ఊగిసలాటలో జససేన నాయకులు.. పవన్ క్లారిటీ ఇచ్చేనా?

Sat Sep 11 2021 14:50:41 GMT+0530 (IST)

Will Pawan give clarity To Party Members

ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వస్తున్నానంటూ ప్రకటించి 2014లో జనసేన పార్టీని స్థాపించిన పవన్ కల్యాణ్ ఈ ఏడేళ్లలో ఎన్నో డక్కామొక్కీలు తిన్నారు. 2014 ఎన్నికల్లో ఇలు రాష్ట్రంలో టీడీపీకి.. అటు కేంద్రంలో బీజేపీకి మద్దతునిచ్చి ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఇక 2019లో ఎన్నికల్లో పోటీపడ్డ జనసేన కేవలం ఒక్క ఎమ్మెల్యే స్థానాన్ని మాత్రమే గెలుచుకోగలిగిందన్న సంగతి తెలిసిందే. పవన్ సైతం పోటీ చేసిన  రెండు చోట్లా ఓడిపోయారు. ఆ తర్వాత బీజీపీతో మళ్లీ పొత్తు పెట్టుకున్నారు. ఇటీవల సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. కానీ ఆయనను నమ్ముకుని జనసేన పార్టీ కోసం కష్టపడుతున్న నాయకులకు ఇప్పుడు పవన్ ఓ క్లారిటీ ఇవ్వాల్సిన సమయం వచ్చింది.2019 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత జనసేన నుంచి చాలా మంది నాయకులు బయటకు వెళ్లిపోయారు. కొంతమంది వేరే వ్యాపకాలు ఎంచుకోగా.. మరికొంత మంది సైలెంట్ అయిపోయారు. కానీ కొంతమంది నాయకులు మాత్రం తమ ఆశ చావక పార్టీలోనే ఆక్టివ్‌గా కొనసాగుతున్నారు. 2024 ఎన్నికల కోసం వాళ్లు ఆశగా ఎదురుచూస్తున్నారు. జనసేన తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎంపీలుగా గెలవాలనే లక్ష్యాలు నెరవేరకపోయినా కనీసం రాజకీయ నాయకుడు అనిపించుకోవాలనే ఆశతో వీళ్లు పార్టీలోనే కొనసాగుతున్నారని తెలుస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ పేరుతో పోటీ చేయాలనేది వీళ్ల కోరిక అని సమాచారం.

అలాంటి నేతలు కొంతమంది నియోజకవర్గాల్లో చాలా ఆక్టివ్‌గా ఉంటున్నారు. భవిష్యత్పై ఆశతో పవన్ టికెట్ ఇస్తారనే నమ్మకంతో ఈ నాయకులున్నారు. ఇలాంటి వాళ్లు రెండేళ్లుగా పార్టీ కోసం ప్రజల్లో ఉంటూ బాగానే పనిచేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ ఆక్టివ్‌గా ఉన్నారు. నిరసనలు ప్రదర్శనలూ అంటూ స్థానిక అధికార వైసీపీ నేతలతోనూ వైరం పెంచుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఈ నాయకుల్లో ఓ అనుమానం మొదలైంది. పార్టీ కోసం ఇంతలా కష్టపడుతున్నా వచ్చే ఎన్నికల్లో అవకాశం దొరుకుంతుందో? లేదో? అనేది సందేహంగా మారిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో జనసేన పార్టీ అంటే త్యాగాలకు మారు పేరు అనే చర్చ వినిపిస్తోంది. ఏ పార్టీ స్నేహ హస్తం చాచినా జనసేన అందుకుంటుందనే అభిప్రాయాలున్నాయి. ఇప్పుడు బీజేపీతో బంధాన్ని కొనసాగిస్తున్న జనసేన.. వచ్చే ఎన్నికల్లో ఎక్కడ పొత్తు పేరుతో బరిలో దిగే అవకాశముంది. 2024 నాటికి టీడీపీతోనూ పొత్తు పెట్టుకునే అవకాశాలను కొట్టిపారేయలేమని విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో తాము పార్టీ కోసం బాగా కష్టపడి పనిచేస్తున్న నియోజకవర్గాల్లో జనసేన పొత్తులో భాగంగా ఆ స్థానాలకు ఇతర పార్టీలకు కేటాయిస్తే అప్పుడు తమ పరిస్థితి ఏమిటని జనసేన నాయకులు సందిగ్ధంలో పడ్డారు. జనసేనకు రాష్ట్రవ్యాప్తంగా క్యాడర్ లేదు. ఇప్పుడు ఓ 20 మంది నాయకులు ఆక్టివ్‌గా ఉన్నారు. ఇప్పుడు వాళ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత పవన్‌పై ఉంది. పొత్తులు పెట్టుకున్న ఆయా స్థానాలు జనసేన నాయకులకే కేటాయిస్తానని పవన్ చెప్పి వాళ్లలో ధైర్యం నింపాలి.  ఈ నాయకులను మరింత బలంగా తయారుచేయాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు.