ఏపీలో వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు సాధించాలని ఏపీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ పెద్ద లక్ష్యమే పెట్టుకున్నారు. ఈ దిశగా ఇప్పటికే వైసీపీ నేతలకు ఆయన స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. అయితే సీఎం జగన్ లక్ష్యం నెరవేరేలా కనిపించడం లేదని టాక్ నడుస్తోంది. వైసీపీలో పరిణామాలు రోజురోజుకీ ఆ పార్టీలో ఆందోళన నింపుతున్నాయనే ప్రచారం జరుగుతోంది.
కొద్ది రోజుల క్రితం నెల్లూరు జిల్లా వైసీపీలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో ఆనం రామనారాయణరెడ్డి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వంపై వీరిద్దరూ తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ఆ పార్టీ అధిష్టానం వారు ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి నెల్లూరు రూరల్ నియోజకవర్గాల ఇంచార్జిలుగా వీరిని తొలగించి నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి ఆదాల ప్రభాకరరెడ్డిలను నియమించింది.
అయితే ఇంతటితో నెల్లూరు కలకలానికి పుల్ స్టాప్ పడలేదు. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి తన నియోజకవర్గంలో వైసీపీ అధిష్టానం పరిశీలకుడిగా ధనుంజయరెడ్డిని నియమించడాన్ని తప్పుబడుతూ మీడియాకు ఎక్కారు.
నెల్లూరు పరిణామాలు ఇలా కొనసాగుతుండగానే ఈసారి ప్రకాశం జిల్లాలో వైసీపీలో అసమ్మతి పోరు రాజుకుందనే వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం సంతనూతలపాడు వైసీపీ ఎమ్మెల్యేగా సుధాకర్ బాబు ఉన్నారు.
గుంటూరు జిల్లాకు చెందిన సుధాకర్ బాబు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అప్పట్లో కాంగ్రెస్ అధిష్టానం రాహుల్ గాంధీ తదితరులతో సంబంధాలతో సుధాకర్ బాబు రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కాగలిగారు.
ఆ తర్వాత 2019లో వైసీపీలో చేరిన సుధాకర్ బాబు కు గుంటూరు జిల్లాలో పోటీ చేయడానికి చాన్సు లేకపోవడంతో గుంటూరు జిల్లాను ఆనుకుని ఉండే సంతనూతలపాడు సీటును ఇచ్చారు. వైసీపీ గాలిలో స్థానికుడు కానప్పటికీ సుధాకర్ బాబు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
మొదట్లో పరిస్థితులు బాగానే ఉన్నా.. రానురాను ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఒంటెద్దు పోకడలు పోతున్నారని.. పార్టీలో ఉన్న ద్వితీయశ్రేణి నాయకులు కార్యకర్తలను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని అసమ్మతి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డికి ఫిర్యాదు చేశారు. బాలినేని చొరవతో కొంతకాలం పరిస్థితి సద్దుమణిగింది.
మళ్లీ ఇటీవల సంతనూతలపాడు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైనా కమ్మ సామాజికవర్గం కీలకంగా ఉంది. వీరంతా గత ఎన్నికల్లో వైసీపీకి మద్దతిచ్చారు. అయితే ఇప్పుడు సుధాకర్ బాబు తమను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని వారంతా ఎమ్మెల్యేకు వ్యతిరేకమైనట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో సుధాకర్ బాబు కు సీటు ఇస్తే తాము అతడిని గెలిపించే పరిస్థితి లేదని వైసీపీ పెద్దలకే తేల్చిచెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. మరి ఈ పరిణామాలపై వైసీపీ అధిష్టానం ఎలా వ్యవహరిస్తుందో వేచిచూడాల్సిందే!
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.