సంజయ్ రేవంత్ కు ఫోన్.. కరెక్టే.. పట్టించుకునేదెవరు షర్మిల?

Sat Apr 01 2023 12:58:15 GMT+0530 (India Standard Time)

YS Sharmila Call to Bandi and Revanth

వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైటీపీ) అధినేత్రి వైఎస్ షర్మిల మరో రాజకీయ ఎత్తుగడకు దిగారు. దాదాపు ఏడాదిన్నరగా పోరాడుతున్నా.. పాదయాత్రలు చేస్తున్నా.. ఆందోళనలకు దిగుతున్నా.. ప్రజల్లో ఆదరణ మాత్రం దక్కని ఆమె రాష్ట్రంలో రగులుతున్న నిరుద్యోగం సమస్యను ఈసారి ఎంచుకున్నారు. ఇప్పటికే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పై పలుసార్లు మాట్లాడినా షర్మిలను పట్టించుకున్నవారు లేరు. దీంతో ఈసారి కొత్త పథకం వేశారు. రాష్ట్రంలో ప్రతిపక్ష కాంగ్రెస్ బీజేపీలతో కలిసి పోరాటం చేయడానికి సిద్ధమయ్యారు.ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఆమె ఫోన్ చేశారు. రాజకీయంగా ఇది ఆసక్తికర సంఘటనే. ఓ పార్టీ చీఫ్ గా ఉంటూ విధానాల పరంగా వేరైన ఇతర పార్టీల అధ్యక్షులకు ఫోన్ చేసి ఉమ్మడిగా ఉద్యమం చేద్దామని పిలుపునివ్వడం బహుశా ఇటీవలి కాలంలో ఇదే ప్రథమం అనుకుంటా. కానీ ఇక్కడే పెద్ద చిక్కొచ్చి పడింది.

పిలిస్తే వస్తారా?

ఎంత నిరుద్యోగుల సమస్యల మీద అయినా.. షర్మిల పిలుపుతో బీజేపీ కాంగ్రెస్ కలిసి వస్తాయా? అంటే కచ్చితంగా రావనే చెప్పొచ్చు. ఆ రెండు పార్టీలకు వాటి ఎజెండా వాటికుంది. ఇంత పెద్ద వివాదంలో వేరే పార్టీతో భాగస్వాములై వచ్చే క్రెడిట్ ను పంచుకోవడానికి అవి ఇష్టపడవు. అందులోనూ షర్మిలది చాలా చిన్న పార్టీ. ఆమెతో కలవడం అంటే బీజేపీ కాంగ్రెస్ కే చిన్నతనం. ఇక టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఘటనపై రేవంత్ సంజయ్ తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు.

వీరిద్దరికీ ప్రత్యేక దర్యాప్తు టీమ్ (సిట్) నోటీసులు ఇచ్చి విచారణకు కూడా పిలిచింది. ఏకంగా మంత్రి కేటీఆర్ నే టార్గెట్ చేసిన సంజయ్ రేవంత్ లకు గట్టి కౌంటర్ ఇవ్వాలని బీఆర్ఎస్ ప్రభుత్వం భావిస్తోంది. ఇంత ప్రతిష్ఠాత్మకంగా సాగుతున్నవ్యవహారంలో షర్మిలను ఎవరు పట్టించుకుంటారు? ఆమెతో కలిసి ఆందోళనకు ఎందుకు ఒప్పుకొంటారు? అనేది వందశాతం వాస్తవం.

ఉమ్మడి కార్యాచరణ ఎలా షర్మిల?

షర్మిల తండ్రి వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో ఉమ్మడి ఏపీలో గ్రూప్ -1 నియామకాల్లో పెద్ద వివాదమే నడిచింది. నాడు పరీక్ష రాసి అన్యాయానికి గురైన చాలామంది ఇప్పటికీ కిందిస్థాయి పోస్టుల్లో ఉన్నామని ఆవేదనతో ఉన్నారు. ఇదే సమయంలో నాడు టీఎస్ పీఎస్సీ చైర్మన్ గా ఉన్న వ్యక్తి తమ ప్రాంత వాసుల పట్ల పక్షపాతంతో వ్యవహరించారని పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. అలాంటిది ఇప్పుడు నిరుద్యోగ సమస్యపై షర్మిల ఉద్యమించడం.. దానికి బీజేపీ కాంగ్రెస్ మద్దతు కోరడం పెద్ద విచిత్రమే. ఒకవేళ ఆ పార్టీలు షర్మిల ప్రతిపాదనకు ఒప్పుకొంటే గనుక ఆ రెండు పార్టీలు.. చూస్తూచూస్తూ బీఆర్ఎస్ కు ఆయుధం అందించడమే అవుతుంది. కాబట్టి ఇది సాధ్యమయ్యే పని కాదని షర్మిల అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

రేవంత్ సంజయ్ ఒప్పుకొంటే.. ఇబ్బందే..

సంజయ్ రేవంత్ లకు ఫోన్ చేసి.. నిరుద్యోగ అంశంపై కలిసి పోరాటం చేద్దామని షర్మిల కోరడం ఓ రాజకీయ పార్టీగా ఆమె కార్యాచరణలో భాగం. తద్వారా ప్రస్తుత సమస్యను పార్టీ లబ్ధికి ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇందుకోసం ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చేద్దామని ఏకంగా ప్రగతి భవన్ మార్చ్ చేద్దామని కూడా షర్మిల కోరారు. 'సీఎం కేసీఅర్ మెడలు వంచాలంటే ప్రతిపక్షాలు ఏకం కావాలని.. ఉమ్మడి పోరాటం చేయకపోతే ప్రతిపక్షాలను తెలంగాణలో బతకనివ్వరు' అని కూడా షర్మిల ఫోన్ లో సంజయ్ రేవంత్ ను కోరినట్లు చెబుతున్నారు.

కాగా షర్మిల ఉమ్మడి పోరాట ప్రతిపాదనకు సంజయ్ మద్దతు తెలిపి.. త్వరలో సమావేశం అవుదామని చెప్పారని అంటున్నారు. నిరుద్యోగుల విషయంలో ఉమ్మడి పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తామని ప్రకటించారు. ఇక రేవంత్ స్పందిస్తూ.. ప్రతిపక్షాలు కలిసి పోరాటం చేయాల్సిన సమయం ఏర్పడిందన్నారు. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. మొత్తానికి మొహమాటానికి వారు షర్మిలకు ఈ విషయం చెప్పినా.. పార్టీలో చర్చించి కార్యాచరణ సిద్ధం చేసే సమయానికి వాస్తవం తెలుసుకుని వెనకడుగు వేయడం ఖాయం.   


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.