Begin typing your search above and press return to search.

వర్క్ ఫ్రమ్ హోమ్ తో బోసిపోతున్న బెంగుళూరు

By:  Tupaki Desk   |   5 Aug 2020 2:30 AM GMT
వర్క్ ఫ్రమ్ హోమ్ తో బోసిపోతున్న బెంగుళూరు
X
కరోనా దెబ్బకు దాదాపుగా అన్ని రంగాలు అతలాకుతలమవుతున్నాయి. అమెరికా వంటి అగ్రదేశాలు మొదలు భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న ఉన్న దేశాల వరకు కరోనా దెబ్బకు విలవిలలాడిపోతున్నాయి. కరోనా మహమ్మారి విసిరిన పంజాకు పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతున్నాయి. 2008లో చవిచూసిన ఆర్థిక మాంద్యంతో పోలిస్తే....కరోనాతో రాబోతోన్న ఆర్థిక మాంద్యం ప్రభావం అనూహ్యమని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కరోనా ఎఫెక్ట్ తో రాబోయే కాలంలో కొన్ని కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోబోతున్నారని, ముఖ్యంగా ఐటీ రంగంపై కరోనా తీవ్ర ప్రభావం చూపనుందని అంతా భావించారు. అయితే, ఐటీ రంగంపై కరోనా ఎఫెక్ట్ కాస్తో కూస్తో పడినా....అనుకున్నంత తీవ్రంగా లేదని ఐటీ నిపుణులు అంటున్నారు. అందుకు ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ఉండడమే కారణమని చెబుతున్నారు.

మ్యానుఫ్యాక్చరింగ్, ఇతర రంగాలతో పోలిస్తే ఐటీ సెక్టార్‌కు వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా సులభం అని, మిగతా రంగాలతో పోలిస్తే ఐటీ రంగంపై లాక్ డౌన్ ప్రభావం తక్కువగా ఉందని అంటున్నారు. ఇటీవల విడుదలైన ఐటీ కంపెనీల క్వార్టర్ ఆదాయాలు ఆశాజనకంగానే ఉండడం ఇందుకు నిదర్శనం. అందుకే, రాబోయే ఏడాది వరకు ఎక్కువమంది ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని ఐటీ కంపెనీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఐటీ హబ్ లుగా పేరుపొందిన బెంగుళూరు వంటి నగరాలు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. ప్రస్తుతం బెంగళూరులోని ఐటీ పార్క్స్ కేవలం 5 శాతం నుండి 15 శాతం ఉద్యోగులతో పని చేస్తుండడమే ఇందుకు నిదర్శనం.

బెంగుళూరులోని వైట్‌ఫీల్డ్‌లో ఉన్న 69 ఎకరాల అంతర్జాతీయ టెక్ పార్క్ లో అనేక దిగ్గజ టెక్ సంస్థలున్నాయి. వాటిలోని చాలా సంస్థల్లో 5-15 శాతం మంది ఉద్యోగులు మాత్రమే హాజరవుతున్నారు. టీసీఎస్ కు 7 శాతం మంది ఉద్యోగులు వస్తుండగా, ఐబీఎం, కాగ్నిజెంట్ లలో 15 శాతం మంది ఆఫీసులకు వస్తున్నారు. ఇక, సిస్కో ఉద్యోగుల్లో 80 శాతం మంది వర్క్ ఫ్రమ్ హోమ్ కే పరిమితం కాగా, ఇన్పోసిస్, విప్రో ల ఉద్యోగులు 90 శాతం మంది వర్క్ ఫ్రం హోంకే మొగ్గు చూపుతున్నారు. ఇక, గూగుల్ ఇండియా సహా తమ ఉద్యోగులకు వచ్చే ఏడాది జూన్ చివరి వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు కల్పించారు గూగుల్, అల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్. వేలాది మంది ఉద్యోగులున్న దిగ్గజ కంపెనీలే వర్క్ ఫ్రం హోంకు పెద్దపీట వేస్తోంటే...చిన్నా చితకా కంపెనీలు, స్టార్టప్ లు అదే బాటలో పయనించాలన్న యోచనలో ఉన్నాయట.

ఐటీ కంపెనీల వర్క్ ఫ్రం హోం నిర్ణయం...రియల్ ఎస్టేట్ రంగంపై పడింది. బెంగళూరు ఐటీ హబ్ గా ఎదగడంతో బెంగుళూరు, పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ ధరలకు రెక్కలొచ్చాయి. ఐటీ ఉద్యోగు తాకిడికి తగ్గట్లుగానే ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్, ఇతర మౌలిక సదుపాయాల సమస్య పెరిగింది. ఎంబసీ మన్యతా బిజినెస్ పార్క్ ముందున్న స్కైవాక్‌ను 22,000 మంది ఉద్యోగులు వినియోగించేవారంటే...ఈ ప్రాంతంలో ఎంత రద్దీ ఉంటుందో ఊహించవచ్చు. ఇక, ఔటర్ రింగ్ రోడ్డులో వివిధ ఐటీ సంస్థలు, స్టార్టప్స్ ఉన్నాయి. అయితే, లాక్ డౌన్ ఎఫెక్ట్ తో వర్క్ ఫ్రం హోంకు చాలా కంపెనీలు మొగ్గు చూపడంతో ఈ రద్దీ కనబడడం లేదు. ఐటీ హబ్ లోని బిల్డింగ్ లు ఉద్యోగులు లేక వెలవెలబోతున్నాయి.

అయితే, కరోనా ఉధృతి తగ్గాక ఐటీ కంపెనీలు మళ్లీ కళకళలాడతాయని అనుకుంటున్నారు. అందుకే, ఇప్పటికీ తమ లీజును చాలా కంపెనీలు రద్దు చేయలేదని చెబుతున్నారు. పైగా, ఉద్యోగులు తిరిగి వచ్చాక సామాజిక దూరం నేపథ్యంలో ఆఫీస్ స్పేస్ మరింత ఎక్కువ అవసరం ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరి, బిల్డింగ్ అద్దెలు...మెయింటెనెన్స్ వంటివి తగ్గించుకోవడం ద్వారా ఆర్థిక భారం లేకుండా చూసుకోవాలని ఐటీ కంపెనీలు భావించి వర్క్ ఫ్రం హోంను భవిష్యత్తులోనూ కొనసాగిస్తాయా...లేక ఆఫీసు నుంచి పనిచేయించడానికే మొగ్గు చూపుతాయా అన్నది తేలాలంటే మరో ఏడాది ఆగక తప్పదు.