పెందుర్తిలో హోమియో వైద్యురాలిపై వైసీపీ ఎమ్మెల్యే అనుచరుడి ఆరాచకం

Sun Aug 14 2022 12:04:26 GMT+0530 (IST)

YCP MLA Follower Attacked Homeo Doctor in Pendurthi

భయమన్నది బొత్తిగా లేకుండా పోతుందా? తామేం చేసినా నడుస్తుందన్న నమ్మకం ఆరాచకవాదుల్లో పెరిగిపోతోందా? తమ సన్నిహితుల చేతిలో అధికారం ఉన్న వేళ.. తామెలా వ్యవహరించినా.. ఎవరేం చేయలేరన్న బరితెగింపు దారుణ ఉదంతాలకు దారి తీయటమే కాదు.. వైసీపీ ప్రభుత్వానికి చెడ్డపేరును తీసుకొస్తోంది. తాజాగా అలాంటి పరిస్థితే విశాఖ జిల్లా పెందుర్తిలో చోటు చేసుకుంది.నడి రోడ్డు మీద.. బైక్ మీదకు ఎక్కి.. కత్తి పట్టుకొని ఒక హోమియా డాక్టర్ కుటుంబాన్ని బెదిరించిన వైనం షాకింగ్ గా మారింది. ఎంత అధికార పార్టీ ఎమ్మెల్యేకు చెందిన అనుచరుడు అయితే మాత్రం ఏంది? మరీ.. .ఇంతలా బరితెగించటమా? రోడ్డు మీద అందరూ చూస్తున్న వేళలోనే ఇంతలా చేసినా.. అతడి మీద కంప్లైంట్ వచ్చింది కాబట్టి.. దాన్ని తీసుకున్నారే కానీ.. ఇప్పటివరకు అదుపులోకి తీసుకున్నది లేదు. ఇంతకూ అసలేం జరిగింది? ఈ ఆరాచకపు ఘటనకు కారణమేంది? అన్న వివరాల్లోకి వెళితే..

విశాఖ జిల్లా పెందుర్తిలోని వేగివారి వీధికి చెందిన మౌనిక హోమియో వైద్యురాలిగా పని చేస్తున్నారు. ఆమె భర్త.. కుటుంబ సభ్యులతో పాటు కలిసి టూ వీలర్ మీద ఒక ఫంక్షన్ కు వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్నారు. ఇలాంటి వేళ.. వైసీపీ ఎమ్మెల్యే అదీప్ రాజు అనుచరుల్లో ఒకరిగా వ్యవహరించే మనోహర్.. అతని ఫ్రెండ్స్ అందరూ కలిసి మౌనిక టూ వీలర్ ను ఫాలో అయ్యారు. తమను ఫాలో అవుతున్న వారిపై మౌనిక భర్త రియాక్టు అయ్యారు. కాసింత అసహనం వ్యక్తం చేశారు. ఫ్యామిలీతో వెళుతున్న తమను చికాకు పెట్టటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీంతో.. రెచ్చిపోయిన మనోహర్.. అతని గ్యాంగ్ తమ వాహనాల్ని మరింత వేగంగా నడిపి.. మౌనిక భర్త నడుపుతున్న బైక్ కు ముందుగా వచ్చి.. సడన్ బ్రేక్ వేశారు. దీంతో.. బండిని కంట్రోల్ చేసుకునే విషయంలో తేడా వచ్చి మనోహర్ వాహనాన్ని ఢీ కొన్నాడు. దీంతో.. రెచ్చిపోయిన మనోహర్ వారితో వాగ్వాదానికి దిగాడు. అందరూ చూస్తుండగానే బైక్ మీదకు ఎక్కి.. కత్తి బయటకు తీసి.. పొడిచేస్తానంటూ అసభ్యకరంగా మాట్లాడుతూ దారుణంగా హెచ్చరించాడు. మౌనిక పట్ల అసభ్యంగా వ్యవహరించాడు.

దీంతో.. ఏమీ పాలుపోని వారు తీవ్ర ఆవేదనతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఉదంతం సంచలనంగా మారింది. ఈ ఉదంతాన్ని స్థానిక ఎమ్మెల్యే వరకు తీసుకెళ్లారు కొందరు. మీడియా ప్రతినిధులు సైతం ఆయన్ను సంప్రదించగా.. మనోహర్ తమ పార్టీ కార్యకర్త కాదని తాను అనటం లేదని.. అసలేం జరిగిందో తెలుసుకున్న తర్వాత ఏం చేయాలో అది చేస్తామని వ్యాఖ్యానించటం గమనార్హం.

ఇప్పటికే కేసు నమోదు చేశారన్న ఆయన.. మనోహర్ చేసిన తప్పును తాను సమర్థించటం లేదన్నారు. తన మనిషి కాదని కూడా తాను చెప్పట్లేదని వ్యాఖ్యానించటం గమనార్హం. తప్పు చేస్తే ఎవరైనా ఒకటేనన్న ఆయన.. మరి దారుణంగా వ్యవహరించిన మన అనుచరుడి ఫోటోలు సోషల్ మీడియాలో ముంచెత్తుతున్న వేళ.. అతన్నివెంటనే అరెస్టు చేయాలని మాత్రం చెప్పక పోవటం గమనార్హం. ఏమైనా.. ఇలాంటి ఉదంతాలు వైసీపీ సర్కారు ఇమేజ్ డ్యామేజ్ చేస్తాయన్న మాట వినిపిస్తోంది.