ఎమ్మెల్సీ అనంతబాబు ఆరాచకాల చిట్టా అనంతమట

Tue May 24 2022 15:00:31 GMT+0530 (IST)

YCP anantha udaya bhaskar news update

అనంత ఉదయ భాస్కర్. ఈ పేరు చెప్పినంతనే గుర్తుకు రాకపోవచ్చు. కానీ.. వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు అంటే మాత్రమే..  ఇట్టే గుర్తుకు రావటమే కాదు.. ఇన్నాళ్లు ఇతగాడి లీలల్ని బయటపెట్టే దమ్ము ఎవరికి ఎందుకు లేకపోయిందన్న సందేహం కలుగక మానదు. తన మాజీ కారు డ్రైవర్ ను దారుణంగా చంపేసిన అతగాడు.. డెడ్ బాడీని తన కారులోనే తీసుకొని.. వారింటి వాళ్లకు ఇచ్చి.. రోడ్డు ప్రమాదంలో చనిపోయాడంటూ చెప్పి తప్పించుకునేంత తెంపరితనం అనంతబాబు సొంతం. తాజా హత్య ఉదంతంతో అతడు ఎవరు? అతడి బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అతని నేర చరిత్ర మాటేమిటి? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలాంటి వేళ.. అతగాడి గురించిన వివరాలు ఒక్కొక్కటిగా వస్తూ ంచలనంగా మారాయి.అనంత బాబు తీరును ఒక్క మాటలో చెప్పాలంటే అతను చెప్పింది వేదం.. అతని మాటే శాసనమన్నట్లుగా వ్యవహరిస్తుంటారని చెబుతున్నారు. ఇక.. అతడి ఆదాయ వనరుల గురించి వస్తే.. అక్రమానికి కేరాఫ్ అడ్రస్ గా.. ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా డబ్బులు దండుకోవటంలో అతనికి అతనే సాటిగా చెబుతున్నారు. కోట్ల రూపాయిల విలువైన రంగురాళ్ల వ్యాపారం మొదలు.. మన్యంలో అక్రమ కలప రవాణ.. అక్రమ ఇసుక తవ్వకాలు.. పేకాట.. ఇలా అసాంఘిక కార్యక్రమాలకు అతనే అసలుసిసలు అడ్రస్ గా చెబుతుంటారు.

బినామీల పేరుతో మెటల్ క్వారీలు.. చేపల చెరువులు.. గంజాయి సాగు.. అక్రమ రవాణా లాంటివెన్నింటి వెనక అతడిదే ప్రధాన పాత్రగా చెబుతున్నారు. మరింత జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారన్న మాటకు వస్తే.. ఎవరికి ఎంత చేరాలో.. వారికి అంత చేరవేసేలా ప్లాన్ చేస్తారని చెబుతారు. వైసీపీ ప్రభుత్వం కొలువు తీరటానికి ముందు అతని మీద అడ్డతీగల పోలీస్ స్టేషన్ లో రౌడీ షీటర్ ఉండేదని.. సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత.. అతడి మీద ఉన్న రౌడీ షీట్ తొలిగిపోయిందంటారు.

అనంతబాబు కుటుంబ చరిత్రను చూస్తే.. అతగాడి తండ్రి అనంత చక్రరావు సమితి అధ్యక్షుడిగా పని చేశారు. అప్పట్లో గిరిజన వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని మావోలు అతన్ని కాల్చి చంపారు. ఆ తర్వాత అనంతబాబు జెడ్పీ సభ్యుడిగా ఉన్నప్పుడు అతడ్ని ఎత్తుకెళ్లిన మావోలు.. ప్రజాకోర్టులో తీవ్ర హెచ్చరికలు చేసి వదిలేశారు. ఎప్పుడైతే వైసీపీ సర్కారు కొలువు తీరిందో.. అతడి కార్యకలాపాలకు అడ్డే లేకుండా పోయిందని చెబుతారు. 1998లో కాంగ్రెస్ కార్యకర్తగా చేరిన అతను.. 2001లో అడ్డతీగల జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2006లో నకిలీ ధ్రువపత్రంతో అడ్డతీగల ఎంపీపీ అయ్యారు. వైసీపీ ప్రారంభమయ్యాక.. పార్టీలో చేరిన అతను తూర్పుగోదావరి జిల్లా పార్టీకి యువజన విభాగానికి అధ్యక్షుడిగా.. రంపచోడవరం నియోజకవర్గ ఇంఛార్జిగా పని చేశారు.

2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్టీగా నామినేషన్ వేయగా.. ఆయన ప్రత్యర్థులు అతను ఎస్టీ కాదని ఆధారాలు చూపించటంతో అతని నామినేషన్ ను రిజెక్టు చేశారు. దీంతో ఆయనకు నామినిగా వ్యవహరించిన రాజేశ్వరిని ఎమ్మెల్యేగా బరిలోకి దింపి.. గెలిపించటమే కాదు.. పేరుకు ఎమ్మెల్యే ఆమె అయినా అన్నీ తానై నడిపారు అనంతబాబు. 2019లోనూ వైసీపీ అభ్యర్థిగా ధనలక్ష్మిని నిలబెట్టి.. గెలిపించటమే కాదు.. ఆమెకు బదులుగా ఇతగాడే చక్రం తిప్పుతారని చెబుతారు.

ఏదైనా కార్యక్రమం జరిగినా ఎమ్మెల్యే అయిన ధనలక్ష్మీ కార్యక్రమానికి ముందుగా వచ్చినా.. అనంత బాబు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందేనని చెబుతారు.

తన మాటకు ఎదురు చెప్పే వారి సంగతి చూస్తారన్న పేరున్న అనంత బాబుకు వ్యతిరేకంగా ఒక్కరు కూడా గళం విప్పరని చెబుతారు. ఒకవేళ ఆ సాహసం చేస్తే.. వారికి ఎదురయ్యే ఇబ్బందులు అన్ని ఇన్ని కావని చెబుతారు. ఇంతటి ఆరాచకాలు చేసే అనంత పాపం పండి.. మాజీ డ్రైవర్ హత్యతో అతగాడి లీలలు బయటకు రావటమే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వివాదాస్పద రాజకీయ నేతగా అందరి నోట్లో నానిన పరిస్థితి. రానున్న రోజుల్లో ఇతగాడు చేసిన ఘోరాలు.. దారుణాలు మరెన్ని బయటకు వస్తాయో చూడాలి.