ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో తన సొంత ప్రభుత్వంపైనే నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తన కోటరీలోని బోరుగడ్డ అనిల్ వంటివారితో తనను తన తమ్ముడిని చంపుతామని బెదిరిస్తున్నారని.. వీటికి తాను భయపడబోనని కోటంరెడ్డి వార్నింగ్ ఇచ్చారు. దీంతో వైసీపీ అధిష్టానం ఆయనను నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇంచార్జిగా తప్పించింది. అంతేకాకుండా ఆయనకున్న భద్రతను కూడా కుదించింది.
మరోవైపు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు వైఎస్సార్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని నెల్లూరు రూరల్ వైసీపీ ఇంచార్జిగా నియమిస్తోందని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని వైసీపీ తరఫున బరిలోకి దించుతారని చెప్పుకున్నారు.
అయితే గిరిధర్ రెడ్డి వైసీపీ అధిష్టానం మాయలో పడలేదు. తన సోదరుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితోనే నడవాలని నిర్ణయించుకున్నారు. దీంతో నెల్లూరు రూరల్ వైసీపీ ఇంచార్జిగా వైసీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని వైసీపీ అధిష్టానం నియమించింది.
తాజాగా వైసీపీ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని ఆ పదవి నుంచి తప్పించింది. అంతేకాకుండా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడంటూ ఆయనను వైసీపీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
అయితే నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని మాత్రం పార్టీ నుంచి బహిష్కరించలేదు. పొమ్మనకుండా పొగబెట్టింది. పార్టీ నుంచి శ్రీధర్ రెడ్డిని సస్పెండ్ చేస్తే ఆయనకు సానుభూతి వస్తుందని వైసీపీ అధిష్టానం భయపడుతోందని అంటున్నారు.
మరోవైపు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.. తన అన్న శ్రీధర్ రెడ్డి తిరుగుబాటు నుంచి ఆయనతోనే ఉంటున్నారు. అసలు పార్టీలో లేనివాడిని ఇప్పుడు తీరిగ్గా సస్పెండ్ చేయడం ఏమిటనే సెటైర్లు పడుతున్నాయి.
ఇంకోవైపు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికలనాటికి టీడీపీలో చేరాలని ఆకాంక్షిస్తున్నారు. ఇప్పటికే ఆయన తన మనసులో మాటను బయటపెట్టారు. అంతా అనుకున్నట్టు జరిగితే 2024లో టీడీపీ అభ్యర్థిగా నెల్లూరు రూరల్ లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోటీ చేయడం ఖాయమని చెబుతున్నారు.
అయితే ఈలోపు తన తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని టీడీపీలో చేర్చుతున్నారు. ఇందుకు ముహూర్తం కూడా ఖరారైందని టాక్ నడుస్తోంది. మార్చి 24న కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి టీడీపీలో చేరతారని చెబుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరతారని అంటున్నారు.
మరోవైపు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై వైసీపీ ఓటేయలేదు. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఆయన ప్రజల్లో సానుభూతి పొందే అవకాశం ఉంది కాబట్టి పొమ్మనకుండా పొగబెట్టిస్తోంది. తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వినూత్న నిరసనకు దిగారు. తన నియోజకవర్గ సమస్యలను పరిష్కరించాలని ప్లకార్డును పట్టుకుని ఆయన నడుచుకుంటూ అసెంబ్లీకి వచ్చారు.
ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు వంటి మంత్రులు కోటంరెడ్డిని నమ్మక ద్రోహి అంటూ అసెంబ్లీ సాక్షిగా తిట్టిపోశారు. అంతేకాకుండా అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యే వరకు కోటంరెడ్డిని అసెంబ్లీకి రాకుండా సస్పెండ్ చేశారు. కోటంరెడ్డి ప్రభుత్వంపై అసెంబ్లీ వేదికగా విమర్శలు చేసే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్తగా ఆయనను సస్పెండ్ చేశారని చెబుతున్నారు.
అయితే కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి టీడీపీలో చేరినా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రం సస్పెండ్ అయ్యేవరకు వైసీపీలోనే ఉండి ఆ పార్టీపై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసే ఉద్దేశంతోనే ఉన్నారని అంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ లో టీడీపీ సీటు ఇస్తే పోటీ చేస్తానని ఇప్పటికే తన మనసులో మాటను బయటపెట్టారు. దీంతో నెల్లూరు రాజకీయం రసకందాయంలో పడింది. మరోవైపు టీడీపీ ఏమాత్రం తొందరపడకుండా కోటంరెడ్డి వ్యవహారంలో ఆచితూచి వ్యవహరిస్తోంది.
మరోవైపు కోటంరెడ్డి బ్రదర్స్ ని టీడీపీలోకి తీసుకోవద్దని అధిష్టానానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ నేతలు నాయకులు ఎంత మొర పెట్టుకున్నా వినడం లేదని అంటున్నారు. దీంతో మార్చి 24న గిరిధర్ రెడ్డి టీడీపీ కండువా కప్పుకొనేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. దీంతో తొలి నుంచి పార్టీలో ఉన్న నాయకులు ఆలోచనలో పడిపోయారని అంటున్నారు.
ప్రస్తుతం నెల్లూరు రూరల్ టీడీపీ నియోజకవర్గ ఇంచార్జిగా అబ్దుల్ అజీజ్ ఉన్నారు. నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కూడా ఆయనే ఉన్నారు. గత ఎన్నికల్లో ఈయన కోటంరెడ్డిపై టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు కోటంరెడ్డి టీడీపీలోకి వస్తుండటంతో అబ్దుల్ అజీజ్ కు ఈసారి కష్టమేనంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వైసీపీ వైపు చూస్తున్నారన్న టాక్ నడుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.