ట్రంప్ షాకిచ్చినా ఒక్క ఉద్యోగిని తొలగించం

Tue Jul 14 2020 22:30:15 GMT+0530 (IST)

We cant fire a single employee

కరోనా దెబ్బకు అన్ని రంగాలు కుదేలయ్యాయి. ఇప్పుడు ఐటీ సంస్థలకు కూడా ఆ సెగ తగిలింది. కొత్త ప్రాజెక్టులు రాక ఆగిపోవడం.. ఉన్న ప్రాజెక్టుల్లో వ్యయ నియంత్రణతో ఐటీ సంస్థలు ఉద్యోగులను తొలగించేస్తున్నాయి. ఈ ప్రభావంతో ఐటీ రంగాన్ని నమ్ముకున్న ఉద్యోగులు వారి వేతనాలపై తీవ్ర ప్రభావం పడుతోంది.ఇప్పటికే దేశంలో 30వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు. 60వేల మంది వేతనం లేని సెలవుల్లో ఉంటారని అంచనా..

ఇండియాలో ఐటీ బీపీవో సేవల్లో దాదాపు 43.6 లక్షలమంది పనిచేస్తున్నారు. ఇందులో 0.70శాతం మేర ఉద్యోగ కోత పడిందని అంచనా.. ఈ సమయంలోనే దేశంలోనే దిగ్గజ కంపెనీల్లో ఒకటైన విప్రో కంపెనీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.

కరోనా మహమ్మారి కారణంగా ఒక్క ఉద్యోగిని తొలగించలేదని.. వారిపై వేటు వేసే ఆలోచనలు కూడా లేవని తాజాగా విప్రో కంపెనీ చైర్మన్ రిషద్ ప్రేమ్ జీ తెలిపారు. కంపెనీ 74వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. అలాంటి ప్రణాళికలు కూడా లేవని భరోసానిచ్చారు. కరోనా నష్టాలను ఇతర మార్గాల్లో భర్తీ చేసుకుంటామని తెలిపారు. నిర్వహణ మార్పులు.. ఇతర విధానాల్లో వ్యయాలు తగ్గించుకుంటామని.. కానీ ఉద్యోగులను మాత్రం తొలగించేది లేదని స్పష్టం చేశారు.

ఇక అమెరికా హెచ్1బీ వీసాల విషయంలో అమెరికా తీసుకున్న నిర్ణయంపై కూడా స్పందించారు విప్రో చైర్మన్ రిషద్. ట్రంప్ వీసాలు నిషేధించినా విప్రో అమెరికా కంపెనీల్లో స్థానిక ఉద్యోగులే 70శాతం వరకు ఉన్నారని.. రిస్క్ లేదని.. ఉద్యోగులను తొలగించమని హామీ ఇచ్చారు. విప్రో ఆదాయంలో అమెరికా వాటా 59.1శాతం ఉందని తెలిపారు.