Begin typing your search above and press return to search.

ముసలాయన... అవుట్ డేటెడ్... జనాలు ఏమనుకుంటున్నారు...?

By:  Tupaki Desk   |   30 Jan 2023 10:38 PM GMT
ముసలాయన... అవుట్ డేటెడ్... జనాలు ఏమనుకుంటున్నారు...?
X
రాజకీయాల్లో ఉన్న వారికి పదవీ విరమణ వయసు ఉండాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. కానీ అది వృత్తి కాదు, ప్రవృత్తి. సో దానికి నో ఏజ్ లిమిట్. సినీ రంగంలో ఉన్న వారు ఏడు పదులు దాటినా హీరోలుగా వేస్తున్న రోజులు ఇవి. ఇక రాజకీయాల్లో ఉన్న వారు సైతం తమకు ఓపిక ఉంటే ఎంత కాలం అయినా ప్రజా జీవితంలో ఉండవచ్చు. ఆ విషయంలో అభ్యంతరాలు ఉంటే గింటే జనాల నుంచే ఉండాలి.

ఓల్డ్ జనరేషన్ అని ప్రత్యర్ధులు అంటే మాత్రం జనాలు వారిని దూరం పెడతారా అలా పెట్టగలరా. నిజానికి పాత ఆవకాయకు ఎంత రుచి ఉంటుందో అలాగే పాతతరం నాయకుడి పట్ల భారత దేశం లాంటి దేశాలలో మోజు ఉంటుంది అని అంటారు. ఎందువల్ల అంటే వారిది తలపండిన అనుభవం అని జనాలు నమ్ముతారు. భారత్ లాంటి సనాతన ధర్మాన్ని నమ్మే దేశాలలో ఏజ్ కే విలువ ఇస్తారు. వారే నాయకులుగా ఉండాలనుకుంటారు.

వారిలో వయసుతో పాటు వచ్చే రాజకీయ పరిణతి ప్రభుత్వం సజావుగా పనిచేయడానికి అభివృద్ధికి దోహదపడుతుందని భావిస్తారు. అందుకే ఇండియాలో ఎక్కువ మంది ఓల్డ్ జనరేషన్ పొలిటీషియన్స్ ఉంటారు. ఇదంతా ఎందుకు అంటే ముఖ్యమంత్రి జగన్ చటుక్కున తెలుగుదేశం అధినేత చంద్రబాబుని పట్టుకుని ముసలాయన అని అనేశారు. బాబు పేరు ఎత్తకుండా పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన మీటింగులో ఆసాంతం విమర్శించారు.

ఆ ముసలాయన అంటూ సెటైర్లు పేల్చారు. అవుట్ డేట్ పొలిటీషియన్ గా బాబుని జనం ముందు పెట్టారు. యువకుడు అయిన తాను కావాలో ముసలాయన కావాలో తేల్చుకోమంటూ జనాలకే అతి పెద్ద టెస్ట్ పెట్టారు. ఒక విధంగా చూస్తే జగన్ యాధాలాపంగా అని ఉంటారు అని ఎవరూ అనుకోరు. జగన్ లాంటి వారు ఏది మాట్లాడినా దాని వెనకాల వ్యూహం ఉంటుంది. ఆయన చూపు ఫోకస్ అంతా ఇపుడు వచ్చే ఎన్నికల మీద ఉంది.

ఆయన అనేక అంశాల్తో ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తున్నారు. ఇక చంద్రబాబుని విశ్వసనీయత లేని నాయకుడిగా ఇప్పటిదాకా చూపుతూ వచ్చిన జగన్ ఇపుడు మాత్రం ముసలాయన అంటూ ఏకంగా ఆయన రాజకీయంగా అనర్హుడు అనేట్లుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. వయో వృద్ధులు మనకు అవసరమా వారి నస చాదస్తం అవసరమా అని జనాలను అడుగుతున్నారు అన్న మాట.

యువతరం ఓటర్లు ఎపుడూ ప్రతీ ఎన్నికల్లోనూ పెరుగుతూ ఉంటారు. వారిని టార్గెట్ చేస్తూ జగన్ ఈ విధంగా మాట్లాడారు అనుకోవాలి. నిజానికి జగన్ బాబు ఏజ్ ని ఎత్తి చూపుతూ 2014లో కూడా విమర్శలు చేశారు. తాను యువకుడిని అని ఆ ఎన్నికల్లో గెలిపించమని కోరారు. కానీ నాడు బాబు అనుభవం ముందు ఆయన యువకుడు కార్డ్ వీగిపోయింది. కానీ ఇపుడు జగన్ కి కూడా ముఖ్యమంత్రిగా అనుభవం ఉంది. సో ఇపుడు బాబు ఏజ్ ఫ్యాక్టర్ ని తీస్తే కచ్చితంగా తనకు కలసివస్తుందని అనుకుంటూ ముసలాయన అని ట్యాగ్ తగిలించి మరీ టీజ్ చేస్తున్నారు.

మరి ఏపీ జనాలు బాబుని ఓల్డ్ లీడర్ గా చూస్తున్నారా అనేది చూడాలి. అలా అనుకుంటేనే బాబుకు అది మైనస్ అవుతుంది. ఆ మాటకు వస్తే దేశంలో బాబు వయసు ఉన్న మోడీ ప్రధానిగా ఉన్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో మరోసారి ప్రధనిగా పోటీ పడనున్నారు. ఆయనతో పోలిస్తే బాగా చిన్నవాడు అయిన రాహుల్ గాంధీ యువకుడుగా ఉన్నారు.

ఈ ఇద్దరిలో ఎవరిని ఎంచుకుంటారు అంటే ఈ రోజుకీ మోడీకే రేటింగ్ ఎక్కువగా ఉంది. అలాగే దేశంలో మోడీని తప్పించి పవర్ లోకి రావాలని చూస్తున్న ప్రధాని అభ్యర్ధులలో నితీష్ కుమార్ ఏడున్నర పదుల వయసు వారు. శరద్ పవార్ ఎనిమిది పదులు దాటిన వారు. మమతా ఆరున్నర పదులు దాటిన వారు. కేసీయార్ ఏడు పదులకు చేరువగా ఉన్నారు

మరి ఈ లిస్ట్ చూస్తే అంతా ఓల్డ్ జనరేషన్ కనిపిస్తారు. మరి జనాలు యంగ్ అని ఆలోచిస్తే ఒక్క రాహుల్ లేదా కేజ్రీవాల్ ని తప్ప మరొకరిని ఎన్నుకోకూడదు అలా జరుగుతుందా. అంటే దేశ రాజకీయాల్లో చూసినా ఏపీ పాలిటిక్స్ లో చూసినా ఏజ్ అనేది ఒక మైనస్ పాయింట్ కానే కాదు అని అంటున్నారు. మరి జగన్ ప్రయోగిస్తున్న ఈ ముసలాయన అన్న అస్త్రం ఆయనకు వైసీపీకి మేలు చేస్తుందా లేక బూమరాంగ్ అవుతుందా అంటే వెయిట్ అండ్ సీ.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.