Begin typing your search above and press return to search.

ఆదిరెడ్డి వాసుని టార్గెట్ చేసిన వైసీపీ

By:  Tupaki Desk   |   29 May 2023 4:00 PM GMT
ఆదిరెడ్డి వాసుని టార్గెట్ చేసిన వైసీపీ
X
ఒక వైపు రాజమండ్రిలో మహానాడు రెండు రోజుల పాటు బ్రహ్మాండంగా సాగింది. మహానాడుకు తెలుగుతమ్ముళ్ళు కుమ్మేశారు. నేల ఈనిందా అన్నట్లుగా వచ్చి పడ్డారు. ఎండ పెద్ద ఎత్తున కాసినా గాలి వాన సాయంత్రం తరువాత బెంబేలెత్తించినా కూడా కదలలేదు, బెదరలేదు.

అలాంటి వాతావరణంలో సభ జరగడం మంచి పరిణామం అని ఇది టీడీపీ బలమని పార్టీ పెద్దలు హుషార్ గా ఉన్న వేళ రాజమండ్రికి చెందిన కీలక నేత, దివంగత ఎర్రన్నాయుడు అల్లుడు, ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడుకు అల్లుడు వరస అయ్యే ఆదిరెడ్డి వాసు మీద వైసీపీకి చెందిన నాయకులు సంచలన ఆరోపణలు చేశారు. ఒక విధంగా చెప్పాలీ అంటే ఆయన్ని టార్గెట్ చేశారు అనుకోవాలి.

ఆదిరెడ్డి వాసు రాజమండ్రి మహానాడు సక్సెస్ లో కీలకమైన పాత్ర పోషించడంతో ఆయన ఇమేజ్ ని దెబ్బతీసేందుకా అన్నట్లుగా ఈ ఆరోపణలు చేసారా అన్న చర్చ నడుతోంది. ఈ విధంగా ఆరోపణలు చేసింది ఎవరంటే రాష్ట్ర గౌడ, శెట్టి బలిజ, ఈడిగ, శ్రీ శయన, యాత కార్పోరేషన్ మాజీ చైర్మన్ పాలిక శ్రీను పెద్ద గొంతుతో ఆదిరెడ్డి వాసు దందాలు ఇవీ అంటూ విమర్శించారు. తెలుగుదేశం పార్టీ ముసుగులో ఆదిరెడ్డి వాసు చేస్తున్న ఆగడాలు ఇవి అంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పేశారు.

ఇక మహనాడు ఫ్లెక్సీలు బేనర్లు పేరుతో ఆదిరెడ్డి వాసు రాజమండ్రి లో లోహిత్ నుంచి సుమారుగా ముప్పై లక్షలకు పైగా నగదుని తీసుకున్నారని ఆయన ఆరోపించారు. ఇది అక్షర సత్యమని ఆయన అంటూ తాను ఎలాంటి తప్పు చేయలేదని ఆదిరెడ్డి వాసు అనుకుంటే దేవుడి మీద ప్రమాణం చేయాలని కూడా డిమాండ్ చేశారు.

ఈ ఆరోపణలు చేసిన పాలిక శ్రీను రాజమండ్రి వైసీపీ ఎంపీ భరత్ ముఖ్య అనుచరుడు. ఆయనతోనే ఉంటాడని అంటున్నారు. ఇక గతంలో పాలిక శ్రీను టీడీపీలో ఉండేవారు. ఈసారి ఎన్నికల్లో ఆదిరెడ్డి వాసు రాజమండ్రి సిటీ నుంచి పోటీ చేస్తారు అని ప్రచారం సాగుతోంది.

అయితే అదే సీటు మీద కన్నేసిన రాజమండ్రి వైసీపీ ఎంపీ భరత్ ఆదిరెడ్డి వాసు మీద ఈ విధంగా తన అనుచరులతో ఆరోపణలు చేయిస్తున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఆదిరెడ్డి వాసు పవర్ ఫుల్ లీడర్ గా రాజమండ్రి అర్బన్ లో ఎదిగారు. ఆయన బీసీ నేతగా ఉన్నారు.

దాంతో పాటు అర్ధ బలం, అంగబలం తోడు కావడంతో యువకుడిగా ఉన్న ఆదిరెడ్డి వాసుకు పార్టీ టికెట్ ఇస్తుందని టాక్ ఉంది. ఈ నేపధ్యంలో రాజమండ్రిలో మహానాడు సక్సెస్ కావడంతో ఆదిరెడ్డి వాసు బాగానే సొంత పార్టీలో ఫోకస్ అవుతున్నారు. ఈ పరిణామాల నేపధ్యంలో ఆయన్ని వైసీపీ టార్గెట్ చేస్తోంది అని అంటున్నారు.