Begin typing your search above and press return to search.

అరెస్టులతో వైసీపీ సోషల్ కార్యకర్తల్లో అలజడి..

By:  Tupaki Desk   |   31 July 2021 10:30 AM GMT
అరెస్టులతో వైసీపీ సోషల్ కార్యకర్తల్లో అలజడి..
X
రాజకీయాల్లో.. రాజకీయ పరిణామాల్లో సోషల్ మీడియా ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. గడిచిన పదేళ్లలో వచ్చిన మార్పులు అన్ని ఇన్ని కావు. ఆ మాటకు వస్తే 2019లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ విజయం వెనుక సోషల్ మీడియా ఎంతలా పని చేసిందన్న విషయం వైసీపీ అధినేతలకు బాగానే తెలుసు. ఈ కారణంతోనే.. అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ ప్రత్యర్థుల్నిబలహీనపర్చటానికి వారంతా మరింత యాక్టివ్ గా ఉండాలని నేతలు బాహాటంగా ప్రకటనలు చేయటం తెలిసిందే.

అంతేనా.. దాదాపు రెండు వేల మంది సోషల్ మీడియాలో పని చేసేందుకు వీలుగా నియామకాలు జరుపుతామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గతంలో ప్రకటన చేశారు. అంతేకాదు.. సోషల్ మీడియా కార్యకర్తలకు తాము అండగా ఉంటామని వైసీపీ ముఖ్యనేతలు పలు సందర్భాల్లో ప్రకటించారు. కానీ.. ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్న మాట వినిపిస్తోంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.. ఇతర న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు పెడుతున్న పోస్టులు కలకలం రేపుతున్నాయి. వీటిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి.. చర్యలు తీసుకోవాలని ఏపీ సీఐడీని ఆదేశించింది.

అయితే.. హైకోర్టు ఆదేశాలకు సీఐడీ అధికారుల స్పందన సరిగా లేదంటూ సీబీఐ విచారణకు ఏపీ హైకోర్టు ఆదేశాలుజారీ చేసింది. దీంతో.. ఈ అంశంపై విచారణ జరిపిన సీబీఐ కేసులు నమోదు చేసింది. ఇందులో భాగంగా తాజాగా పలువురు సోషల్ మీడియా కార్యకర్తల్ని సీబీఐ అరెస్టు చేసింది. కోర్టుల్లో జడ్జిలు ఇచ్చిప తీర్పులపై అనుచిత వ్యాఖ్యలతో పోస్టులు పెట్టిన కేసులో ప్రధాన నిందితుడైన ప్రకాశం జిల్లాకు చెందిన కొండారెడ్డిని.. గుంటూరుకుచెందిన సుధీర్ ను పోలీసులు అరెస్టు చేశారు. వారిద్దరిని గుంటూరులోని నాలుగో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జికోర్టులో హాజరు పర్చగా.. పదిహేను రోజులు రిమాండ్ కు ఆదేశాలు జారీ చేశారు.

గత ఏప్రిల్ 17న పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం ప్రవేశ పెట్టిన వైనంపై.. ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇచ్చిన హైకోర్టు తీర్పు నేపథ్యంలో.. అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కొండారెడ్డి ఫేస్ బుక్ లో ఒక పోస్టు పెట్టారు. ఈ పోస్టును గుంటూరుకు చెందిన సుధీర్ షేర్ చేశారు. కొద్ది రోజుల క్రితం కడపజిల్లాకు చెందిన లింగారెడ్డి రాజశేఖర్ రెడ్డి కూడా కోర్టు ఆదేశాలతో రిమాండ్ లో ఉన్నారు. ఇలా ఒకటి తర్వాత ఒకటిగా జరుగుతున్న అరెస్టులు వైసీపీ కార్యకర్తలు.. సానుభూతిపరుల్లో ఆందోళన పెరుగుతోంది.

తమకు అండగా ఉంటామని వైసీపీ నేతలు చెబుతున్నప్పటికీ.. అరెస్టులు జరిగిన సమయంలో మాత్రం ముఖం చాటేస్తున్నారని.. ఎలాంటి ఆర్థిక పరమైన.. న్యాయ సంబంధమైన సాయం అందించటం లేదన్న విమర్శ బలంగా వినిపిస్తోంది. దీంతో.. కొందరు ముందు జాగ్రత్తగా తమ అకౌంట్లను డిలీట్ చేస్తుంటే.. మరికొందరు పోస్టుల్ని డిలీట్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికి యాక్టివ్ గా ఉన్న వారు మాత్రం గతంలో మాదిరి వివాదాస్పద పోస్టులు పెట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదే సమయంలో తమ అకౌంట్లలో న్యాయవ్యవస్థకు సంబంధించి తాము చేసిన పోస్టులను డిలీట్ చేస్తూ జాగ్రత్త పడుతున్నారు.

సోషల్ మీడియా కార్యకర్తల్ని రక్షించుకునే విషయంలో పార్టీ అనుసరిస్తున్న తీరు ఏ మాత్రం బాగోలేదన్న మాట వినిపిస్తోంది. పార్టీకి అండగా నిలిచి.. పార్టీపై ప్రత్యర్థులు చేసే విమర్శల్ని బలంగా తిప్పి కొట్టే కార్యకర్తలకు కష్టం వచ్చినప్పుడు.. వారికి తాము ఉన్నామన్న భరోసా ఇవ్వాల్సిన అవసరం పార్టీ మీద ఉందంటున్నారు. అయితే.. న్యాయమూర్తుల విషయంలో కలుగజేసుకుంటే.. వారి వెనుక తామే ఉన్నామన్న విషయం లేనిపోని ఇబ్బందులకు తెచ్చి పెడుతుందన్న ఉద్దేశంతో ఎవరికి వారు వెనకుడుగు వేస్తున్నట్లు చెబుతున్నారు. జరుగుతున్న పరిణామాలు అధినేత జగన్ కు తెలీవని.. తెలిసి ఉంటే.. తమను తప్పనిసరిగా ఆదుకుంటారన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న అరెస్టులు.. అధికారుల చర్యలు జగన్ వరకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది.