Begin typing your search above and press return to search.

కుప్పంలో వైఎస్సార్సీపీ అభ్య‌ర్థిగా సినిమా హీరో పోటీ చేస్తారా?

By:  Tupaki Desk   |   25 Jun 2022 12:30 PM GMT
కుప్పంలో వైఎస్సార్సీపీ అభ్య‌ర్థిగా సినిమా హీరో పోటీ చేస్తారా?
X
గ‌తేడాది జరిగిన కుప్పం మున్సిపాలిటీలో విజ‌యం సాధించ‌డంతో వైఎస్సార్సీపీ రెట్టించిన ఉత్సాహంతో ఉర‌క‌లేస్తోంది. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కుప్పంలో గ‌ట్టి అభ్య‌ర్థిని నిల‌బెట్టి ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడికి షాక్ ఇవ్వాల‌నే యోచ‌న‌లో ఉంద‌ని స‌మాచారం. 1989 నుంచి 2019 వ‌ర‌కు అంటే ఏడుసార్లు కుప్పం నుంచి టీడీపీ అధినేత చంద్ర‌బాబు వ‌రుస‌గా గెలుస్తూ వ‌స్తున్నారు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబుకు ఈసారి షాకివ్వ‌డానికి వైఎస్సార్సీపీ పావులు క‌దుపుతోంద‌ని అంటున్నారు.

అందులోనూ ఇటీవ‌ల ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్.. త‌మ పార్టీ ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గ ఇన్చార్జుల‌తో నిర్వ‌హించిన స‌మావేశంలో ఈసారి 175కి 175 సీట్లు సాధించాల‌ని క‌ర్త‌వ్య బోధ చేశారు. వైఎస్ జ‌గ‌న్ ఆశ నెర‌వేరాలంటే కుప్పంలో కూడా విజ‌యం సాధించాల్సి ఉంటుంది. ఈ నేప‌థ్యంలోనే గ‌ట్టి అభ్య‌ర్థిని నిల‌బెట్ట‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ని అంటున్నారు.

ఈ క్ర‌మంలో సీనియ‌ర్ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి సోద‌రుడి కుమారుడు పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డిని లేదా బ‌ల‌మైన బీసీ అభ్య‌ర్థిని బ‌రిలో దించుతార‌ని చెబుతున్నారు. వీరెవ‌రూ కాకుంటే ప్ర‌ముఖ సినీ హీరో విశాల్ ను వైఎస్సార్సీపీ త‌ర‌ఫున పోటీ చేయిస్తార‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. విశాల్ త‌మిళ సినిమాల్లో న‌టిస్తున్న‌ప్ప‌టికీ ఆయ‌న రెడ్డి సామాజిక‌వ‌ర్గానికి చెందిన‌వారే. విశాల్ తండ్రి జీకే రెడ్డి ప్ర‌ముఖ బిల్డ‌ర్ గా, రియ‌ల్ట‌ర్ గా, నిర్మాత‌గా కొన‌సాగుతున్నారు. విశాల్ సొంత వూరు కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలోనే ఉంద‌ని పేర్కొంటున్నారు.

ఈ నేప‌థ్యంలో విశాల్ ను వైఎస్సార్సీపీ త‌ర‌ఫున కుప్పం బరిలో చంద్ర‌బాబుపైకి ప్ర‌యోగిస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అందులోనూ విశాల్ కు రాజ‌కీయాలంటే మంచి ఆసక్తి ఉంద‌ని పేర్కొంటున్నారు. త‌మిళ న‌టీన‌టుల సంఘానికి ప్రెసిడెంట్ గానూ విశాల్ వ్య‌వ‌హ‌రించాడ‌ని గుర్తు చేస్తున్నారు. వైఎస్ జ‌గ‌న్ తోనూ స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయ‌ని అంటున్నారు. గ‌తంలో ప‌లు సినిమాల్లోనూ విశాల్ రాయ‌ల‌సీమ నేప‌థ్యం క‌నిపిస్తుంది. ముఖ్యంగా పందెంకోడి, పొగ‌రు త‌దిత‌ర సినిమాలు రాయ‌ల‌సీమ బ్యాక్ డ్రాప్ తోనే రూపొంది విజ‌యం సాధించాయ‌ని గుర్తు చేస్తున్నారు. గతంలోనూ పలు ఇంట‌ర్వ్యూల్లోనూ వైఎస్ జ‌గ‌న్ విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్న‌ట్టు విశాల్ వెల్ల‌డించార‌ని చెబుతున్నారు.

