Begin typing your search above and press return to search.

రాహుల్ ను పప్పుగా భావిస్తూ దేశం తప్పు చేస్తుందా?

By:  Tupaki Desk   |   8 Aug 2020 8:30 AM GMT
రాహుల్ ను పప్పుగా భావిస్తూ దేశం తప్పు చేస్తుందా?
X
నమ్మకం ఉండం తప్పు కాదు. అలా అని విచక్షణ మిస్ కావటం కూడా మంచిది కాదు. ఒకరినేమో మేధావితనానికి.. సమర్థకు చిహ్నంగా చెప్పుకుంటూ.. అదే సమయంలో మరొకరిని తేలిగ్గా.. చులకనభావంతో చూడటం దేశానికి ఏ మాత్రం మంచిది కాదన్న విషయం.. తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలు చెప్పేస్తున్నాయి. దేశ ప్రధాని మోడీ అన్నంతనే ఊగిపోయే వారు కోట్లాది మంది ఉన్నారు. సామాన్య కుటుంబం నుంచి.. కష్టపడి ఎదిగి దేశ ప్రధానిగా మారిన ఆయనంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. అయితే.. మోడీ మీద ఉన్న మరకల కారణంగా కొందరు మాత్రం.. ఆయన పేరెత్తితేనే ముఖం చిట్లిస్తారు. మోడీ విషయంలో రెండు డివిజన్లు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంటుంది.

అదే సమయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేరెత్తితే చాలు.. అప్పటివరకు మామూలుగా ఉన్న ముఖంలో చిరునవ్వు వస్తుంది. తేలిగ్గా తీసుకోవటం కనిపిస్తుంది. అవసరమైతే.. పప్పు కదా.. అన్న మాటను అనేసే వారు ఎక్కువ మందే కనిపిస్తారు. కొన్నిసార్లు కొంతమంది మీద కొన్ని ముద్రలు అలా పడిపోతాయి. పడిన ముద్రల్ని తొలగించటం చాలా కష్టం. ఇప్పుడు రాహుల్ పరిస్థితి కూడా అలానే మారింది. ఆయన మాటల్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నట్లుగా దేశ ప్రజలు వ్యవహరిస్తుంటారు. ఇలాంటి ధోరణికి భవిష్యత్తులు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.

ఒకరి మీద అమితమైన ప్రేమాభిమానాలు.. మరొకరి మీద ఏ మాత్రం నమ్మకం లేకపోవటం మంచిది కాదన్న వాదన వినిపిస్తుంటుంది. ప్రధాని మోడీ మీద నమ్మకం తప్పేం కాదు. అలా అని రాహుల్ మీద చులకన కూడా సరికాదని చెప్పటమే ఇక్కడ ఉద్దేశం. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. గడిచిన నాలుగైదు నెలల్లో రాహుల్ చేసిన వ్యాఖ్యలు.. ఆయన అంచనాలు ఎక్కడా తప్పు కాలేదన్న విషయాన్ని మర్చిపోకూడదు. కరోనాకు ముందు నుంచే ఆయన దేశ ఆర్థిక పరిస్థితి మీద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినా.. ఆయన్ను సీరియస్ గా పట్టించుకున్నోళ్లు లేరు.

ఇదిలా ఉంటే.. కరోనా వచ్చేయటం.. యావత్ దేశాన్ని చుట్టేయం తెలిసిందే. ప్రస్తుతం 20లక్షల మార్కును దాటేసింది. రోజుకు యాభై వేల కొత్త కేసులు నమోదువుతున్న పరిస్థితి. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. కరోనాకు సంబంధించిన రాహుల్ అలెర్టుల్ని ఈ దేశం పెద్దగా పట్టించుకున్నది లేదు. పది లక్షల కేసులు ఎప్పటికి నమోదవుతాయన్న విషయంలో ఆయన అంచనాలు మిస్ కాలేదు. ఎలాంటి పరిస్థితులు దేశంలో చోటు చేసుకోనున్నాయన్నది ఆయన ముందే చెప్పేశారు. అక్కడి దాకా ఎందుకు తాజాగా దాటిన 20 లక్షల మార్కు విషయంలోనూ ఆయన గతంలోనే ప్రస్తావించారు.

ఆయన అంచనాల ప్రకారం ఆగస్టు 10నాటికి 20లక్షల కేసులు నమోదవుతాయని లెక్క కట్టారు. ఆయన మాటల్ని.. లెక్కల్ని ఎవరూ పట్టించుకున్నది లేదు. ఆయన అంచనా నిజమని తేలటమే కాదు.. ఆయన చెప్పిన గడువుకు రెండు రోజుల ముందే 20లక్షల మార్కుకు చేరుకున్నాం. కేసుల పెరుగుదలకు సంబంధించి కేంద్రం ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేయటంతో పాటు.. ఏ రాష్ట్రంలో కేసులు పెరగటానికి కారణం ఏమిటి? అక్కడ దొర్లుతున్న తప్పులు ఏమిటన్న విషయం మీద ఇప్పటివరకూ సరైన కసరత్తు జరిగింది లేదు. ఇది దేనికి సంకేతం? అన్నది క్వశ్చన్.

ఒకవ్యక్తి మీద ఆ కారణంగా కోపం మంచిది కాదని చెబుతారు. మరి.. రాహుల్ లాంటి వ్యక్తి మీద ఎక్కువమంది చులకనభావాన్ని వ్యక్తం చేయటం కూడా ఈ దేశానికి మంచిది కాదన్న విషయాన్ని ఎప్పటికి గుర్తిస్తారు. సమర్థుడ్ని అసమర్థుడిగా భావిస్తే.. కలిగే నష్టం ఎంతో.. రాహుల్ విషయంలోనూ దేశం అలాంటి తప్పే చేస్తుందా? రాహుల్ అన్నంతనే పప్పు అనే కన్నా.. ఒప్పు అనే కోణంలో దేశ ప్రజలు చూడటం మొదలైతే.. అంతో ఇంతో మంచి జరగటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. కాదంటారా?