Begin typing your search above and press return to search.

ఎంపీపీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు ఎదురుదెబ్బ

By:  Tupaki Desk   |   25 Sep 2021 7:30 AM GMT
ఎంపీపీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు ఎదురుదెబ్బ
X
రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం జరిగిన మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికల్లో పలు చోట్ల అసమ్మతి అభ్యర్థులు జయకేతనం ఎగురవేసి అధికార వైసీపీకి షాక్ ఇచ్చారు. అధికార పార్టీకి ఆధిక్యం లభించినా కూడా అసమ్మతి వర్గాలు ఎదురుతిరిగాయి. దీంతో ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన వారు కాకుండా వేరే అభ్యర్థులు మండల పరిషత్ అధ్యక్షులయ్యారు.చేసేందేం లేక వారిని కూడా వైసీపీలో చేర్చుకొని ఎమ్మెల్యేలు తమ వారిగా చూపించి మమ అనేశారు.

ఏపీలో జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో అధికార వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలకు ఎదురుదెబ్బ తగిలింది. ఎంపీపీ స్థానానికి వారు బలపరిచిన అభ్యర్థులపై ఏకాభిప్రాయం రాలేదు. అసమ్మతి వర్గాల గైర్హాజరుతో కోరం లేక కొన్ని చోట్ల ఎన్నిక వాయిదా పడింది. అధికార పార్టీలోని రెండు వర్గాల మధ్య అక్కడక్కడ తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి.

వైసీపీ ఎమ్మెల్యేలు బలపరిచిన అభ్యర్థులు కాకుండా అసమ్మతి అభ్యర్థులు ఎంపీపీలుగా పలు చోట్ల ఎన్నికయ్యారు. వీరికి అక్కడక్కడ టీడీపీ, స్వతంత్ర ఎంపీటీసీ సభ్యులు మద్దతు పలికారు.

రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం 649 మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు ఎన్నికలు ప్రారంభించగా.. వాటిలో 15 అధ్యక్ష, 30 ఉపాధ్యక్ష స్థానాల ఎన్నికలు శనివారానికి వాయిదా పడ్డాయి. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా వైసీపీ 624, టీడీపీ 7, జనసేన 1, సీపీఎం 1, స్వతంత్ర అభ్యర్థి 1 స్థానం దక్కించుకున్నారు. ఈ స్వతంత్ర అభ్యర్థి టీడీపీలో చేరినట్లు సమాచారం.

శ్రీకాకుళం, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోని ఒక్కో మండలంలో కో-ఆప్షన్ సభ్యుల స్థానాలకు నామినేషన్లే దాఖలు కాలేదు. వీరి ఎన్నిక పూర్తయ్యాకే ఎంపీపీ, ఉపాధ్యక్షుల ఎన్నికలు నిర్వహించాలి. దీంతో ఆ ఎన్నికలు శనివారం జరిగే అవకాశం ఉంది.

ఇక తూర్పుగోదావరి జిల్లా కడియం మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలను టీడీపీ, జనసేన ఉమ్మడిగా కైవసం చేసుకున్నాయి. అధ్యక్షుడి ఎన్నికకు ఇరు పార్టీల అభ్యర్థులు చేతులెత్తి ఆమోదం తెలిపారు. ఎంపీపీగా సత్యప్రసాద్ (టీడీపీ), ఉపాధ్యక్షుడిగా గణపతి (జనసేన)ని సభ్యులు అభినందించారు.