జగన్-షర్మిల-విజయమ్మ ఒక్కచోటకు చేరేనా?

Wed Jul 06 2022 16:00:01 GMT+0530 (IST)

Will Jagan-Sharmila-Vijayamma get together?

జూలై 8 వైఎస్సార్సీపీ శ్రేణుల్లో హీట్ పెంచుతోందనే వార్తలు వస్తున్నాయి. ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పుట్టిన రోజు కావడమే ఇందుకు కారణం. అందులోనూ వైఎస్ జగన్ ఆయన సోదరి వైఎస్ షర్మిల వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు పార్టీలతో ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే.వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడం జగన్ కు ఇష్టం లేదని స్వయంగా ఆయనకు కుడిభుజంగా అందరితో పిలవబడుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి గతంలోనే చెప్పిన సంగతి తెలిసిందే. మరోవైపు వైఎస్ విజయమ్మ ఇటు వైఎస్సార్సీపీకి అటు వైఎస్సార్ తెలంగాణ పార్టీకి గౌరవ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. వైఎస్ షర్మిల పార్టీ పెట్టినప్పటి నుంచి విజయమ్మ పూర్తిగా తెలంగాణలోనే ఉంటున్నారు.

ఈ నేపథ్యంలో జూలై 8న వైఎస్సార్ జన్మదినం సందర్భంగా వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో పలు ప్రత్యేక ప్రార్థన కార్యక్రమాలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి జూలై 7న గురువారం ఇడుపులపాయ చేరుకుంటారని తెలుస్తోంది.

మరోవైపు తెలంగాణలో ప్రస్తుతం పాదయాత్రలో ఉన్న షర్మిల విజయమ్మలు కూడా ఇడుపులపాయకు వస్తారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముగ్గురు కలుస్తారా?  లేదంటే ఎవరి కార్యక్రమాల్లో వారు పాల్గొంటారా అనేది తెలియాల్సి ఉంది.

గతేడాది షర్మిల జగన్ వేర్వేరుగా వచ్చి ఇడుపులపాయ నుంచి వెళ్లిపోయారు. షర్మిల వైఎస్సార్ సమాధి వద్ద ఉన్నంతసేపు జగన్ రాలేదు. షర్మిల విజయమ్మ ఇడుపులపాయ నుంచి హైదరాబాద్ వెళ్లిపోయాక జగన్ వచ్చిన సంగతి తెలిసిందే.

షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచీ వైఎస్సార్ జన్మదినం - వర్దంతి నాడు ఇడుపులపాయలో వీరిద్దరి రావటం..కలుసుకోవటం పైన ఆసక్తి కర చర్చ జరుగుతూ వస్తోంది. గతంలో ప్రతీ క్రిస్మస్ కు అందరూ కలిసి పులివెందులలో కలిసే వారు. కానీ కొంత కాలంగా అది జరగటం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ జన్మదినమైనా అన్న చెల్లి అమ్మను కలుపుతుందా అనేదానిపై ప్రజల్లో చర్చ జరుగుతోంది.