Begin typing your search above and press return to search.

వర్క్ ఫ్రమ్ హోమ్ : గూగుల్ కి భలే కలిసొచ్చింది..!

By:  Tupaki Desk   |   3 May 2021 12:30 AM GMT
వర్క్ ఫ్రమ్ హోమ్ : గూగుల్ కి  భలే కలిసొచ్చింది..!
X
కరోనా మహమ్మారి కోరలు చాచి సరిగ్గా ఏడాది దాటింది. ఆ మహమ్మారి కల్లోలానికి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఎన్నో కంపెనీలు నష్టపోయాయి. ఉద్యోగాలు పోగొట్టుకున్నోలైతే లక్షలాదిమంది ఉన్నారు. వారంతా ఉపాధిలేక రోడ్డున పడ్డారు. లాక్ డౌన్ కారణంగా దినసరి కూలీలు, సామాన్యుల పరిస్థితి ఘోరంగా తయారైంది. వారికి పూట గడవడం కూడా కష్టంగా మారింది. ఇలా కరోనా కాలంలో ఎందరో నష్టపోయిన వాళ్లు ఉన్నారు. కానీ యాదృచ్చికంగా కొన్ని సంస్థలు మాత్రం కరోనా కాలంలో ఆదాయాన్ని మిగిల్చుకున్నాయి. అలాంటి సంస్థల్లో గూగుల్ ఒకటి.

ప్రముఖ సెర్చింజన్ గూగుల్ కి ప్రపంచవ్యాప్తంగా కార్యాలయాలు ఉన్నాయి. అన్ని దేశాల్లోనూ ఉద్యోగులు ఉన్నారు. అయితే కరోనా కాలంలో ఉద్యోగులను కార్యాలయాలకు పిలిపించి పని చేయించడం కుదరకపోవడంతో గూగుల్ తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ విధానం ద్వారా గూగుల్ ఎంతో లాభపడింది. కరోనా కాలంలో వర్క్ ఫ్రం హోం కారణంగా తమకు ఏడాది కాలంలో దాదాపు 100 కోట్ల డాలర్లు ఆదా అయినట్లు స్వయంగా ఆ సంస్థ వెల్లడించింది.

ఇది భారత కరెన్సీలో సుమారు రూ.7,500 కోట్ల తో సమానం. కరోనా కాలంలో ఉద్యోగులంతా ఇంటికే పరిమితమై అక్కడి నుంచే విధులు నిర్వహిస్తుండడంతో గూగుల్ కి కార్యాలయాల నిర్వహణ భారం తగ్గింది. కార్యాలయాల ఖర్చు తగ్గడంతో గూగుల్ కు చాలా మొత్తంలో ఆదాయం మిగిలింది. ఈ సంవత్సరం తొలి త్రైమాసికంలో కంపెనీ ప్రచారం, ఉద్యోగుల ప్రయాణాలు, వినోద ఖర్చులపై 26.8 కోట్ల డాలర్లు ఆదా చేసినట్లు గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ వివరించింది. ఇది కేవలం మూడు నెలల కాలంలో కంపెనీకి మిగిలిన సొమ్ము. దీనిని ఏడాదికి లెక్కకడితే సుమారు 100 కోట్ల డాలర్లకు పైగా కంపెనీకి ఖర్చు తగ్గిపోయింది.

అడ్వర్టైజ్మెంట్, ప్రమోషన్స్ కూడా పెద్దగా చేపట్టకపోవడంతో కంపెనీ తరఫున 140 కోట్ల డాలర్లు ఖర్చు కూడా తగ్గిపోయినట్లు ఆల్ఫాబెట్ తెలిపింది. ప్రయాణ, వినోద వ్యయాలు 37.1 కోట్ల డాలర్ల మేర తగ్గించుకోవడంతో అది కూడా మిగిలింది. మొత్తానికి వర్క్ ఫ్రం హోం అమల్లోకి వచ్చిన తర్వాత దాదాపు 100 కోట్ల డాలర్లను గూగుల్ ఆదా చేసింది.