Begin typing your search above and press return to search.

వైసీపీని సంక్షేమ పథకాలు కాపాడతాయా ?

By:  Tupaki Desk   |   28 Nov 2021 11:30 AM GMT
వైసీపీని సంక్షేమ పథకాలు కాపాడతాయా ?
X
ఇపుడిదే చర్చ మొదలైంది. పార్టీ వర్గాల అభిప్రాయం ఎలా ఉన్నా జగన్మోహన్ రెడ్డి పాలన పై జనంలో అసంతృప్తి అయితే మొదలైంది. ఈ విషయాన్ని పార్టీ శ్రేణులు కూడా అంగీకరిస్తున్నాయి. చాలామంది నేతల్లో నవరత్నాలే తమను మళ్ళీ గెలిపిస్తాయనే నమ్మకం ఉన్నప్పటికీ వచ్చే ఎన్నికలు వైసీపీకి చాలా కీలకమైనవని సీనియర్లలో కొందరు ఏకీభవిస్తున్నారు. ఒకవైపు నవరత్నాల పేరుతో సమాజంలోని మెజారిటీ సెక్షన్ ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నా ఇంకా ప్రభుత్వంపై అసంతృప్తి ఏమిటి ?

ఏమిటంటే కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే ఏ పార్టీని కూడా ఎన్నికల్లో గెలిపించలేవు. సంక్షేమ పథకాలకు మించినవి ఇంకేదో కావాలి జనాలకు. ఒకటి మాత్రం నిజం ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా మాత్రం పోటీచేయదు అంటున్నారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న ప్రచారం ప్రకారం బీజేపీ+జనసేనతో పొత్తుండే అవకాశాలు ఎక్కువున్నాయి. 2024లో వైసీపీ గెలుస్తుందో లేదో తెలీదు కానీ చాలా నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ జరిగే అవకాశాలైతే ఎక్కువున్నాయి.

ప్రతిపక్షాలు ఎన్నికల్లో జనాల ముందుకు వెళ్ళినపుడు అధికారపార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తాయనటంలో సందేహంలేదు. ఇదే సమయంలో అధికార పార్టీ ఏమి చెప్పుకుంటుంది ? మీడియా సమావేశాల్లో చంద్రబాబునాయుడునో లేకపోతే పవన్ కల్యాణో అమ్మనాబూతులు తిట్టినట్లు కాదు ప్రజలను ఓట్లడి వేయించుకోవటమంటే. పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం, ప్రత్యేక హోదా, అప్పులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతాలు, పెన్షన్లు చెల్లింపుపై సమాధానం చెప్పుకోవాలి.

అలాగే అభివృద్ధి కార్యక్రమాలు, పరిశ్రమలు తేవటం ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పనపై జనాలకు ఏమి సమాధానం చెబుతుంది ? మద్యం, ఇసుక పాలసీల అమలులో ప్రభుత్వం ఫెయిలైందనే అనుకోవాలి. ఇదే సమయంలో ప్రతిపక్ష నేతలపై మంత్రులు, వైసీపీ ఎంఎల్ఏలు వ్యక్తిగత దూషణలు నిలిపేయాలి. చంద్రబాబు అండ్ కో జగన్ పై విపరీతంగా బురద చల్లేస్తున్న విషయాన్ని జనాలు గమనిస్తున్నారు. కాకపోతే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అని జనం సరిపెట్టుకుంటారు.

ఇప్పటికే చంద్రబాబుపై మంత్రి కొడాలినాని లాంటి వాళ్ళు చాలా తీవ్రంగా రెచ్చిపోతున్నారు. కొడాలి శాపనార్ధాలు, తిట్లు విని విని జనాలకు విసుగొచ్చేస్తోంది. కాబట్టి ఈ విషయంలో అధికారపక్షం నేతలే కాస్త సంయమనం పాటించి తగ్గుండాలి. షెడ్యూల్ ఎన్నికలకు మిగిలింది రెండున్నరేళ్ళే అన్న విషయం జగన్ గుర్తుపెట్టుకోవాలి. పైగా ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం పెరిగిపోతోంది. అధికారపార్టీ వర్గాల సమాచారం ప్రకారం 2023, ఆగష్టులోనే ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి.

చంద్రబాబు, పవన్ తో పాటు ప్రతిపక్షాల నేతలపై వైసీపీ నేతలు నోళ్ళు పారేసుకోవటం కాకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. జనాల్లో ప్రభుత్వంపై మొదలైన అసంతృప్తి వ్యతిరేకంగా మారే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఈ విషయంలో జగన్ జాగ్రత్తపడకపోతే కష్టమే. స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఏకపక్షంగా గెలిచాం కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఎదురే లేదని భ్రమల్లో ఉంటే గట్టి దెబ్బ పడటం ఖాయం.