పోటీకి జంకుతున్న వైసీపీ మాజీ మంత్రి...అందుకే...?

Fri Aug 12 2022 14:09:09 GMT+0530 (IST)

YCP ExMinister in Fear of Upcomming Elections

ఎన్నికలు అంటే రాజకీయ నేతలకు అగ్ని పరీక్ష లాంటివి. అవి కనుక పాస్ అయితే అయిదేళ్ల పాటు వారికి కదిపేవారు ఉండరు. ఒకప్పుడు అయితే ప్రజలు అంతా అమాయకులు కాబట్టి ఎన్నికల వేళ ఏవో కబుర్లు చెప్పి ఓట్లేయించేసుకునేవారు. ఇపుడు అంతా సోషల్ మీడియా యుగం. స్మార్ట్ ఫోన్ల కాలం. అందువల్ల జనాలు ఎవరూ కూడా ఒక్క మాట మీద ఉండడంలేదు. ఒకసారి చెప్పినా వినే సీన్ లేదు. దాంతో రాజకీయ నేతలకు గుండె గుబుల్ పట్టుకుంది.ఇదిలా ఉంటే విశాఖ జిల్లా వైసీపీ ప్రెసిడెంట్. భీమిలీ సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే విషయం మీద మల్లగుల్లాలు పడుతున్నారా అన్న చర్చ సొంత పార్టీలోనూ బయటా సాగుతోంది. భీమిలీ నుంచి ఇప్పటికి రెండు సార్లు ఆయన విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో ప్రజరాజ్యం తరఫున భీమిలీ నుంచి తొలిసారి ఎమ్మెల్యే అయిన అవంతి 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి అదే సీటు నుంచి పోటీ చేసి గెలిచారు.

అయితే ఒక వైపు జగన్ వేవ్ ఉంది. మరో వైపు చివరి నిముషంలో టీడీపీ క్యాండిడేట్ ని దించింది. అయినా సరే కేవలం తొమ్మిది వేల ఓట్ల తేడాతోనే అవంతి బయటపడ్డారు. సరైన అభ్యర్ధిని పెట్టి ముందుగానే పోటీలో ఉంటే కనుక టీడీపీ గెలిచే సీటు ఇదే అని కూడా అంటున్నారు. ఇక ఇక్కడ జనసేన తరఫున కొత్త అభ్యర్ధి బరిలోకి దిగితే ఏకంగా పాతిక వేల పై చిలుకు ఓట్లు వచ్చాయి.

రేపటి ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటే కనుక భీమిలీ సీటుని కచ్చితంగా ఎగరేసుకునిపోవడం ఖాయమనే అంటున్నారు. ఇక మూడున్నరేళ్ళ కాలంలో అవంతి శ్రీనివాసరావు మీద ఆయన పనితీరు మీద జనంలో వ్యతిరేకత వచ్చిందని అంటున్నారు. వైసీపీ సొంత సర్వేలలో కూడా అలాగే నివేదికలు వస్తున్నాయి. దాంతో భీమిలీలో క్యాండిడేట్ ని మారుస్తారు అని జోరుగా ప్రచారం సాగుతున్న వేళ అవంతి కూడా పోటీకి జంకుతున్నారా అనిపించేలా సంఘటనలు జరుగుతున్నాయి.

లేటెస్త్ గా చూస్తే అవంతి శ్రీనివాసరావు తమ ఏకైక కుమారుడు నందేష్ ని వెంటబెట్టుకుని జగన్ని తాడేపల్లిలో  కలిశారు. తన కుమారుడిని ముఖ్యమంత్రిని పరిచయం చేశారు. దీంతో రాజకీయ వర్గాలలో కొత్త చర్చ మొదలైంది. అవంతి తాను పోటీ నుంచి తప్పుకుని కుమారుడికి భీమిలీ సీటుని ఇప్పించుకునేందుకే జగన్ని కలిశారు అని అంటున్నారు.

అదే విధంగా భీమిలీ టిక్కెట్  వేరొకరికి పోకుండా కూడా అవంతి తెలివైన ఎత్తుగడ వేశారు అని కూడా అంటున్నారు. అయితే రాజకీయంగా సీనియర్ అయిన అవంతి మీదనే వ్యతిరేకత ఉంటే ఆయన కుమారుడు రాజకీయాలకు పూర్తిగా కొత్త అయిన నందేష్ మీద ఎందుకు వ్యతిరేకత ఉండదని కూడా ప్రశ్న వస్తోంది. పైగా అవంతి వారసుడిగా నందేష్ బరిలోకి దిగితే తండ్రి పలుకుబడితో పాటు వ్యతిరేకత కూడా ఆయనను చుట్టుముడుతుందని అంటున్నారు.

ఇక పోతే జగన్ కూడా పనితీరు ఆధారంగానే టికెట్లు ఇస్తామని చెబుతున్నారు. అవంతి ఫ్యామిలీ మీద వ్యతిరేకత కనుక ఉంటే కొత్త వారికే భీమిలీ టికెట్ దక్కడం ఖాయమని అంటున్నారు. మరోవైపు చూసే ఎన్నికలకు ఇంకా రెండేళ్ల వ్యవధి ఉండగనే అవంతి పోటీకి ఎందుకు జంకుతున్నారు అన్న చర్చ కూడా వస్తోంది. తన పనితీరుని మెరుగుపరచుకుని ఆయన తానే భీమిలీ నుంచి మళ్లీ పోటీ చేయవచ్చు కదా అని అన్న వారూ ఉన్నారు. మరి మాజీ మంత్రికి ఏ భయ సందేహాలు ఉన్నాయో తెలియదు కానీ వారసుడిని తెచ్చి ముందు పెట్టారని అంటున్నారు.