Begin typing your search above and press return to search.

ఎన్నిక‌ల ఎఫెక్ట్‌.. నియోజ‌క‌వ‌ర్గాన్ని కోన‌సీమ చేస్తా: వైసీపీ ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   10 Jun 2023 12:17 PM GMT
ఎన్నిక‌ల ఎఫెక్ట్‌..  నియోజ‌క‌వ‌ర్గాన్ని కోన‌సీమ చేస్తా:  వైసీపీ ఎమ్మెల్యే
X
ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డి నాలుగు సంవ‌త్స‌రాలు పూర్త‌యి పోయాయి. మ‌రి ఈ నాలుగేళ్ల‌లో ఎమ్మె ల్యేలు త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల‌ను ఏ మేర‌కు ప‌ట్టించుకున్నారు? అంటే.. ప్ర‌శ్న త‌ప్ప‌.. స‌మాధానం ల‌భించదు. కానీ, ఇప్పుడు ఎన్నిక‌లకు స‌మ‌యం చేరువ అవుతుండ‌డంతో వైసీపీ ఎమ్మెల్యేలు కోత‌లు కోస్తున్నార‌ని టీడీపీ నాయ‌కులు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గాన్ని కోన‌సీమ చేస్తానంటూ.. చుక్క‌నీటికి అల్లాడే .. అనంత‌పురం జిల్లాలోని శింగ‌న‌మ‌ల ఎమ్మెల్యే ప్ర‌క‌టించడం ఇప్పుడు రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారితీసింది.

ఎమ్మెల్యే ఏమ‌న్నారంటే..

శింగనమల నియోజకవర్గాన్ని కోనసీమగా మారుస్తామని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. సాగునీటి వనరులను వినియోగించుకుని పచ్చని పంట పొలాలతో అలరారేలా చూస్తామన్నారు. సీఎం జ‌గ‌న్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఎక్కడ చూసినా చెరువులు, కుంటలు, కాలువలు నీటితో కళకళలాడుతున్నాయన్నారు.

తాను ఎన్నికల సమయంలో సాగునీరు ఇచ్చాకే గ్రామాల్లోకి అడుగుపెడతామని హామీ ఇచ్చానని, ఆ మేరకు నియోజకవర్గంలో అన్ని చెరువులు, కుంటలను నీటితో నింపిన తరువాతే ప్రజల ముందుకు వస్తున్నానని చెప్పారు.

నియోజకవర్గంలోని దాదాపు 50 చెరువులు, నీటి కుంటలకు హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌, హెచ్చెల్సీ ద్వారా నీటిని కేటాయించాలని తాను ముఖ్యమంత్రిని కోరామన్నారు. సానుకూలంగా స్పందించిన జగనన్న ఒక చెల్లికి కానుకగా హంద్రీ–నీవా ద్వారా 45 చెరువులకు 1.35 టీఎంసీల నీటిని కేటాయిస్తూ జీఓ విడుదల చేశారని తెలిపారు. తమతో పాటు నియోజకవర్గ ప్రజలంతా జగనన్నకు రుణపడి ఉంటామన్నారు.

ప్ర‌స్తుత స‌మ‌స్య‌లు ఇవీ..

+ నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్ప‌టికీ ఉపాధి లేక కార్మికులు వ‌ల‌స బాట ప‌డుతున్నారు.
+ ముఖ్యంగా వ్య‌వ‌సాయ కార్మికులు ప‌నులు లేక‌.. కూలి ప‌నులు చేసుకునేందుకు రెడీ అయ్యారు.
+ ఉపాధి హామీ ప‌థ‌కంలో కూలి ప‌నుల కోసం రిజిస్ట‌ర్ అవుతున్న‌వారిలో శింగ‌న‌మ‌ల నియోజ‌క‌వ‌ర్గం వాసులే ఎక్కువ‌గా ఉండ‌డం గ‌మ‌నార్హం.