Begin typing your search above and press return to search.

రేవంత్ రెడ్డి వ్యూహం సక్సెస్ అవుతుందా?

By:  Tupaki Desk   |   9 May 2023 4:48 PM
రేవంత్ రెడ్డి వ్యూహం సక్సెస్ అవుతుందా?
X
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టడానికి కాంగ్రెస్ రెడీ అవుతోంది. తమ వంతు ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా మొదటి నుంచి కేసీఆర్ పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉండే రేవంత్ రెడ్డి ఎన్నికలకు ఆరేడు నెలలు మాత్రమే ఉండడంతో స్పీడ్ పెంచారు. కాంగ్రెస్ అధినాయకులను తీసుకొచ్చి తెలంగాణలో యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసం శతవిధాలా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లు సహకరించకపోయినా.. తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు.

ప్రస్తుతం రేవంత్ రెడ్డి వివిధ డిక్లరేషన్ల పేరుతో అటు ప్రజా మద్దతును కూడగట్టడానికి.. అటు అధిష్టానం వద్ద పట్టు సంపాదించడానికి కష్టపడుతున్నాడు. గతంలో రైతాంగ సమస్యల పై రాహుల్ గాంధీని తెలంగాణ కు రప్పించి వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్ ను రేవంత్ ప్రకటించారు. ముఖ్యంగా కీలకమైన ధరణి పోర్టల్ రద్దు చేస్తామని.. ధరణి వల్ల ఇబ్బందిపడిన రైతులకు అండగా నిలుస్తామని చెప్పారు. రైతాంగ సమస్యలపై కాంగ్రెస్ డిక్లరేషన్ ఆకట్టుకునే విధంగా ఉంది.

తాజాగా రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్య పై ప్రధాన ఏజెండాగా తీసుకొని యూత్ ను టార్గెట్ చేసి డిక్లరేషన్ ప్రకటించారు. యువ సంఘర్షణ పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రియాంక గాంధీని ఆహ్వానించి యూత్ డిక్లరేషన్ ప్రకటించారు. నిరుద్యోగం లేని తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేస్తామని ప్రకటించారు. నిరుద్యోగులు అందరికీ నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు.అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీలు ఇచ్చారు.

నిరుద్యోగులకు రూ.4వేల భృతి, నిరుద్యోగుల కోసం 7 జోన్లలో ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజీలు.. ప్రైవేటు కంపెనీల్లో తెలంగాణ యువతకు 75శాతం రిజర్వేషన్.. బాసర ఐఐఐటీ తరహాలో మరో నాలుగు ఐఐఐటీల ఏర్పాటు.. 18 ఏళ్లు పైబడి చదువుకునే ప్రతీ యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్, యువతకు రూ.10 లక్షల వరకూ వడ్డీ లేని రుణం అందిస్తామని తెలిపారు.

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ రెడీ చేస్తోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా స్థానిక కాంగ్రెస్ నేతలంతా తెలంగాణలోని ప్రధాన సమస్యలపై ఫోకస్ చేస్తున్నారు. డిక్లరేషన్లతో వేడి పుట్టిస్తున్నారు. యూత్ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన హామీ యువతను ఆకర్షించే విధంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి యువత మద్దతు ఎంతవరకు ఉంటుందనేది తెలియాల్సి ఉంది.