Begin typing your search above and press return to search.

వైఎస్సార్సీపీలో వర్గ విబేధాలు భగ్గు.. ఎమ్మెల్యే మరిదిపై దాడి

By:  Tupaki Desk   |   21 Feb 2020 6:27 AM GMT
వైఎస్సార్సీపీలో వర్గ విబేధాలు భగ్గు.. ఎమ్మెల్యే మరిదిపై దాడి
X
గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో వర్గ విబేధాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే, ఎంపీ మధ్య విబేధాలు తలెత్తడంతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే పరిస్థితికి చేరాయి. మొన్నటికి మొన్న నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు కారును అడ్డుకున్న రజనీ వర్గీయులు తాజాగా గురువారం రాత్రి ఎంపీ వర్గీయులు ఎమ్మెల్యే మరది కారును అడ్డుకున్నారు. ఎమ్మెల్యే మరదిపై ఏకంగా దాడులకు పాల్పడి తీవ్రంగా గాయపడేలా చేశారు. దీంతో ఒక్కసారిగా అధికార పార్టీలో విబేధాలు తారస్థాయికి చేరాయి.

చిలకలూరిపేట వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే విడదల రజని మరిది గోపీనాథ్‌ గురువారం రాత్రి కోటప్పకొండలో మహాశివరాత్రి సందర్భంగా విద్యుత్ ప్రభల ఏర్పాట్లు చూసి వస్తున్నారు. ఈ క్రమంలో చిలకలూరిపేట మండలం కట్టుబడివారిపాలెం వద్దకు రాగానే పలువురు గోపినాథ్ కారుపై దాడులకు పాల్పడ్డారు. ఎమ్మెల్యే రజని కారులో ఉన్నారని భావించి రౌడీయిజానికి దిగారు. ఈ సంఘటనలో కారు ధ్వంసమైంది. గూండాల మాదిరి కారుపై దాడులు చేశారు. రాళ్లతో కొట్టడంతో కారు అద్దాలు పగిలి కారు లోపల రాళ్లు పడ్డాయి. కోటప్పకొండలో ప్రభను వదిలి వస్తుండగా టీడీపీ నాయకులు మాపై దాడి చేశారని, ఎమ్మెల్యే కారులో ఉన్నారని భావించి ఈ ఘటనకు పాల్పడ్డారని ఈ సందర్భంగా ఆయన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ నెపం తెలుగుదేశం పార్టీపైకి నెట్టారు.

ఎమ్మెల్యే రజనీ స్వగ్రామం పురుషోత్తపట్నం లో ఈ దాడి జరిగింది. దీంతో ఎమ్మెల్యే వర్గీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే నిందితులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేశారు. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మర్రి రాజశేఖర్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారని ఎమ్మెల్యే రజినీ గుర్రుగా ఉన్నారని, అందుకే ఎంపీ, ఎమ్మెల్యే మధ్య విబేధాలు వచ్చాయని తెలుస్తోంది. అయితే వీరిద్దరి మధ్య గతంలో ప్రోటోకాల్ విషయంలో వివాదం ఏర్పడింది. ఇప్పుడు పరస్పరం దాడులు చేసుకునే స్థాయికి చేరడంతో భవిష్యత్ ఏం జరుగుతుందో వేచి చూడాలి.