వైసీపీ వర్సెస్ టీడీపీ : విశాఖ కేంద్రంగా కొత్త రాజకీయం షురూ !

Fri Mar 17 2023 16:36:54 GMT+0530 (India Standard Time)

YCP vs. TDP: Visakhapatnam is the center of new politics!

విశాఖ ఇపుడు ఏపీలో హాట్ టాపిక్ గా ఉన్న సిటీ. 2019 దాకా విశాఖ ఏపీలో మెగా సిటీ మాత్రమే. విజయవాడ రాజకీయ రాజధానిగా ఉంటూ వచ్చింది. అమరావతిని అసలైన రాజధానిగా నాటి టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది. వైసీపీ అధికారంలోకి వస్తూనే మూడు రాజధానుల అజెండాను నెత్తిన ఎత్తుకుంది. అదే టైం లో అనూహ్యంగా విశాఖ వైపు జగన్ చూసారు. నిజానికి వైసీపీ 2014లో అధికారంలోకి వస్తే ప్రకాశం జిల్లా పరిసర ప్రాంతాలలో రాజధాని ఏర్పాటు చేస్తారని ప్రచారం సాగింది.అయితే  మూడు రాజధానుల ముచ్చటను వైసీపీ తెచ్చిపెట్టింది. నిజానికి  ఇది గత మూడేళ్ళుగా వినిపిస్తున్న పాత మాటే.  మొదట్లో అయితే విశాఖ ప్రజానీకం ఎంతో కొంత ఆసక్తిని ప్రదర్శించారు కానీ రాను రానూ ఆ ఇంటరెస్ట్ తగ్గిపోతూ వచ్చింది. విశాఖ రాజధాని నినాదంతో 2021లో జరిన విశాఖ మేయర్ సీటుని గెలుచుకున్న వైసీపీ రెండేళ్ళు గడచినా ఆ దిశగా ఎలాంటి యాక్షన్ ప్లాన్ రెడీ చేయలేకపోయింది.

మరో వైపు విశాఖ కేంద్రంగా పెట్టుబడులు వస్తాయని ఊదరగొట్టడమే కానీ జరిగినదైతే ఇసుమంత లేదు. దాంతో రీసెంట్ గా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పేరిట విశాఖలో భారీ ఎత్తున సదస్సు నిర్వహించి 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని ప్రచారం చేసుకున్నా విశాఖ సహా ఉత్తరాంధ్రా పట్టభద్రులు యువత అసలు కనికరించలేదు.

మరో వైపు చూస్తే విశాఖ చుట్టూ వైసీపీ  తిప్పుతున్న రాజకీయం బూమరాంగ్ అయిందని తాజా ఎమ్మెల్సీ ఫలితాలు నిరూపించాయి. ఇంకో వైపు విశాఖను అభివృద్ధి కేంద్రంగా చేస్తామని చంద్రబాబు చెబుతున్న మాటలు చేస్తున్న ప్రచారానికి జనాల నుంచి మద్దతు దక్కుతోంది అని అంటున్నారు. విశాఖను రాజధానిగా కంటే నంబర్ వన్ సిటీగా ఉపాధి కేంద్రంగా మార్చాలన్నదే యువత ప్రధాన డిమాండ్.

అందుకే వారు కట్టకట్టుకుని మరీ వైసీపీని ఒడించేశారు అని అంటున్నారు. ఈ పరిణామాలు ఇలా ఉండగా విశాఖ నుంచి ఈ ఉగాది ముహూర్తాన  పాలన ప్రారంభిస్తామని చెప్పిన సీఎం జగన్  దాని  కాస్తా జూలైకి వాయిదా వేశారు. అంటే మరో నాలుగు నెలల టైం అన్న మాట. ఇపుడు ఉత్తరాంధ్రా ఎమ్మెల్సీ ఫలితాలు చూసిన తరువాత విశాఖను ఫోకస్ చేస్తూ సీమను పక్కన పెట్టడం పట్ల ఆ వైపు నుంచి వస్తున్న అసంతృప్తితో ఎమ్మెల్సీ ఎన్నికలలో షాక్ ఇచ్చేస్తునాయి.

దాంతో జగన్ విశాఖ రాజధాని అన్న మాట కానీ విశాఖ నుంచి పాలన కానీ ఎంతవరకూ ఆచరణలో ముందుకు సాగుతుంది అన్న చర్చ సాగుతోంది. జూలైలో విశాఖ నుంచి పాలన అన్నది వైసీపీ పెట్టుకున్న చివరి ముహూర్తంగానే భావిస్తున్నారు. అది కనుక అమలులోకి రాకపోతే మాత్రం వైసీపీ ఏలుబడిలో విశాఖ రాజధాని అన్న మాటను మరచిపోవచ్చు అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే ఉత్తరాంధ్రా ఓటర్ల మనోగతం ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా ఎంతో కొంత బయటపడిన నేపధ్యంలో టీడీపీ కూడా విశాఖ రాజధాని మీద గట్టిగానే అటాక్ చేస్తుంది అని అంటున్నారు. దానికి నాందిగా అయ్యన్నపాత్రుడు ఉత్తరాంధ్రా జగన్ని చీ కొట్టింది అని హాట్ కామెంట్స్ చేశారు. విశాఖను తామే అభివృద్ధి చేస్తామని టీడీపీ నాయకులు గట్టిగా ఇక మీదట చెప్పబోతున్నారు.

విశాఖను ఆర్ధిక రాజధానిగా చేసి ఉత్తరాంధ్రా వెనకబాటుతనాన్ని టీడీపీ రూపు మాపుతుందని అంటున్నారు. ఇదిలా ఉండగా ఒక వైపు ఉత్తరాంధ్రా ఎమ్మెల్సీ ఫలితం వైసీపీకి యాంటీగా వస్తున్న నేపధ్యంలో విశాఖ ఆంధ్రా వర్సిటీ వద్ద గో బ్యాక్ సీఎం సర్.. అమరావతి రాజధానిని నిర్మించండి అంటూ రాసి ఉన్న ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

జన జాగరణ సమితి పేరిట వెలసిన ఈ ఫ్లెక్సీలు విశాఖలో దుమారం రేపుతున్నాయి. ఏయూ ఎంట్రీ గేట్ తో పాటు విశాఖలో ప్రధానమైన ప్రాంతాలలో సైతం జన జాగరణ సమితి పేరుతో ఇలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు కావడం సంచలనం రేపుతోంది. దీని వెనక ఎవరు ఉన్నారన్న దాని పైన పోలీసులు ఆరా తీస్తున్నారు. జగదాంబ మద్దిలపాలెం సిరిపురం ఆశిల్ మెట్ట తదితర కూడళ్లలో పోస్టర్లు కూడా ఏర్పాటు చేసి మరీ వైసీపీ యాంటీ స్టాండ్ ని చాటారు.

ఇక ఏయూ అధికారులు అయితే దీన్ని తొలగించారు. అనంతరం అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విశాఖ మన రాజధాని అక్కడ నుంచే పాలన అని జగన్ చెప్పి చాలా రోజులు అయింది. అయితే ఇపుడే ఎందుకు ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అది కూడా ఎమ్మెల్సీ ఫలితాలు ఒక వైపు వస్తూంటే మరో వైపు ఇలా చేయడం పట్ల చర్చ సాగుతోంది. మొత్తానికి విశాఖ చుట్టూ రాజకీయం కొత్త మలుపు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఈ నేపధ్యంలో వైసీపీ ఏ రకంగా కొత్త వ్యూహాలతో ముందుకు వస్తుంది అన్నది చూడాలని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.