అందుకే ప్రజల్లోకి జగన్!

Fri Sep 24 2021 09:00:01 GMT+0530 (IST)

YCP same premise repeated in the coming elections

ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్ని కష్టాల కోర్చి 2019 ఎన్నికల్లో అఖండ విజయంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ పీఠాన్ని అధిరోహించారు. ఆ ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థి తెలుగు దేశం పార్టీని చిత్తుచేసి మరీ అధికారాన్ని అందుకున్నారు. ఇప్పటికే పాలన పగ్గాలు చేపట్టి రెండున్నరేళ్లకు చేరువ అవుతున్నారు. సంక్షేమ పథకాలతో ప్రజల్లో మంచి పేరే తెచ్చుకున్నారు. కానీ కొన్ని నిర్ణయాల వల్ల వ్యతిరేకత కూడా వ్యక్తమైంది. ఇప్పుడు రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశముందనే చర్చ జోరుగా సాగుతున్న నేపథ్యంలో జగన్ తీసుకున్న నిర్ణయం ఆ ఊహాగానాలకు బలాన్ని చేకూర్చేదిగా ఉంది. ఈ ఏడాది డిసెంబర్ నుంచి వార్డు గ్రామ సచివాలయాలను వ్యక్తిగతంగా సందర్శిస్తానని జగన్ తాజాగా ప్రకటించారు.గత ఎన్నికల్లో ఘన విజయంతో గెలిచిన వైసీపీ.. రాబోయే ఎన్నికల్లోనూ అదే ప్రదర్శన పునరావృతం చేయాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో ముందస్తు ఎన్నికలు వస్తాయనే ఊహాగానాల నడుమ తిరిగి ప్రజలతో మమేకమై వాళ్ల మద్దతు కొనసాగేలా చూసుకోవాలని జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్పందన కార్యక్రమంలో భాగంగా ఎస్పీలు కలెక్టర్లతో మాట్లాడిన జగన్ డిసెంబర్ నుంచి రెగ్యులర్‌గా సచివాలయాలను సందర్శించనున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యేలతో పాటు జిల్లా అధికారులు కూడా అదే బాటలో సాగాలని ఆదేశించారు. జగన్ ప్రభుత్వంలో వార్డు గ్రామ సచివాలయాలు బాగా ఆదరణ పొందాయి.

ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో ఈ సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థనే కీలకంగా మారింది. ఈ వ్యవస్థ ద్వారా ప్రజలకు అన్ని రకాల సేవలు అందుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ వ్యవస్థను ప్రజల్లోకి తీసుకొచ్చిన జగన్.. ఇప్పటివరకూ వ్యక్తిగతంగా ఆ సచివాలయాలను సందర్శించలేదు. కానీ ఇప్పుడు ఆయనే కాకుండా ఎమ్మెల్యేలు కూడా తరచుగా సందర్శించాలని చెప్పడం వెనక ముందస్తు వ్యూహమే ఉందని రాజకీయ నిపుణులు అంటున్నారు. ఇలా ఎమ్మెల్యేలు నెలలో నాలుగు సచివాలయాలను కచ్చితంగా సందర్శించాలని జగన్ ఆదేశించడంతో ఆ నేతలు జనాల్లోకి వెళ్లడానికి మంచి అవకాశం దొరికినట్లవుతుంది. ప్రజలతో మమేకమై వాళ్ల ఆదరణ పొందేందుకు పార్టీకి ఇది ఉపయోగపడుతుంది.

ఎమ్మెల్యేలే అని కాకుండా కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు సబ్ కలెక్టర్లు మున్సిపల్ కమీషనర్లు ఐటీడీఏ పీవో ఇలా అందరినీ సచివాలయాలను సందర్శించాలని జగన్ ఆదేశించారు. ఇటీవల రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థపై విమర్శలు మరోవైపు టీడీపీ శ్రేణులు దూకుడు పెంచడంతో ప్రజల్లో వైసీపీపై వ్యతిరేకత రాకుండా ముందుగానే నివారించేందుకు జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని విశ్లేషకులు చెప్తున్నారు. అంతే కాకుండా జగన్ ఎంతో నమ్మకం పెట్టుకున్న నవ రత్నాల పథకాలను సమర్థంగా అమలు చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్న వాలంటీర్ల వ్యవస్థ సక్రమంగా పని చేస్తే ప్రజల్లో జగన్‌పై సానుకూలత మరింత పెరుగుతుంది. అందుకే ఇప్పుడు ఈ సచివాలయాల సందర్శన జగన్ వ్యూహాత్మక నిర్ణయమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.