Begin typing your search above and press return to search.

నాని వ్యాఖ్యలతో ప్రభుత్వానికి మైలేజ్ కన్నా డ్యామేజ్ ఎక్కువ

By:  Tupaki Desk   |   21 Sep 2020 5:35 PM GMT
నాని వ్యాఖ్యలతో ప్రభుత్వానికి మైలేజ్ కన్నా డ్యామేజ్ ఎక్కువ
X
తిరుమల శ్రీవారి గుడిలోకి ప్రవేశించే అన్యమతస్థుల డిక్లరేషన్ పై తీవ్ర చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ వ్యవహారంపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ ఇచ్చారు. సీఎం జగన్ గతంలో పలుమార్లు శ్రీవారిని దర్శించుకున్న సమయంలో డిక్లరేషన్ సమర్పించలేదని, అలాగే సోనియాగాంధీ వైఎస్ఆర్ కూడా డిక్లరేషన్ పై సంతకం చేయలేదని చెప్పారు. తన మాటలను వక్రీకరించారని,డిక్లరేషన్ అంశానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. శ్రీవారిని దర్శించుకునే హిందూయేతరులు డిక్లరేషన్ ఇవ్వాలని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేస్తూ ఈ వివాదానికి ముగింపు పలికారు. ఈ నేపథ్యంలో తిరుమల డిక్లరేషన్ పై మంత్రి కొడాలి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ గుడికి, మసీదుకి, చర్చికి లేని డిక్లరేషన్ తిరుమలలో ఎందుకని కొడాలి నాని ప్రశ్నించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పడు ఎప్పుడూ డిక్లరేషన్ గురించి మాట్లాడలేదని, హిందు వాదులు, మతపెద్దలు డిక్లరేషన్ అడగడం లేదని, కేవలం టీడీపీ నేతలు, చంద్రబాబు మాత్రమే అడుగుతున్నారని అన్నారు.

సీఎం హోదాలో వెళ్లే వారిని డిక్లరేషన్ అడిగే హక్కు లేదని, శ్రీశైలంతోపాటు కనకదుర్గ వంటి ఆలయాల్లో లేని డిక్లరేషన్ సంప్రదాయం తిరుమలలో మాత్రం ఎందుకని ఆయన ప్రశ్నించారు. జగన్ సర్కారు వచ్చిన తర్వాత, ఆయన సీఎం అయిన తర్వాత చంద్రబాబు డిక్లరేషన్ అంటున్నారని, జగన్ ప్రతిపక్ష నేతగా తిరుమల వెళ్ళినప్పుడు చంద్రబాబు ఎందుకు అడగ లేదని ప్రశ్నించారు. నిజమైన హిందు వాదులు, మతం కోసం జీవితాలను ఇచ్చిన వారి నుంచి డిక్లరేషన్ పై అభ్యంతరాలు లేవని అయన అన్నారు. గత ఏడాది కూడా సీఎం హోదాలో జగన్ పట్టువస్త్రాలు సమర్పించారని, అపుడు లేని డిక్లరేషన్ అంశాన్ని ఇపుడు పట్టు వస్త్రాలు సమర్పించేటపుడు మాత్రం ఎందుకు అడుగుతున్నారని నాని అన్నారు.

`` డిక్లరేషన్ పై అన్యమతస్థులు సంతకం పెట్టకుంటే గుడి అపవిత్రమవుతుందా? హిందువులు సంతకం పెట్టకపోయినా పవిత్రంగా ఉంటుందా? అసలు ఈ డిక్లరేషన్....ఎవరు పెట్టారు....దీనిపై చర్చ జరగాలి....అవసరమైతే ఈ రూల్ తీసేయాలి...ఇలాంటి రూల్స్ వల్లే కొన్ని వర్గాలు గుళ్లకు దూరమవుతున్నాయి``అని నాని షాకింగ్ కామెంట్లు చేశారు. ``అంతర్వేదిలో రథం దగ్ధం అయింది... వెండి సింహాలు దొంగతనం. ఆంజనేయ స్వామి విగ్రహం హస్తం ధ్వంసం, సాయిబాబా విగ్రహం తల ధ్వంసం చేయడం వంటి ఘటనల వల్ల వైసీపీకి లాభం చేకూరుతుందా? ``అని నాని ప్రశ్నించారు. కోటి రూపాయల విలువైన రథం దగ్దం కావడంతో గుడికి నష్టమేమీ లేదని ప్రభుత్వం కొత్త రథం చేయిస్తుందని, పది కేజీల వెండితో వచ్చే ఆరేడు లక్షల రూపాయలతో ప్రభుత్వం మిద్దలేమీ కట్టదని....ఇటువంటి ఘటనలకు పాల్పడేది విపక్షాలేనని అన్నారు.

