ఆ వైసీపీ ఎమ్మెల్యే ప్రతి పెట్రోల్ బంక్‌లో రూ.30 లక్షల అప్పు!

Thu Jan 20 2022 17:00:01 GMT+0530 (IST)

YCP MLA owes Rs 30 lakh to each petrol bank

ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ ఎమ్మెల్యే ఆయన.. స్వతహాగా కాంట్రాక్టరు కూడా.. తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులన్నింటినీ ఆయనే సొంతంగా చేయిస్తున్నారు. అందు కోసం నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని పెట్రోల్ బంకుల్లో ముందు డబ్బులు ఇవ్వకుండా అప్పు చేసి మరీ ఇంధనం కొట్టించారు. ఒక్కో పెట్రోల్ బంకులో రూ.30 లక్షల వరకూ ఇలా అప్పు పేరుకుపోయిందంటా. తీరా ఇప్పుడు తీర్చమని అడిగితే నిధులు రావడం లేదు.. బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.. అని  తప్పించుకునే కారణాలు చెప్తున్నారని తెలిసింది. దీంతో ఆ పెట్రోల్ బంకుల యజమానులు గగ్గోలు పెడుతున్నట్లు సమాచారం.ఏ కాంట్రాక్టర్ అయినా ముందుగా పని చేయించి ఆ తర్వాత ప్రభుత్వానికి బిల్లులు పెట్టుకుని నిధులు తిరిగి పొందుతారు. కానీ ఇప్పుడు ఏపీలో ఆర్థిక పరిస్థితి కారణంగా కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చేసిన పనులకు నిధులు విడుదల చేయాలంటూ ఆందోళనలూ చేస్తున్నారు. ఇక సొంతంగా కాంట్రాక్టర్ అయిన వైసీపీ ఎమ్మెల్యే పరిస్థితి కూడా అలాగే ఉందని టాక్.  అన్ని పనుల కోసం నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోని పెట్రోల్ బంకులు ఆయన అప్పుతో పెట్రోలు డీజిల్ కొట్టించారు. కానీ గత రెండేళ్లుగా మాత్రం ఆ అప్పు తీర్చడం లేదని తెలిసింది. డబ్బులు ఇవ్వాలని అడిగితే మాత్రం.. బిల్లులు రాలేదని ఓ సారి కరోనా వచ్చిందని మరోసారి వచ్చే వారం ఇస్తానని ఇంకోసారి ఇలా వాయిదా వేస్తున్నారని తెలిసింది.

ప్రతి పెట్రోల్ బంకులోనూ అప్పు చేసి తిరిగి ఇవ్వాలంటే మాత్రం ఏదో కారణం చెబుతున్నారని ఆ యజమానులకు తెలిసిపోయింది. అందుకే వాళ్లు కూడా ఇక ఆ ఎమ్మెల్యేకు అప్పుగా పెట్రోల్ డీజిల్ కొట్టలేమని చేతులెత్తేశారని సమాచారం. ఈ నేపథ్యంలో బిల్లులు వచ్చిన తర్వాత ఇస్తా కదా కొట్టమని ఎమ్మెల్యే చెబుతున్నారంటా! ఎంతైనా అధికార ఎమ్మెల్యే కదా అని ఏదో మాట మీద పెట్రోల్ డిజీలు కొట్టిస్తే ఇప్పడు ఇలా చేయడమేంటని యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆ ఎమ్మెల్యేపై అసంతృప్తి నాయకులు మాత్రం వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. పెట్రోల్ బంకు యజమానులకు వీళ్లు ఫోన్ చేసి ఆ ఎమ్మెల్యే మీకు డబ్బులు ఇవ్వడని చెబుతున్నారని తెలిసింది.

వచ్చే ఎన్నికల్లో ఆ ఎమ్మెల్యేకు పార్టీ సీట్ ఇవ్వదని.. ఒకవేళ ఇచ్చినా మళ్లీ గెలవడం కష్టమని చెబుతున్నారంటా. అందుకే ఆ ఎమ్మెల్యేకు ఇంకా అప్పు ఇస్తే ఇబ్బందులే మిగులుతాయని పార్టీ వాళ్లే అంటున్నారని టాక్. దీంతో ఏం చేయాలో తెలీని పరిస్థితుల్లో పడిపోయామని పెట్రోల్ బంకు యజమానులు అంటున్నారు.