కుప్పం బరిలో దిగ‌డానికి పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డిని, ప్ర‌స్తుత ఎమ్మెల్సీ భ‌ర‌త్ ను, ప‌లువురు బీసీ అభ్య‌ర్థుల‌ను ప‌రిశీలించిన త‌ర్వాత ఫైన‌ల్ గా విశాల్ అభ్య‌ర్థిత్వం దగ్గ‌ర వైఎస్సార్సీపీ పెద్ద‌లు ఆగార‌ని గాసిప్స్ వినిపిస్తున్నాయి. కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో త‌మిళ ఓటర్లు కూడా బాగానే ఉన్నారు కాబ‌ట్టి విశాల్ అయితే ఆ ఓట్ల‌ను కూడా ఇటు మ‌ళ్లించుకోవ‌చ్చ‌న్న‌ది వైఎస్సార్సీపీ ఆలోచ‌న అని చెబుతున్నారు. అలాగే విశాల్ కు మాస్ హీరోగా ఉన్న సినిమా క్రేజు కూడా క‌ల‌సి వ‌స్తుంద‌నేది అధికార పార్టీ యోచ‌న అని పేర్కొంటున్నారు.

విశాల్ ను కుప్పం అభ్య‌ర్థిగా నిల‌బెడితే చంద్ర‌బాబును ఆందోళ‌న‌కు గురిచేయొచ్చ‌ని.. దీంతో చంద్ర‌బాబు కుప్పంలో గెల‌వ‌డానికి ఎక్కువ స‌మ‌యం కేటాయిస్తార‌ని వైఎస్సార్సీపీ భావిస్తోంద‌ని స‌మాచారం. కుప్పానికే ఎక్కువ స‌మ‌యం కేటాయించ‌డం వ‌ల్ల రాష్ట్రంలో అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్రచారానికి ఎక్కువ స‌మ‌యం కేటాయించ‌లేర‌ని పేర్కొంటున్నారు. అలాగే నారా లోకేష్ పోటీ చేసే నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఇలాగే పోటీ పెడితే.. వారిద్ద‌రికి ఎక్కువ స‌మ‌యం వారి నియోజ‌క‌వ‌ర్గాల్లోనే స‌రిపోతుంద‌ని.. మిగతా నియోజ‌క‌వ‌ర్గాల మీద దృష్టి పెట్ట‌డం కుద‌ర‌ద‌ని అంటున్నారు. అప్పుడు తామ‌నుకున్న లక్ష్యం సులువుగా నెర‌వేరుతుంద‌ని వైఎస్సార్సీపీ భావిస్తోంద‌ని చెబుతున్నారు.

ప‌శ్చిమ బెంగాల్ లో బీజేపీ మ‌మ‌తా బెన‌ర్జీని ఇలాగే రెచ్చ‌గొట్టి నందిగ్రామ్ లో పోటీ చేసేలా చేసింద‌ని గుర్తు చేస్తున్నారు. దీంతో నందిగ్రామ్ లో గెల‌వ‌డానికి మమ‌తా బెన‌ర్జీ ఎక్కువ స‌మ‌యం కేటాయించార‌ని చెబుతున్నారు. అయిన‌ప్ప‌టికీ నందిగ్రామ్ లో బీజేపీ అభ్య‌ర్థి సువేందు అధికారి చేతిలో మమ‌తా బెన‌ర్జీ ఓట‌మిపాలు అయ్యార‌ని గుర్తు చేస్తున్నారు.

మ‌రోవైపు వైఎస్సార్సీపీ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ కూడా వైఎస్ జ‌గ‌న్ ఆలోచ‌న‌కు ఓకే చెప్పార‌ని అంటున్నారు. మ‌రి వైఎస్సార్సీపీ ఈ విష‌యాన్ని విశాల్ కు చెబుతుందా? చెబితే విశాల్ ఓకే చెబుతాడా? కుప్పం బ‌రిలో వైఎస్సార్సీపీ అభ్య‌ర్థిగా చంద్ర‌బాబు నాయుడుపైన పోటీ చేస్తారా అనేది వేచిచూడాల్సిందేన‌ని అంటున్నారు.