ప్రభుత్వానిక వీటికి సంబంధించి ప్రభుత్వం దగ్గర కొన్ని ఆధారాలున్నాయని, ప్రభుత్వమే సుప్రీం కాదని నాని వ్యాఖ్యానించారు. చంద్రబాబే రాజకీయ లబ్ధికోసం ఇవన్నీ చేయిస్తున్నాడని తాను ఆరోపిస్తున్నానన్నారు. ఈ ఘటనలకు కారకులని అనుమానిస్తున్న కొందరు టీడీపీ నేతలు, కార్యకర్తలను అరెస్టు చేస్తే..అర్థరాత్రి వెళ్లి స్టే తెచ్చుకునే పరిస్థితులున్నాయని అన్నారు. బీజేపీ, జనసేన, టీడీపీలు హిందువులకు దగ్గరవడం కోసం ఇటువంటి ఘటనలను ప్రేరేపించి రాజకీయ లబ్ధి పొందుతున్నాయని, హిందువుల దృష్టిలో చాంపియన్లమని నిరూపించుకునేందుకు ఒళ్లు కొవ్వెక్కి పోటీ పడుతున్నాయని అన్నారు.

ఈ నేపథ్యంలో నాని వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి వ్యాఖ్యల వల్ల జగన్ కు చెడ్డపేరు వస్తుందన్న అభిప్రాయాలు రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ ఇచ్చారు. దీంతో, ఈ విషయం సద్దుమణిగింది అనుకుంటున్న సమయంలో నాని వ్యాఖ్యలు ఈ వివాదానికి ఆజ్యం పోసేలా ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది. తనపై బురదజల్లానని విపక్షాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా....సీఎం జగన్ ఎంతో ఓర్పుతో, సహనంతో ఎటువంటి కామెంట్లు చేయకుండా ఉంటున్నారని, అటువంటి సమయంలో ఇటువంటి వ్యాఖ్యలు పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ఉన్నాయని అనుకుంటున్నారు. సీఎం జగన్ అందిస్తున్న సుపరిపాలన చూడలేక ప్రతిపక్షాలు అవకాశం కోసం ఎదురు చూస్తున్నాయని, ఇప్పటికే వైసీపీపై మతం, కులం పేరుతో బురద జల్లుతున్నాయని, అటువంటి వారికి నాని వ్యాఖ్యలు ఆయుధంగా మారే అవకాశముందని అంటున్నారు.

మతం పేరుతో రాజకీయాలు చేయాలని చూస్తున్నవారికి వైవీ సుబ్బారెడ్డి, సీఎం జగన్ ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తున్న సమయంలో నాని వ్యాఖ్యలు విమర్శలకు తావిచ్చేలా ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే నాని భాష బాగోలేదంటూ విమర్శలు వస్తున్నా..అవి పొలిటికల్ కామెంట్ల కింద జనం పట్టించుకోవడం లేదని, కానీ, కోట్లాదిమంది హిందువుల మనోభావాలతో ముడిపడిన తిరుమల ఆలయం డిక్లరేషన్ వ్యవహారంలో నాని వ్యాఖ్యలు ఆమోదయోగ్యంగా లేవని అంటున్నారు. భవిష్యత్తులో తిరుమల విషయంతోపాటు హిందు మతానికి సంబంధించిన విషయాలు, మతపరమైన సున్నితమైన అంశాల విషయంలో నాని ఇటువంటి బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేయకుండా ఉంటే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.