Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లోని ఆ అపార్ట్ మెంట్లో దరిద్రపు కల్చర్

By:  Tupaki Desk   |   14 Jan 2022 4:42 AM GMT
హైదరాబాద్ లోని ఆ అపార్ట్ మెంట్లో దరిద్రపు కల్చర్
X
వాళ్లంతా ఒకరి గ్లాసును మరొకరితో షేర్ చేసుకోవచ్చు. కానీ.. కొందరు మాత్రం ఆ గ్లాసును ముట్టుకోకూడదు. ఆ మాటకు వస్తే.. వారికి సపరేట్ గ్లాసుల్లో టీ ఇచ్చే పరిస్థితి కొన్నేళ్ల క్రితం ఊళ్లల్లో ఉండేది. ఇప్పుడు దాని గురించి చెబితే.. ఏమిటి.. అంత దారుణంగా వ్యవహరించేవారా? అని బుగ్గలు నొక్కుకొని.. కళ్లు పెద్దవి చేసి మరీ.. ఆశ్చర్యంతో అడిగేస్తుంటారు. కాలం మనిషిని మరింత సంస్కారవంతుడిగా తయారు చేయాలి. కానీ.. కొందరి పైత్యం సాటి మనిషిని మనిషిలా చూసే కన్నా.. తనకున్న అధికారం.. సంపద లాంటి వాటిని సాయం చేసే కన్నా.. అహంకారపూరితంగా.. తనను తాను ఎంత గొప్పొడినన్న విషయాన్ని తెలియజేయటానికి ఉపయోగిస్తుంటారు. ఇప్పుడు చెప్పే ఉదంతం ఆ కోవకు చెందిందే.

హైదరాబాద్ లోని ఒక అపార్ట్ మెంట్ లో ఒక కొత్త బోర్డు వెలిసింది. అది కూడా లిఫ్టు పక్కన. దాని సారాంశం ఏమంటే.. ‘ఇంటి పని చేయు వారు.. డైవర్లు.. డెలివరీ బాయ్స్.. ఈ లిఫ్టు ఉపయోగించినచో రూ.300 జరిమానా వేయబడును’ అంటూ బోర్డు పెట్టేశారు. అంటే.. సదరు లిప్టులో కేవలం ఇంటి యజమానులు.. వారి కోసం వచ్చే వారు తప్పించి.. మిగిలిన వారు ఎవరూ వాడకూడదు. ఒకవేళ.. వాడితే రూ.300 ఫైన్ వేస్తామంటూ చేసిన ఈ హెచ్చరిక ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.

అయితే.. హైదరాబాద్ లోని ఏ అపార్ట్ మెంట్ లో (ప్రాంతం.. అపార్ట్ మెంట్ పేరు) ఈ బోర్డు ఏర్పాటు చేశారన్న సమాచారం బయటకు రాలేదు. ఒక నెటిజన్ తాను గుర్తించిన ఈ దరిద్రపుగొట్టు విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అందరికి తెలిసేలా పోస్టుపెట్టారు. ఇప్పుడీ అంశంపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. పని వాళ్ల పట్ల వివక్ష చూపించటం ఏమిటి? అంటూ పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు.

మనుషులంతా ఒక్కటేనని.. ఈ రోజుల్లో కూడా ఇలాంటివి అమలు చేస్తున్నారా? అన్న ఆగ్రహాంతో పాటు.. విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పని వాళ్లు వండిన వంటనుతింటారు. పని వాళ్లు తీసుకొచ్చిన వస్తువుల్ని తీసుకొని వాడతాం.కానీ.. వారి పట్ల వివక్ష ప్రదర్శించటం ఏమిటి? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఈ తరహా తీరును ప్రదర్శించే వారి పట్ల చర్యలు తీసుకోవాలని.. ఇలాంటి దరిద్రపుగొట్టు కల్చర్ కు చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది.

ఈ ఇష్యూలో జోక్యం చేసుకోవాల్సిందిగా మంత్రి కేటీఆర్ కు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. మరేం జరుగుతుందో చూడాలి. దీని గురించి ఆలోచిస్తూ.. రాస్తున్న వేళ.. మాకు ఒక ఐడియా వచ్చింది. అదేమంటే.. ఈ దరిద్రపుగొట్టు బుద్దికి వారి స్టైల్లోనే సమాధానం ఇచ్చేలా.. ఈ అపార్ట్ మెంట్ కు వచ్చే డెలివరీలు స్వీకరించమని.. డెలివరీ బాయిలు.. ఈ అపార్ట్ మెంట్లోని కార్లకు డ్రైవర్లుగా పని చేయమని.. వారి ఇళ్లల్లో పని చేయమని.. మొత్తంగా ఈ అత్యద్భుతమైన మనుషులు ఉండే అపార్ట్ మెంట్ ను.. శ్రామికవర్గం బహిష్కరిస్తే పోలా.. ఈ అపార్ట్ మెంట్ ఉన్నతులు.. వారి పనిని వారే చేసుకునేలా నిర్ణయం తీసుకుంటే ఎంత బాగుంటుంది. ఏమంటారు?