కర్ణాటకలో గలీజు వార్.. నిర్మాత మంత్రిపై మహిళా నేత కేసు

Sat Apr 01 2023 16:10:29 GMT+0530 (India Standard Time)

Women Case on Karnataka Minister Munirathna

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ అక్కడ అధికార ప్రతిపక్షాల మధ్య గలీజ్ వార్ నడుస్తోంది. నేతలు దిగజారిపోయి ఆరోపణలు ప్రత్యారోపణలు కేసులు పెట్టుకోవడం వరకూ వెళ్లింది. కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు రెచ్చిపోతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.



కన్నడ తమిళ భాషల ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని.. సమాజంలో శాంతికి భంగం కలిగిస్తున్నారని ప్రముఖ సినీ నిర్మాత మంత్రి బీజేపీ ఎమ్మెల్యే మీద ఓ మహిళ నేత కేసు పెట్టడం సంచలనమైంది.

బెంగళూరు నగరంలోని రాజరాజేశ్వరి నగర ఎమ్మెల్యే ప్రముఖ నిర్మాత మునిరత్న ప్రస్తుతం కర్ణాటక బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. మాస్ లీడర్ గా గుర్తింపుపొందాడు. మునిరత్న రాజకీయాలు వ్యాపారాలు సినిమా రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

కాంగ్రెస్ టికెట్ మీద గెలిచిన ఎమ్మెల్యేగా మునిరత్న తర్వాత బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కు కమలం పార్టీలో చేరి ఏకంగా మంత్రి అయ్యారు. తాజాగా బెంగళూరులోని జూలహళ్లి నియోజకవర్గంలోని  ఖతానగర్ బహిరంగ సభలో మాట్లాడిన మునిరత్న వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా కాంగ్రెస్ నేతలు వచ్చి ఓట్లు అడిగితే తరిమి కొట్టండి అంటూ తమిళంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఈ క్రమంలోనే జూలహళ్లి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న కుసుమా హనుమంతప్ప అనే మహిళ నేత  తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రి మునిరత్న నియోజకవర్గంలో తమిళ కన్నడిగుల మధ్య చిచ్చు రేపుతున్నారని.. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని సిటీ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. ప్రజలను మునిరత్న రెచ్చగొడుతున్న వీడియోను  పోలీసులకు అందించారు.

బీజేపీ నేతలు మరోసారి కర్ణాటకలో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి గెలవాలనుకుంటున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఓ మహిళా నేత ఇలా ఏకంగా బీజేపీ మంత్రిపై పోలీస్ కేసు పెట్టడం.. విద్వేష రాజకీయాలు చేస్తున్న బీజేపీ నేతలపై పోరుబాట పట్టడం హాట్ టాపిక్ గా మారింది.  ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఈ గలీజ్ వార్ పై ప్రజలు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు.      


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.