జగన్ హీరో అవుతారా... ?

Thu Jan 20 2022 18:00:01 GMT+0530 (India Standard Time)

Will Jagan become a hero ...?

ఏపీలో ఇపుడు అసలు యుద్ధం మొదలైంది. ఏపీ సర్కార్ కి వ్యతిరేకత ఉందని విపక్షాలు అనడమే తప్ప దానికి రుజువులూ సాక్ష్యాలు అయితే పక్కాగా లేవు. అన్ని లోకల్ బాడీ ఎన్నికలలో వైసీపీ జెండా ఎగరేసింది. దాంతో వచ్చే ఎన్నికల్లో మేమే గెలుస్తామని విపక్షాలు అన్నా కూడా జనాల్లో ఆ ఇంపాక్ట్ అయితే సరిగ్గా పడడంలేదు. కరెక్ట్ గా ఈ టైమ్ లో ఏపీ జనాభాలో అతి పెద్ద సెక్షన్ రోడ్ల మీదకు వచ్చింది. ఒక విధంగా చెప్పాలీ అంటే జగన్ అధికారంలోకి వచ్చాక అతి పెద్ద ఆందోళన ఇదే అనుకోవాలి.ఏకంగా ఉద్యోగులు పదమూడు లక్షల మంది దాకా ఉన్నారు. వారి బలం బలగం అంతా ప్రభుత్వంలోనే ఉంది. వారు కనుక బెట్టు చేస్తే సర్కార్ బండి కదలడం కష్టం. దాంతోనే ఆ మధ్య ఒక ఉద్యోగ సంఘం నేత తమ సంఘం అంతర్గత మీటింగులో మేము తలచుకుంటే ప్రభుత్వాన్ని పడకొట్టగలమని భారీ  స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఇక ఇపుడు కూడా ఉద్యోగ సంఘాల నేతలు గట్టిగానే మాట్లాడుతున్నారు.

వారి మాటలు ఇస్తున్న స్టేట్మెంట్స్ అన్నీ కూడా రాజకీయ పరిభాషలో ఉన్నాయని అంటూ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు కూడా. మీరు మాతోనే ప్రభుత్వంలో భాగమే అని ఎంతలా వైసీపీ నేతలు అంటున్నా ఉద్యోగులు తగ్గేది లేదు అనే అంటున్నారు. వారికి విపక్షాలు పూర్తి స్థాయిలో మొత్తం మద్దతు ఇచ్చాయి. అవును ఇది రాజకీయం గతంలో చంద్రబాబు సీపీఎస్ రద్దు చేయకపోతే నేనున్నా అని జగన్ వాళ్ళను తమ వైపునకు ఎలా తిప్పుకున్నారో ఇపుడు విపక్షం కూడా అదే చేస్తుంది.

దాంతో పాటు టీడీపీ అనుకూల మీడియాలో ఉద్యోగుల పోరాటం హైలెట్ అవుతోంది. వారికి తీరని అన్యాయం జరుగుతోంది అని వారికి వైసీపీ సర్కార్ వెన్నుపోటు పొడిచింది అని రాతలు కూడా రాస్తున్నారు. ఇవన్నీ ఎలా ఉన్నా ప్రభుత్వం కూడా ఎక్కడా తగ్గడంలేదు. కొత్త పీయార్సీతోనే జీతాలు అంటూ జగన్ సర్కార్ అన్ని ట్రజరీలకు ఆదేశాలు జారీ చేసింది అని వార్తలు వస్తున్నాయి. ఒక విధంగా పోరు బాటలో ఉన్న ఉద్యోగులకు ఇది మరింతగా రెచ్చగొట్టే చర్యగానే చూడాలి.

ఇక వచ్చే నేల ఆరవ తేదీ అర్ధ రాత్రి నుంచి ఉద్యోగులు సమ్మెకి దిగిపోతున్నారు. ఏదైనా అద్భుతం జరిగి అటూ ఇటూ తగ్గితే తప్ప సమ్మె అనివార్యం అని కూడా అంతా అంటున్నారు. సీన్ చూస్తూంటే ఇటు జగన్ సర్కార్ తగ్గదు అటు ఉద్యోగులు అంతకంటే తగ్గరు మరి ఎలా దీనికి పరిష్కారం అంటే సమ్మె జరిగి దాని మీద  జనాలలో వచ్చిన అభిప్రాయం  ఉద్యోగుల మీద జనంలో ఉన్న ఒపీనియన్ ఇవన్నీ చూసి అపుడు ఏమైనా ఉంటే ఆలోచించవచ్చు అని ప్రభుత్వం భావిస్తోందా అంటే అలాగే అనుకోవాలేమో.

ప్రభుత్వ వర్గాల నుంచి చూస్తే ఉద్యోగులకు జనంలో ఏ కోశానా సింపతీ ఉండదని ధీమా ఉన్నట్లుగా కనిపిస్తోంది. అదే టైమ్ లో ఉద్యోగులు ఏ ప్రభుత్వం వచ్చినా తమ డిమాండ్లను సాధించుకోవడమే ఇంతవరకూ జనాలు చూశారు. కానీ ఫస్ట్ టైంమ్ వారి విషయంలో కాస్తా గట్టిగా ఉండే సర్కార్ తనదని జగన్ చెప్పదలచుకున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది. అలా ఉద్యోగుల విషయంలో ఏం చేయాలో అది చేసి తాను హీరో అనిపించుకోవాలని జగన్ చూస్తున్నారా అన్న సందేహాలు కూడా వస్తున్నాయట.

ఇంకో వైపు చూసుకుంటే తనకు అపారమైన జనాల మద్దతు ఉందని జగన్ భావించడం వల్లనే ఉద్యోగులను లైట్ గా తీసుకుంటున్నారా అన్న చర్చ కూడా ఉంది. ఏది ఏమైనా కూడా ఉద్యోగులు సమాజంలో పవర్ ఫుల్ సెక్షన్. వారు ఎన్నికల రాజకీయాలలో కీలకం. వారిని కాదంటే ఇబ్బందులు వస్తాయని వైసీపీ పెద్దలకూ తెలుసు. కానీ వారిని కూడా కాదని విజేతలం మళ్లీ తామే అవుతామన్న అతి నిబ్బరం వల్లనే ఇపుడు సీన్ ఇంతదాకా వచ్చిందని అంటున్నారు. మొత్తానికి అటూ ఇటూ  ఢీ కొట్టడానికే రెడీ అవుతున్నారు. మరి ఈ విషయంలో ఉద్యోగులను దారికి తెచ్చి హీరో అయ్యది జగనేనా.. వెయిట్ అండ్ సీ.