Begin typing your search above and press return to search.

ఈ ఘనత సాధించిన దేశంలోనే తొలి మహిళ

By:  Tupaki Desk   |   20 Nov 2019 11:34 AM GMT
ఈ ఘనత సాధించిన దేశంలోనే తొలి మహిళ
X
దేశంలో ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ హిందుత్వ ఎజెండాతో ముందుకెళుతున్న విషయం అందరికీ తెలిసిందే.. కులం , మతం ఆధారంగానే ఇప్పుడు దేశ రాజకీయం నడుస్తోంది. అవి లేనిదే రాజకీయమే లేదు.. తెలంగాణలో రెడ్లు, రావులు, ఏపీలో కమ్మ, రెడ్లు, కాపులు.. వీరిదే అధికారం.. వీరే రాజకీయ నేతలు.. అయితే ఈ కులం కట్టుబాట్లు లేని సమాజం కావాలని ఎంత మంది ఆశించినా అది సాధ్యపడడం లేదు. ఎన్నో వివాదాలు ఘర్షణలకు కులాలు, మతాలే కారణంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుత సమాజం కులాల ఆధారంగా విడిపోయింది కూడా..

అయితే ఓ ఉక్కు మహిళ మాత్రం ఈ కుల - మతాలు లేని జీవితాన్ని చూడాలనుకుంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసింది. చివరకు ఎట్టకేలకు సాధించింది. దాదాపు 9 ఏళ్ల పోరాటం తర్వాత భారత దేశంలోనే కులం - మతం లేదంటూ ధ్రువీకరణ పత్రం పొందిన తొలి మహిళగా ఆవిర్భవించింది. ఆమె ఎవరో కాదు.. తమిళనాడులోని వెల్లూరు జిల్లాకు తిరుపత్తూర్ కు చెందిన స్నేహ పార్తీబారాజా.

స్నేహను చిన్నప్పటి నుంచి కులమతాలకు అతీతంగా వారి తల్లిదండ్రులు పెంచారు. స్నేహ నాన్న లాయర్ కావడంతో ఆదర్శంగా తీర్చిదిద్దారు. ఆదర్శభావాలు కలిగిన స్నేహ నాన్న ఈమెను స్కూల్లో చేర్పించినా, కాలేజీలో చేర్పించినా కులాన్ని నమోదు చేయలేదు.

ఇక పెద్దయ్యాక కుల నిర్మూలనకు కృషి చేస్తున్న స్నేహ తనకు కులం - మతం లేని సర్టిఫికెట్ కావాలంటూ పోరుబాటు పట్టింది. దాదాపు 9 ఏళ్లుగా దీనికోసం అధికారులతో పోరాటం చేస్తోంది. అధికారులు ఇలాంటి సర్టిఫికెట్ ఇవ్వడం కుదరని చెప్పినా పట్టుబట్టి పోరాడి తాజాగా సాధించింది. తాజాగా స్నేహకు కులం, మతం లేదంటూ తహసీల్లార్ సర్టిఫికెట్ అందజేశారు. ఇలా దేశంలోనే కులం, మతం లేని తొలి మహిళగా స్నేహ గుర్తింపు పొందారు.