Begin typing your search above and press return to search.

కుప్పంలో బాబుకు తిప్పలు తప్పవా?

By:  Tupaki Desk   |   5 Aug 2020 12:30 AM GMT
కుప్పంలో బాబుకు తిప్పలు తప్పవా?
X
2019 ఎన్నికల్లో వైసీపీ అఖండ మెజారిటీతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ అధికారాన్ని చేపట్టినప్పటి నుంచి....టీడీపీని, టీడీపీ అధినేత చంద్రబాబును అవకాశం ఉన్న చోటల్లా దెబ్బకొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. గత ప్రభుత్వంలో అవకతవకలు జరిగాయంటూ రివర్స్ టెండరింగ్ పేరుతో చంద్రబాబును ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు జగన్. ఇక, తెలంగాణ తరహాలోనే ఏపీలోనూ ప్రతిపక్షం ఉండకూడదన్న కాన్సెప్ట్ ను జగన్ ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే 23 మంది ఎమ్మెల్యేలతో బలహీన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీని దెబ్బకొట్టేందుకు జగన్ ఆపరేషన్ ఆకర్ష్ ను సైలెంట్ గా స్టార్ట్ చేశారు. వల్లభనేని వంశీ, కరణం బలరాం వంటి వారితో పాటు మరికొందరు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరారు. త్వరలో గంటాతోపాటు మరింతమంది వైసీపీలో చేరేందుకు రెడీ అవుతున్నారట. ఈ నేపథ్యంలో జగన్ తాజాగా టార్గెట్ కుప్పం పేరుతో ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించారట.

కుప్పంలో టీడీపీ ముఖ్య నేతలను తమ వైపు తిప్పుకొని...రాబోయే ఎన్నికల్లో బాబును ఓడించడమే లక్ష్యంగా టార్గెట్ కుప్పంకు యాక్షన్ ప్లాన్ రెడీ అయిందట. బాబు ఇలాకాలో చక్రం తిప్పేందుకు జగన్ ఇప్పటికే వడివడిగా పావులు కదుపుతున్నారట. టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోని కుప్పం నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. గడచిన 7 ఎన్నికల్లో వరుసగా కుప్పం నుంచి బాబు గెలుపు నల్లేరుపై నడకేనంటే అక్కడ టీడీపీ బలం ఏమిటో తెలుస్తోంది. అయితే, గత రెండు ఎన్నికల్లో....ప్రత్యేకించి గత ఎన్నికల్లో చంద్రబాబుకు మెజారిటీ తగ్గుతూ వస్తోంది. 2019 ఎన్నికల ఫలితాల మొదటి రౌండ్లో చంద్రబాబు కాస్త వెనుకబడ్డారు. దీంతో, బాబును కుప్పంలో దెబ్బకొట్టొచ్చన్న కోణంలో వైసీపీ నేతలు ప్లాన్ వేస్తున్నారట.

అందులో భాగంగానే కుప్పంలోని గడపగడపకు సంక్షేమ పథకాలు అందేలా చూడటం, సంస్థాగతంగా బలపడడం, స్థానిక టీడీపీ నేతలు వైసీపీలో చేరేలా ప్రేరేపించడం వంటి పనులకు వైసీపీ నేతలు శ్రీకారం చుట్టారట. 30 ఏళ్లుగా టీడీపీని నమ్ముకున్న కుప్పం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ చంద్రశేఖర్, గతంలో ఎంపీపీగా పనిచేసిన ఆయన భార్య, జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ శ్యామరాజు వైసీపీలో చేరారు. త్వరలోనే మాజీ జడ్పీ చైర్మన్ సుబ్రమణ్యం రెడ్డి వైసీపీ గూటికి చేరబోతున్నారట. మంత్రి పెద్దిరెడ్డి ఆధ్వర్యంలోనే ఈ ఆపరేషన్ ఆకర్ష్ జరుగుతోందని టాక్. కుప్పంలో బాబుకు అత్యధిక మెజారిటీ కట్టబెట్టిన గుడిపల్లెపై వైసీపీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిందట. బీసీలు అధికంగా ఉన్న కుప్పంలోని గుడిపల్లె నుంచి 150 నాయీ బ్రాహ్మణ కుటుంబాలు, కుప్పంలోని సుమారు 150 ముస్లిం కుటుంబాలు ఇటీవలే వైసీపీలో చేరడంతో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.


కుప్పంలో టీడీపీని దెబ్బకొట్టి...బాబు మరో నియోజకవర్గం నుంచి పోటీ చేసేలా చేయడమే టార్గెట్ కుప్పం అసలు లక్ష్యం అంటున్నారు. అయితే, ఈ వ్యవహారాలు బాబుకు తెలియడంతో...అలర్ట్ అయి కుప్పం నేతలతో ఫోన్, జూమ్ యాప్ ల ద్వారా టచ్ లో ఉంటున్నారట. ఇప్పటికే కొందరు స్థానిక టీడీపీ నేతలు వైసీపీలో చేరడం, మరికొందరు చేరేందుకు రెడీగా ఉండడంతో జిల్లా టీడీపీ నాయకత్వం అలర్ట్ అయిందట. ఈ వ్యవహారాలపై జిల్లా నాయకులను బాబు వాకబ్ చేస్తున్నారట. అయితే, పరిస్థితిని చక్కదిద్ది వలసలను ఆపేందుకు వస్తున్న జిల్లా స్థాయి నాయకులకు టీడీపీ శ్రేణులు ముఖం చాటేస్తున్నట్లు తెలుస్తోంది. అయతే, ఇళ్లకు వెళ్లి మరీ పార్టీ మారద్దని టీడీపీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు కోరుతున్నా వారు వినడం లేదట. మరి బాబు ఇలాకాలో జగన్ ఎంతవరకు చక్రం తిప్పగలరన్నది తెలియాలంటే మరి కొంతకాలం వేచి చూడక తప్పదు.