పుట్టపర్తిలో వైసీపీ వర్సెస్ టీడీపీ...మాజీ మంత్రి కారు ద్వంశం

Sat Apr 01 2023 15:30:36 GMT+0530 (India Standard Time)

Ysrcp Vs Tdp In Puttaparthi

రాయలసీమలో నువ్వా నేనా అంటూ రాజకీయ నాయకులు ఉంటారు. ఇక లోకేష్ పాదయాత్ర అక్కడ జోరుగా సాగుతున్న నేపధ్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పుట్టపర్తి వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అవినీతి ఇదీ అని లోకేష్ పాదయాత్రలో చేసిన వ్యాఖ్యల మీద వైసీపీ టీడీపీల మధ్య అగ్గి రాజుకుంది.దీని విషయంలో సోషల్ మీడియా వేదికగా సవాళ్లూ ప్రతి సవాళ్లూ సాగాయి. మాజీ మంత్రి పల్లె రఘునాధరెడ్డి మీద వైసీపీ నేతలు విమర్శలు చేశారు. అయితే నాలుగేళ్ల కాలంలో పుట్టపర్తిని ఏ విధంగా అభివృద్ధి చేసింది చర్చకు రావాలని టీడీపీ సవాల్ చేసింది.

ఈ నేపధ్యంలో స్థానిక సత్తెమ్మ తల్లి ఆలయం వద్దకు చేరుకోవడానికి  వచ్చిన పల్లె రఘునాధరెడ్డిని టీడీపీ పార్టీ ఆఫీసులో పోలీసులు అడ్డుకున్నారు. అయితే ఆయన ఆఫీసు గోడ దూకి మరీ తాను చెప్పినట్లుగా సత్తెమ్మ అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు.

స్థానిక వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అవినీతి భాగోతాలు అన్నీ నిజాలు వాస్తవాలు ఆధారాలతో తన వద్ద ఉన్నాయని కాదని చెప్పడానికి ఎమ్మెల్యే సత్తెమ్మ అమ్మ వారి ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలని పల్లె డిమాండ్ చేశారు.

ఇదిలా ఉండగా సత్తెమ్మ ఆలయం వద్దకు పల్లె రావడంతో అక్కడ అప్పటికే పెద్ద సంఖ్యలో ఉన్న వైసీపీ శ్రేణులు రెచ్చిపోయి ఆయన కారుని ద్వంశం చేశారు. దీంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. పోలీసులు కూడా ఇరు వర్గాలను అదుపులోకి తీసుకుని పరిస్థితిని కంట్రోల్ లో పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఓటమి భయంతోనే పూర్తి ఫ్రస్ట్రషన్ తోనే వైసీపీ నేతలు దాడులు చేతున్నారు అని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ వారు తమ పార్టీ నేతల మీద దాడులు చేయడాన్ని ఆయన ఖండించారు. ఈ రకంగా మాట్లాడకుండా ఎవరినీ నోరెత్తనీయకుండా భయానక వాతావరణం సృష్టించాలని చేస్తున్నారని మండిపడ్డారు.

ఇంకో వైపు టీడీపీ వారే వైసీపీ నేతల మీద దాడులకు తెగబడ్డారని వైసీపీ నేతలు అంటున్నారు. టీడీపీ ఓటమి భయంతోనే ఇలా చేస్తోందని వారు అంటున్నారు. మరి ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నా కానీ పుట్టపర్తిలో మాత్రం ఇపుడు ఉద్రికత ఉంది. లోకేష్ సైతం తన ప్రసంగం మొత్తం శ్రీధర్ రెడ్డిని టార్గెట్ చేస్తూ చేయడంతో అనంతపురంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. లోకేష్ ఇంకా చాలా నియోజకవర్గాలు తిరగాల్సి ఉంది. మరి ప్రతీ చోటా ఇలగే వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా ఉంటుందా అన్నది చూడాల్సి ఉంది.