Begin typing your search above and press return to search.

మరో సక్సెస్ పీకే ఇవ్వగలరా... ?

By:  Tupaki Desk   |   16 Jan 2022 1:30 AM GMT
మరో సక్సెస్ పీకే ఇవ్వగలరా... ?
X
పీకే. ఈ పేరు ఎన్నికల రాజకీయాల్లో బాగా వినిపించడం మొదలెట్టింది గత ఎనిమిదేళ్ళుగానే. అంతకు ముందు గుజరాత్ లో మోడీ గెలుపునకు పీకే టీమ్ సాయపడింది అంటారు. కానీ 2014 ఎన్నికల్లో మోడీ దేశానికి ప్రధాని కావడం వెనక ప్రశాంత్ కిశోర్ టీమ్ కచ్చితంగా ఉంది. ఆ తరువాత బీహార్ లో నితీష్ కుమార్ గెలుపు తో పీకే టీమ్ పేరు గొప్పగా మారు మోగింది. అది అలా సాగుతూ చివరికి కధ ఏపీ దాకా వచ్చేసింది.

ఏపీలో 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపు వెనక జగన్ కష్టంతో పాటు పీకే వ్యూహాలు కూడా ఉన్నాయని చెబుతారు. ఆ విధంగా జాగ్రత్తగా వైసీపీని జనం ముందు పెడుతూనే చంద్రబాబు మైనస్ పాయింట్లు పట్టుకుని జనంలో బాగా వాటిని ఎస్టాబ్లిష్ చేసి మరీ పీకే టీమ్ సక్సెస్ అయింది.

మొత్తానికి జగన్ ఏపీకి సీఎం అయిపోయారు. దాంతో పాటుగా తొందరలో మూడేళ్ళ పాలన కూడా పూర్తి చేసుకోబోతున్నారు. ఇక చూడబోతే 2024 ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నాయి. ముప్పయ్యేళ్ళు సీఎం గా ఉండాలన్నది జగన్ కల. కానీ అది సాధ్యపడుతుందా. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందా అంటే సమాధానం మాత్రం గట్టిగా రాని సీన్ ఉంది.

ఏపీలో వైసీపీ మీద వ్యతిరేకత చాప కింద నీరులా పాకింది. జనాల్లో అసంతృప్తి అయితే ఉంది. అది కచ్చితమైన రూపు తీసుకోవడానికి రానున్న కాలం సరిపోతుంది అని అంటున్నారు. ఇక విపక్షాలు కనుక సరైన ఆల్టర్నేషన్ తో వస్తే మాత్రం 2024లో వైసీపీ ఓటమి ఖాయమని కూడా విశ్లేషణలు ఉన్నాయి.

ఏపీలో టీడీపీ జనసేన కలయిక తధ్యమని కూడా అంటున్నారు కాబట్టి ఈ బలమైన కూటమిని ఎదుర్కోవడం వైసీపీకి గట్టి సవాల్ కావచ్చు అని చెబుతున్నారు. మరి ఈ టైమ్ లో వైసీపీలోకి పీకే రీ ఎంట్రీ ఇస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది. పీకే మరో మారు జగన్ని గెలిపించి సీఎం ని చేయగలరా అంటే చూడాలి అన్న మాటే వస్తోంది.

నిజానికి ఏపీలో గత రెండు ఎన్నికలను చూసుకుంటే ప్రజలు తడవకు ఒక పార్టీకి అధికారం అప్పగిస్తున్నారు అని చెప్పవచ్చు. చంద్రబాబు కూడా 2029 దాకా తానే సీఎం అని భావించారు. కానీ 2019లోనే కుర్చీ ఖాళీ చేయాల్సి వచ్చింది. ఇక ప్రజలకు సంక్షేమ పధకాలు ఇస్తున్నామని వైసీపీ ఎంత చెప్పుకున్నా దాని విషయంలో కూడా చాలా సెక్షన్లలో భినాభిప్రాయాలు ఉన్నాయి.

అందరికీ ఆ ఫలాలు అందడంలేదు అన్న కంప్లైంట్ ఉంది. అదే విధంగా పన్నుల భారం అధికంగా ఉందన్న బాధ కూడా చాలా వర్గాల్లో ఉంది. అభివృద్ధి లేదు అన్నది అయితే అందరి బాధగా ఉంది. ఉపాధి లేకపోవడం మౌలిక సదుపాయల కల్పన వంటి వాటి విషయంలో ప్రభుత్వం ఇప్పటికీ సరైన ప్రణాళికలతో ముందుకు వెళ్లకపోవడంతో జనాల్లో క్రమంగా పెరుగుతున్న వ్యతిరేకత ఎన్నికల వేళకు మాత్రం కచ్చితంగా యాంటీ చేస్తుంది అంటున్నారు.

మరి ఈ సమయంలో పీకే వైసీపీకి మళ్ళీ వ్యూహకర్తగా వచ్చి ఎంతవరకూ ఆ వ్యతిరేకతను ఆపుతారు అన్నది కూడా చూడాలంటున్నారు. గట్టి ప్రతిపక్షం ఉంటే కనుక పీకే వ్యూహాలు ఎన్ని చేసినా పారవని గత చరిత్ర చెబుతోంది. అలాగే జనాల్లో కనుక ప్రభుత్వాన్ని మార్చాలి అన్న సంకల్పం ఉంటే కూడా ఎన్ని ఎత్తుగడలు వేసినా అనుకున్న టార్గెట్ ని రీచ్ కాలేరు అని చెబుతున్నారు.

ఇదిలా ఉండగా ఏపీలో కాపుల ఓట్లు కీలకం అవుతాయి అంటున్నారు. అందుకే మెగాస్టార్ ని వైసీపీ వైపుగా తిప్పడానికి పీకే మార్క్ వ్యూహాన్ని రూపొందించారని అంటున్నారు. అయితే చిరంజీవి తనకు రాజకీయాలు వద్దే వద్దు అనడంతో అది పారలేదు అని కూడా చెబుతున్నారు. మొత్తానికి ఇలాంటి వ్యూహాలతో ఏపీలో వైసీపీని మళ్లీ గద్దెనెక్కించడం సాధ్యమేనా అన్న చర్చ అయితే పార్టీ బయటా లోపటా గట్టిగానే సాగుతోంది మరి.