Begin typing your search above and press return to search.

పేరులోనే ‘యోగి’.. చేతల్లో ఏమీ ఉండదా?

By:  Tupaki Desk   |   8 Aug 2020 11:30 PM GMT
పేరులోనే ‘యోగి’.. చేతల్లో ఏమీ ఉండదా?
X
పాలకుడు ప్రజల పక్షపాతిగా ఉండాలి. రాగద్వేషాలకు అతీతంగా ఉండేందుకు వీలుగా కాషాయధారణ చేసిన వ్యక్తి.. అందుకు భిన్నంగా తాను ఒక మతానికే పరిమితం అయ్యే మతప్రవక్తలా వ్యవహరించటం ఎంతవరకు సబబు? అన్నది క్వశ్చన్. మెజార్టీ హిందువులు ఉన్న భారత దేశంలో.. వారికి ఉండాల్సిన ప్రాధాన్యత లేకున్నా ఫర్లేదు.. పలు సందర్భాల్లో మిగిలిన వారికి ఇచ్చే మర్యాద తమకు ఇవ్వరన్న భావన హిందూనేతలు తరచూ వేదనను వ్యక్తం చేస్తుంటారు. వ్యవస్థలో అక్కడక్కడా జరిగే లోపాల్ని ప్రధానంగా చూపిస్తూ.. ఆవేశానికి గురి కావటం సరికాదు. అదే సమయంలో.. తప్పుల్ని సరిదిద్దేందుకు సీరియస్ చర్యలు తీసుకోవాలి. అప్పుడు మాత్రమే భారత్ కు ఉండే విలక్షణ అలానే నిలుస్తుంది.

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారంగా మారాయి. అయోధ్యలోని రామాలయ భూమిపూజ సందర్భంగా మీడియాకు చెందిన ఒకరు అడిగిన ప్రశ్నకు ఆయన అనూహ్యంగా సమాధానం ఇచ్చారు. అయోధ్యలో నిర్మించే మసీదు నిర్మాణ సందర్భంగా పిలిస్తే వెళతారా? అని అడగ్గా.. తాను వెళ్లేనని తేల్చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆయన.. తాను ఒక వర్గానికి చెందిన వ్యక్తిగా పరిమితం చేసుకోవటాన్ని పలువురు తప్పు పడుతున్నారు.

కాషాయం ధరించే యోగి.. అందరిని కలుపుకుపోవాలని.. హిందుత్వ ధర్మాన్ని ఆయన విస్మరిస్తున్నారని మండిపడుతున్నారు. ఇలాంటివారి వల్లే.. హిందూ మతానికి మరింత ముప్పు వాటిల్లేలా చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే సెక్యులరిజం పేరుతో రచ్చ చేసే వామపక్ష మేదావుల దుర్మార్గాలు ఒక్కొక్కటి అందరికి అర్థమవుతున్న వేళ.. హిందూమతాన్ని మూర్ఖంగా చూసే వారికి కళ్లు తెరిపించేలా ఉండాల్సిన అవసరం ఉంది. అప్పుడే మతం ఔనత్యం పెరగటంతో పాటు..అప్పటివరకు జరిగిన ప్రచారాల్లోని దుర్మార్గం అందరికి అర్థమవుతుంది.

అందుకు భిన్నంగా తనను తాను ఒక మతనాయకుడికి పరిమితం చేసుకోవటాన్ని తప్పు పట్టాల్సిందే. ప్రజాస్వామ్య.. లౌకిక రాజ్యానికి రథసారధిగా ఉండే వ్యక్తికి ఒక మతం మీద ప్రత్యేకమైన అభిమానం ఉండకూడదు. ఆ కోణంలో చూసినప్పుడు యూపీ సీఎంగా యోగి తప్పు చేస్తున్నారనే చెప్పాలి. యోగి మాటలు విన్నంతనే మజ్లిస్ అధినేత.. హైదరాబాద్ ఎంపీగా సుపరిచితులు అసదుద్దీన్ ఓవైసీ గుర్తుకు వస్తారు.నోరు తెరిస్తే.. సెక్యులరిజం అంటూ అదే పనిగా మాట్లాడే ఆయన.. ఏ రోజు కూడా గుడికి వెళ్లింది లేదు. తన నియోజకవర్గంలో భారీ ఎత్తున సాగే గణేశ్ నిమజ్జనానికి హాజరైంది లేదు. అన్ని మతాలుసమానమే అన్నప్పుడు.. అన్ని మతాలకు చెందిన వారి పర్వదినాల్లో ఎందుకు పాల్గొనరు? అంతదాకా ఎందుకు? హిందువుల ప్రధాన పండగల సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయటాని వైనాన్ని గుర్తు చేస్తారు.

అలాంటి నేత సెక్యులరిజం గురించి మాట్లాడటానికి మించిన కామెడీ మరేం ఉంటుంది. అసద్ లాంటి వారికి ఏ మాత్రం తీసిన పోని రీతిలో యూపీ సీఎం ఉండటం గమనార్హం. అసద్ లాంటి వాడ్ని అదే పనిగా వేలెత్తి చూపే వేళ.. యోగి లాంటి వారు ఆయన బాటలో పయనించటం ఎంతవరకు సబబు? హిందుత్వం ఎప్పుడు ఎవరిని ద్వేషించదు. ఆకారణంగా ఆగ్రహాన్ని ప్రదర్శించదు. అన్నింటికి మించి భారత్ దేశం.. అందరిని.. అన్ని తత్వ్తాల్ని తనలో ఇముడ్చుకుంటుంది. ఆ విలక్షణతో యోగిలో మిస్ కావటానికి మించిన బ్యాడ్ లక్ మరొకటి ఉండదు. ఒక విధంగా చూస్తే.. అసద్ కు.. యోగికి పెద్ద తేడా లేదనే చెప్పాలి. అలాంటి నేతలు పాలకులుగా ఎంతవరకు సబబు? అన్నది అసలు ప్రశ్న.