Begin typing your search above and press return to search.

'వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక' ... ఇంటికే వెళ్లి ఇస్తున్న వాలంటీర్లు !

By:  Tupaki Desk   |   1 March 2021 6:30 AM GMT
వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక ... ఇంటికే వెళ్లి ఇస్తున్న వాలంటీర్లు !
X
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 'వైఎస్సార్ పెన్షన్ కానుక' పంపిణీ సోమవారం ఉదయం ప్రారంభమైంది. ఈ రోజు ఒకటో తేదీ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2.68 మంది వాలంటర్లు, ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు నేరుగా పెన్షన్లు అందజేస్తున్నారు. రాష్ట్రంలోని చాలా గ్రామాల్లో వాలంటీర్లు ఉదయం ఆరు గంటల నుంచే పెన్షన్ల అందజేత కార్యక్రమాన్ని ప్రారంభించారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నేరుగా వారి చేతికే పెన్షన్ ‌ను అందిస్తున్నారు.

ఉదయం 9.30 గంటల వరకు 62.27 శాతం పింఛన్ల పంపిణీ పూర్తికాగా, 38.23 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేశారు. ప్రస్తుతం పెన్షన్ల పంపిణీ కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్‌ లో 61.40 లక్షల మందికి పెన్షన్లు ఉండగా.. వారికోసం రూ.1478.83 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. కాగా ప్రభుత్వం 2.66 లక్షల మంది వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ చేపట్టింది. బయోమెట్రిక్‌, ఐరిస్‌ విధానం ద్వారా లబ్ధిదారులకు పెన్షన్లు అందజేస్తున్నారు. అంతేగాక లబ్ధిదారులకు ఆర్ ‌బీఐఎస్‌ ద్వారా ఫేషియల్‌ అథెన్టికేషన్‌ నిర్వహిస్తున్నారు. పెన్షన్ లబ్ధిదారులు ఆస్పత్రుల్లో ఉంటే, వాలంటీర్లు వారి వద్దకే వెళ్లి పెన్షన్ మొత్తాన్ని అందజేసేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నేరుగా ప్రజల వద్దకే పాలన అన్న చందంగా సంక్షేమ పథకాలను నేరుగా గడపగడపకు చేరేలా నిర్ణయం తీసుకుని ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఇంటింటికి రేషన్ కార్యక్రమం అమలవుతుండగా , పెన్షన్లు కూడా నేరుగా ఇంటికి వెళ్లే లబ్ధిదారులకు ఇస్తుండటంతో లబ్దిదారుల్లో హర్షం వ్యక్తం అవుతుంది . గతంలో పెన్షన్ కోసం పడిగాపులు పడే పరిస్థితి నుండి ఇప్పుడు ఇంటికే పెన్షన్ రావటంతో లబ్దిదారులు సంతోష పడుతున్నారు.