వైఎస్సార్ చేయూత పథకం ప్రారంభం.. మహిళల ఖాతాల్లో రూ.18750 జమ !

Wed Aug 12 2020 15:00:50 GMT+0530 (IST)

YSR has launched a scheme to provide Rs 18,750 per Annum to minority womens

ఆంధ్రప్రదేశ్ లో 45 ఏళ్ల వయస్సు నిండి 60 ఏళ్ల మధ్య ఉండే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు ఏడాదికి రూ.18750ల చొప్పున అందించే వైఎస్సార్ చేయూత పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు లాంఛనంగా ప్రారంభించారు. కరోనా నేపథ్యంలో సీఎం క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా.. మొదటి విడత సాయంగా బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.18750లు జమచేశారు.ఈ పథకం కోసం రాష్ట్ర బడ్జెట్ లో ప్రభుత్వం రూ.4700 కోట్లను కేటాయించింది. ఈ పథకం ద్వారా దాదాపు 25 లక్షల మంది మహిళలు లబ్ధిపొందుతారు. మహిళల సాధికారిత కోసం ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అమూల్ ఐటీసీ హెచ్‌యూఎల్ వంటి పలు సంస్థలతో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఏటా రూ.18750 చొప్పున నాలుగేళ్ల కాలంలో రూ. 75000 లను మహిళలకు ఉచితంగా ప్రభుత్వం అందించబోతుంది. వైఎస్సార్ చేయూతను ప్రారంభించడం తన అదృష్టమని.. 45 నుంచి 60 ఏళ్ల మహిళలకు ఏ పథకం లేదని వైఎస్ ఆర్ చేయూత ద్వారా వారి కుటుంబాలకు మంచి జరగాలి అని కోరుకున్నారు. మహిళల్లో ఆర్థిక సుస్థిరత తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ప్రగతికి తోడ్పాటును అందించేలా ఈ పథకాన్ని రూపొందించారు. ఈ పథకం ద్వారా 4 ఏళ్లలో రూ.17 వేల కోట్లు లబ్ధిపొందనున్నారు.