Begin typing your search above and press return to search.

కోర్టులో కేసు న‌డుస్తున్నా.. ఆస్తులు స్వాధీన‌మా?

By:  Tupaki Desk   |   25 Jun 2022 10:30 AM GMT
కోర్టులో కేసు న‌డుస్తున్నా.. ఆస్తులు స్వాధీన‌మా?
X
త‌మ‌ నేత‌ల‌ను ఆర్థికంగా బ‌ల‌హీన ప‌ర‌చాల‌నే వ్యూహాన్ని వైసీపీ ప్ర‌భుత్వం చాలా వేగంగా ముందుకు తీసుకువెళ్తోంద‌ని టీడీపీ నిప్పులు చెరిగింది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి .. వైసీపీ స‌ర్కారు వ‌చ్చే అవ‌కాశం త‌క్కువ‌గా ఉంద‌ని.. స‌ర్వేలు స‌హా విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్న నేప‌థ్యంలో త‌మ నేత‌ల‌పై క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌కు వైసీపీ తెర‌దీసింద‌ని.. దుయ్య‌బ‌ట్టింది. టీడీపీ నేత‌లు.. ముఖ్యంగా ప్ర‌జ‌ల్లో ఉంటున్న‌.. ప్ర‌జ‌లు త‌మ వెంటే ఉంటున్న నాయ‌కుల‌ను టార్గెట్ చేస్తున్నారని.. నాయ‌కులు మండిప‌డుతున్నారు.

ఈ క్ర‌మంలో ఇలాంటి నాయ‌కుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని ఆర్థిక మూలాల‌ను పెక‌లించి వేయాల‌ని.. వైసీపీ స‌ర్కారు ప్ర‌య‌త్నాలు చేస్తోందని అంటున్నారు. తాజాగా ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలోని పొన్నూరు నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మెల్యే.. ప్ర‌జానేత‌.. ధూళిపాళ్ల న‌రేంద్ర కుమార్‌పై స‌ర్కారు క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌ను ముమ్మ‌రం చేయ‌డంపై టీడీపీ నేత‌లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

ఇప్ప‌టికే ఆయ‌న నిర్వ‌హిస్తున్న సంగం డైయిరీకి సంబంధించి అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డ్డారంటూ.. ఒక‌సారి అరెస్టు చేసి జైలుకు కూడా పంపించిన విష‌యాన్ని ప్ర‌స్తావిస్తున్నారు.

అయిన‌ప్ప‌టికీ.. న్యాయ‌స్థానం అండ‌తో ఆయ‌న బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఇక‌, ఇప్పుడు కూడా స‌ర్కారు వ‌ద‌ల బొమ్మాలీ అనే త‌ర‌హాలో ధూళిపాళ్ల‌పై ఆర్థికంగా దెబ్బ‌కొట్టే వ్యూహాల‌ను అమ‌లు చేస్తోందని టీడీపీ నేత‌లు అంటున్నారు.

ధూళిపాళ్ల వీరయ్యచౌదరి మెమోరియల్ ట్రస్టుకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ట్రస్టు ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో సమాధానం చెప్పాలంటూ దేవాదాయ శాఖ నోటీసులిచ్చింది.

ట్రస్టు వ్యవహారంపై ఇప్పటికే న్యాయస్థానంలో కేసు కొనసాగుతోంది. ఎలాంటి తదుపరి చర్యలూ వద్దంటూ కోర్టు గతంలో ప్రభుత్వానికి స్పష్టం చేసింది. న్యాయస్థానంలో ఈనెల 29న కేసు విచారణకు రావాల్సి ఉంది. ఈలోగా మరోసారి సెక్షన్ 43 కింద దేవదాయశాఖ నోటీసులు జారీచేసింది. ప్రభుత్వం నోటీసులు ఇవ్వడమంటే.. న్యాయ ఉల్లంఘనే అని తెలుగుదేశం వర్గాలు ఆరోపించాయి. ఇది కక్షసాధింపు చర్య లో భాగ‌మేన‌ని అంటున్నారు.