Begin typing your search above and press return to search.

రాజకీయాల్లో చిరుకు జరిగిందే.. రజినీకీ జరుగనుందా!

By:  Tupaki Desk   |   19 Sep 2020 7:30 AM GMT
రాజకీయాల్లో చిరుకు  జరిగిందే.. రజినీకీ జరుగనుందా!
X
మెగాస్టార్ చిరంజీవి.. మూడు దశాబ్దాలకు పై తెలుగు ఇండస్ట్రీని ఏలిన వాడు. అఖండ ప్రజాభిమానం అతడి సొంతం. అడుగేస్తే ఆటో గ్రాఫ్ లు, ఫొటో క్లిక్ లు ఆయన వైభవం అలా సాగింది. అభిమానులు, ప్రజలు రాజకీయాల్లోకి వచ్చి సేవలు చేయాలని చిరంజీవిని పలుసార్లు కోరారు. ఇంద్ర సినిమా వచ్చినప్పుడు చిరంజీవి ఇక రాజకీయాల్లోకి రావడం తథ్యం అని అంతా భావించారు. అప్పుడు రాజకీయాల్లోకి వచ్చినా పరిస్థితి వేరేలాగా ఉండేదేమో. అప్పటి రాజకీయ శున్యతా అలా ఉంది. కానీ చిరంజీవి ఎందుకో తాత్సారం చేశారు. ఆ తర్వాత వైఎస్ సీఎంగా ఉండగా కాంగ్రెస్ బాగా బలపడింది. ఆ సమయంలో 2009 ఎన్నికలకు ముందు 7 నెలలే ఉండగా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. ప్రజల నుంచి కూడా విపరీత మైన స్పందన వచ్చింది. చిరంజీవి ఎక్కడికి వెళ్లినా జన హారతి పట్టారు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా ప్రచారం నిర్వహించేందుకు, అభ్యర్థులను ఎంపిక చేసుకునేందుకు చిరంజీవికి సమయం సరిపోలేదు. ఆ కారణంగానే తెలంగాణలో చిరంజీవి సరైన ప్రచారం నిర్వహించలేదు. చివరికి ఎన్నికల్లో చిరంజీవి ఓటమి తప్పలేదు. సరిగ్గా ప్రచారం చేయని తెలంగాణలో రెండే సీట్లు వచ్చాయి. ఇప్పుడు చిరంజీవి ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడో సరిగ్గా అదే పరిస్థితులను తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఎదుర్కొంటున్నారు.

రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని తమిళనాడు ప్రజలు గత 20 ఏళ్ల నుంచి కోరుతున్నారు. కానీ ఆయన పార్టీ పెట్టేందుకు ముందుకు రాలేదు. జయలలిత ఉన్నంతకాలం రాజకీయాలకు ఊసెత్తని రజనీకాంత్.. ఆమె మరణం తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యతను దృష్టిలో పెట్టుకుని మూడేళ్ల కిందట రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు. కానీ ఇంతవరకు ఆయన పార్టీ పెట్టలేదు. మామూలుగానే కొన్నేళ్ల నుంచి ఆలస్యంగా సినిమాలు చేస్తున్న రజినీకాంత్.. రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన తర్వాత వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. లోక్ సభ ఎన్నికలు జరిగినా.. ఆలస్యంగా రాజకీయాల్లోకి వచ్చిన కమల్ హసన్ పార్టీ కూడా పోటీ చేసినా రజినీ పట్టించుకోలేదు.

దీంతో అసలు రజినీ రాజకీయాల్లోకి వస్తాడా రాడా అనే అనుమానాలు కూడా ప్రజల్లో తలెత్తాయి. దీంతో రజనీకాంత్ అసెంబ్లీ ఎన్నికల్లో తప్పక పోటీచేస్తానని ప్రకటించారు. అయితే తమిళనాడులో ఇక అసెంబ్లీ ఎన్నికలకు ఎనిమిది నెలలే గడువు ఉంది. అయినా రజినీ కొత్త పార్టీ నుంచి ఎక్కడా కనిపించడం లేదు. రజినీ తొందర్లోనే పార్టీ పెడతాడని రాజకీయ కార్యకలాపాల కోసం ఏర్పాటుచేసిన రజినీ మక్కల్ మండ్రల్ నాయకులు చెబుతున్నారు. ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేయడంపై మక్కల్ మండ్రల్ నాయకులతో రజినీకాంత్ సమావేశాలు జరుపుతున్నారని.. నవంబర్ కల్లా పార్టీ పెట్టడం ఖాయమని వారు చెబుతున్నారు. నవంబర్ లో పార్టీ పెట్టడం అంటే ఇక ఎన్నికలకు ఆరు నెలల సమయం మాత్రమే ఉంటుంది. ఒకవైపు తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీ బలంగా తయారైంది.

అధికార అన్నాడీఎంకే తో పాటు శశికళ కొద్ది నెలల్లో జైలు నుంచి బయటకు రానున్నారు. అలాగే రాందాస్ నేతృత్వంలోని పీఎంకే, విజయ్ కాంత్ పార్టీ డీఎండీకే, దినకరన్ పార్టీ, కమలహాసన్ మక్కల్ మీది మయ్యం, కాంగ్రెస్, బీజేపీ ఇన్ని పార్టీలను రజినీ ఎదుర్కోవలసి ఉంది. కేవలం ఆరు నెలల కాలంలోనే రజనీ అభ్యర్థుల ఎంపిక, రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం పూర్తి చేయాల్సి ఉంది. అంత తక్కువ సమయంలో ఇవన్నీ సాధ్యమయ్యే పనులేనా అని.. రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కరోనా పరిస్థితులు కూడా రజనీకి అడ్డంకుల్లా తయారయ్యాయి. అప్పుడు ప్రజారాజ్యం పార్టీకి ఎలాంటి పరిస్థితులు ఎదురు అయ్యాయో.. ఇప్పుడు రజనీ పార్టీ కి కూడా సరిగ్గా అవే పరిస్థితులు ఎదురవుతున్నాయి. చిరంజీవి పార్టీకి ఏవైతే ఫలితాలు వచ్చాయో రజినీ పార్టీ కూడా వస్తాయేమోనని ఆయన అభిమానులు కంగారు పడుతున్నారు. ఈ పరిస్థితులన్నీ అధిగమించాలంటే రజినీ తొందరపడి పార్టీ ప్రారంభించి ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధం కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.