Begin typing your search above and press return to search.

వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేల చూపు టీడీపీ కాకుండా ఆ పార్టీ వైపు ఉందా?

By:  Tupaki Desk   |   7 Feb 2023 2:15 PM GMT
వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేల చూపు టీడీపీ కాకుండా ఆ పార్టీ వైపు ఉందా?
X
వైసీపీ కంచుకోటల్లో ఒకటైన నెల్లూరు జిల్లాలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి చేసిన ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. సొంత ప్రభుత్వమే తమ ఫోన్లను ట్యాప్‌ చేస్తోందని వారిద్దరూ తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో వారిద్దరి భద్రతను కుదించడంతోపాటు నియోజకవర్గాల ఇంచార్జిలుగానూ వారిద్దరినీ వైసీపీ అధిష్టానం తప్పించింది.

ఈ నేపథ్యంలో ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి ఇద్దరూ టీడీపీలోకి వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో కోటంరెడ్డి తన మనసులో మాటను బయటపెట్టేశారు. చంద్రబాబు సీటు ఇస్తే నెల్లూరు రూరల్‌ నుంచి టీడీపీ తరఫున బరిలోకి దిగుతానన్నారు. అయితే కోటంరెడ్డి ప్రకటనలపై టీడీపీ నేతలెవరూ స్పందించడం లేదు. ఒక్క నెల్లూరు జిల్లాకే చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించకుండా ఎవరికి వారు సీట్లు ప్రకటించుకోవడం సరికాదని అన్నారు.

అయితే టీడీపీ ఆనంను పార్టీలోకి చేర్చుకోవడానికి సుముఖంగా ఉందని అంటున్నారు. ఆనం సీనియర్‌ రాజకీయ నేత కావడం, ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకపోవడం, మాటతీరు, ఆనం కుటుంబానికి నెల్లూరు జిల్లాలో ఉన్న పట్టు తదితర కారణాలతో ఆనంకు టీడీపీలో ఢోకా లేదని అంటున్నారు.

గతంలో ఒంగోలులో టీడీపీ మహానాడు నిర్వహించినప్పుడే ఆనం రామనారాయణరెడ్డి కుమార్తె కైవల్యారెడ్డి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ తో భేటీ అయినట్టు వార్తలు వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి ఆనం కుమార్తె కైవల్య టీడీపీ నుంచి పోటీ చేయడం ఖాయమనేనని అంటున్నారు.

ఇక కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి దుడుకు స్వభావం గలవారని, గతంలోనూ పలు వివాదాల్లో, కేసుల్లో చిక్కుకున్నారనేది టీడీపీ అభిప్రాయంగా ఉంది. తాను టీడీపీ నుంచి పోటీ చేస్తానని ప్రకటనలు చేస్తున్నప్పటికీ టీడీపీ ముఖ్య నాయకులెవరూ స్పందించకపోవడం పట్ల కోటంరెడ్డి సైతం కొంత అసంతృప్తితో ఉన్నట్టు చెబుతున్నారు.

2019 ఎన్నికల్లో నెల్లూరు రూరల్‌ నుంచి టీడీపీ తరఫున అబ్దుల్‌ అజీజ్‌ పోటీ చేశారు. ప్రస్తుతం ఆయనే నియోజకవర్గ ఇంచార్జిగా ఉన్నారు. ఇప్పుడు కోటంరెడ్డి వస్తున్నారని ఆయనకు సీటిచ్చి అబ్దుల్‌ అజీజ్‌ కు సీటు ఇవ్వకపోతే ముస్లింలకు టీడీపీ ప్రాధాన్యత ఇవ్వలేదని చెడ్డపేరు వస్తుందని టీడీపీ అధిష్టానం భయపడుతోందట.

ఈ నేపథ్యంలో కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌ లో చేరడానికైనా సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. టీడీపీ కాదంటే బీఆర్‌ఎస్‌ వైపు ఆయన మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డితో బీఆర్‌ఎస్‌ నేతలు టచ్‌ లోకి వచ్చారని.. ఆయనను తమ పార్టీలో చేరాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారని టాక్‌.

అదేవిధంగా బీజేపీ సైతం కాపుల తర్వాత రెడ్డి సామాజికవర్గాన్ని పార్టీలో చేర్చుకోవడానికి ఆసక్తి చూపుతోంది. ఈ నేపథ్యంలో ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డిలతో బీజేపీ నేతలు టచ్‌ లో ఉన్నారు. అయితే ఇంకా ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు 15 నెలలు సమయం ఉంది. ఈ నేపథ్యంలో అప్పుడే తొందరపడటం ఎందుకన్న ఉద్దేశంలో కోటంరెడ్డి ఉన్నట్టు చెబుతున్నారు. అన్ని పరిణామాలను బేరీజు వేసుకుని కీలక సమయంలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.