Begin typing your search above and press return to search.

జగన్ 65 సీట్లు మార్చోబోతున్నారా...?

By:  Tupaki Desk   |   31 May 2023 11:00 PM GMT
జగన్ 65 సీట్లు మార్చోబోతున్నారా...?
X
వైసీపీకి జనాలు 2019 ఎన్నికల్లో 151 సీట్లు కట్టబెట్టారు. అయితే నాలుగేళ్ల పాలన తరువాత అందులో సగానికి సగం సీట్లలో ఎమ్మెల్యేల మీద జనాల్లో అసంతృప్తి పెద్ద ఎత్తున ఉందని వైసీపీ సొంతంగా చేయించుకున్న సర్వేలలో వెల్లడి అవుతోంది. దాంతో చాలా మందిని ఈసారి జగన్ స్వయంగా మార్చబోతున్నారు అని అంటున్నారు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చే నంబర్ చాలా పెద్దదిగా ఉంటుందని కూడా ప్రచారం సాగుతూ వస్తోంది.

అది ముప్పయి నుంచి నలభై మంది దాకా ఉండవచ్చు అని కూడా వైరల్ అయింది. ఇపుడు చూస్తే ఆ నంబర్ అంతకు మించి ఉండొచ్చని అంటున్నారు. అంటే 65 సీట్ల దాకా ఉన్న వారిని మార్చేసి కొత్త వారికి ఆ ప్లేస్ లో టికెట్లు ఇస్తారని అంటున్నారు. ఏపీలో ఉమ్మడి జిల్లాలు 13 దాకా ఉన్నాయి. ఇందులో జిల్లాకు కనీసం అయిదు మంది ఎమ్మెల్యేలు వంతున మార్చడానికి వైసీపీ పెద్దలు డిసైడ్ అయ్యారని అంటున్నారు. ఆ లెక్క చూసుకుంటే 65 దగ్గర తేలుతోంది.

నిజానికి ఇంత పెద్ద ఎత్తున మార్చడం అంటే సాహసం అని దాన్ని అనరు, అది దుస్సాహసమే అవుతుంది అని అంటున్నారు. నిజంగా అంతమంది ఎమ్మెల్యేలను మార్చేయాలనుకుంటే అది పార్టీలో కూడా ఇబ్బందులను క్రియేట్ చేస్తుందా అన్న చర్చ కూడా సాగుతోంది.

ఇటీవలే కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఇలాంటి ప్రయోగం చేసింది. చాలా మందికి టికెట్లు ఇవ్వలేదు. అందులో సీఎం గా పనిచేసిన జగదీష్ షెట్టర్ వంటి సీనియర్ ని పక్కన పెట్టేసింది. దాంతో ఆ పార్టీకి చేదు ఫలితాలే వచ్చారు. ఇతర పార్టీలలో చాలా మంది చేరారు. తాము ఓడినా బీజేపీకి వారు చేటు తెచ్చారు మరి ఆ విధంగా కర్నాటకలో జరిగిన తీరు కూడా వైసీపీలో చర్చకు వస్తోంది.

ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద జనంలో వ్యతిరేకత ఉందని తెలిసి కంటిన్యూ చేయడం తప్పు అనే అంటున్నారు. అదే టైం లో వారిని పార్టీలో ఉంచుకోవడం, వారి సహకారం కొత్త అభ్యర్ధిని అందేలా చూడడం చాలా ముఖ్యం అంటున్నారు. ఎన్నికల తరువాత మరోసారి అధికారంలోకి వస్తే వారిని తగిన న్యాయం చేస్తామని చెప్పి నచ్చచెప్పాల్సి ఉంది.

కానీ అలా ఎంతమంది అంగీకరిస్తారు అన్నది చూడాల్సి ఉంది. ప్రజా వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు గెలవలేకపోవచ్చు కానీ పార్టీని ఓడించే సత్తా కలిగి ఉంటారని అంటున్నారు. దాంతో వారిని ఎలా డీల్ చేయాలన్నదే ఇపుడు వైసీపీ మీద ఉన్న అతి పెద్ద సవాల్. అయితే ఇంత పెద్ద నంబర్ లో టికెట్లు నిరాకరణ అన్నది గతంలో ఎపుడూ ఎక్కడా జరగలేదు. మరి ఏపీలో కనుక చేస్తే జగన్ రికార్డు క్రియేట్ చేసిన వారు అవుతారు. మరి ఆ విధంగా భరీ రిస్క్ తీసుకుంటారా అన్నది చూడాల్సి ఉంది.