యమంత్రి ఎపుడు వస్తారో డేట్ మీకు చెప్పాలా అని మీడియాను ప్రశ్నించినట్లుగా వార్తలు వచ్చాయి. అంటే వారే ఫలానా టైం లో విశాఖకు సీఎం షిఫ్ట్ అవుతున్నారు అని చెప్పి డేట్లు ఇచ్చుకుంటూ మార్చుకుంటూ వచ్చారు.

ఇపుడు మాత్రం డేట్స్ మీకు చెప్పాలా అని ఎదురు ప్రశ్నిస్తున్నారు అంటే అందులో అసహనం పాలు ఎక్కువగా ఉందని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే విశాఖకు జూలైలో వస్తాను అని సీఎం జగన్ మంత్రుల మీటింగులో చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. ఇదంతా ఎమ్మెల్సీ ఫలితాలకు ముందు మాట. ఇపుడు మాత్రం అసలు ఆ విషయం ఆలోచిస్తారా అన్నదే తేలడంలేదు అంటున్నారు.

ఎందుకంటే విశాఖకు మకాం మారినా రాజకీయంగా లాభం ఉండదు సరికదా మరింత నష్టం అని ఫలితాలు చెప్పేసిన వేళ ఆ సాహసం చేస్తారా అన్నది ఒక చర్చగా ఉంది. అలా కాదు అనుకుంటే ఇప్పటికే పదే పదే రాజధాని విశాఖ అని చెప్పి ఉన్నారు. ఇపుడు కాదూ కూడదు అంటే వైసీపీకే అది ఇబ్బంది అవుతుంది, ఒక విధంగా తగ్గిపోయి విపక్షాలకు చిక్కినట్లు అవుతుంది అని అంటున్నారు

మరో వైపు చూస్తే ఇప్పటికిపుడు టోన్ మార్చి అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నా ఏ మాత్రం అక్కడ కూడా సానుకూలత వ్యక్తం కాదు. ఇలా ఏ విధంగా చూసినా వ్యూహాత్మక వైఖరి కాన రాక వైసీపీ కిందా మీద పడుతోంది. ఇపుడున్న పరిస్థితులలో సుప్రీం కోర్టు అమరావతి ఏపీకి రాజధాని అని చెప్పేసి తీర్పు ఇచ్చేస్తే కోర్టు తీర్పుని గౌరవించి ఆ విధంగా నడచుకోవడం ద్వారా తమ పరువుని కాపడుకోవడం ఒక్కటే మిగిలి ఉంది అంటున్నారు. న్యాయ స్థానాల మీద గౌరవం అన్న దానితో మూడు రాజధానుల కధకు ఫుల్ స్టాప్ పెడతారా అన్నదే ఇపుడు వినిపిస్తున్న మాట. చూడాలి మరి ఏమి జరుగుతుందో. ఏ తీరున ఈ కధ ఎండ్ అవుతుందో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.