Begin typing your search above and press return to search.

సోనూను కాంగ్రెస్ వదిలిపెడుతుందా ?

By:  Tupaki Desk   |   16 Jan 2022 5:14 AM GMT
సోనూను కాంగ్రెస్ వదిలిపెడుతుందా ?
X
ఇపుడిదే సందేహం అందరినీ పట్టి పీడిస్తోంది. కారణం ఏమిటంటే ఈ మధ్యనే సోనూసూద్ సోదరి మాళవిక సూద్ కాంగ్రెస్ పార్టీలో చేరడం. సోదరి కాంగ్రెస్ లో చేరినా సోనూ మాత్రం చేరలేదు లేండి. అయితే మాళవిక రాబోయే ఎన్నికల్లో మోగా నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. ఆమె గెలుపు కోసం సోనూ ప్రచారం చేయబోతున్నారు. ఇక్కడే సమస్య మొదలైంది. తన సోదరి కోసం మాత్రమే సోను ప్రచారం చేయాలని అనుకుంటున్నారు.

అంటే మిగిలిన అభ్యర్ధులతో తనకేమీ సంబంధం లేదన్నట్లుగా సోనూ మాట్లాడుతున్నారు. అయితే కాంగ్రెస్ నేతలు ఊరుకుంటారా ? కరోనా వైరస్ కష్టకాలంలో బాధితులకు సోనూసూద్ అందించిన సేవలు ఎవరు మరచిపోలేరు. ప్రత్యేక రైళ్ళు వేయించారు. అవసరమైనపుడు ప్రత్యేక విమానాలు కూడా వేయించారు. వేలాదిమందికి నెలలపాటు మూడుపూటలా భోజనాలు పెట్టించారు. ఎంతోమందికి వైద్య సౌకర్యాలు కల్పించారు. ఎన్నో ఆసుపత్రులకు ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటుచేశారు.

ఒకటి కాదు రెండు కాదు బాధితులకు సేవచేయటంలో సోనూసూద్ ఆకాశమే హద్దుగా ఎదిగారు. దేశంలో అత్యంత ప్రభావశీలుల జాబితాలో ప్రధానమంత్రి నరేంద్రమోడీని కూడా సోనూసూద్ వెనక్కు నెట్టేశారు. దాంతోనే కేంద్రానికి మండింది. అందుకనే హఠాత్తుగా సోనూసూద్ కార్యాలయాలపై ఐటి దాడులు జరగటం, సోనూ పై కేసులు కూడా నమోదుచేసింది. అయితే సోనూ వెనక్కు తగ్గలేదు. ఇంతటి క్రేజున్న సోనుసూద్ ద్వారా ఎన్నికల్లో లాభపడాలని కాంగ్రెస్ అనుకుంటోంది.

అసలే పంజాబ్ లో కాంగ్రెస్ పరిస్ధితి ఏమంత ఆశాజనకంగా లేదు. ఇలాంటి సమయంలో కేవలం మాళవిక నియోజకవర్గంలో మాత్రమే తాను ప్రచారం చేస్తానని సోను అంటే కాంగ్రెస్ నేతలు ఊరుకోరు. ఏదో రకంగా తమ నియోజకవర్గాల్లో కూడా ప్రచారం చేయించుకుంటారు. ఎందుకంటే పీసీసీ అధ్యక్షుడు నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ, ముఖ్యమంత్రి జగ్ జీత్ సింగ్ చన్నీ లాంటి వాళ్ళు అడిగితే సోను కాదనే అవకాశాలు దాదాపు లేవు. ఏదేమైనా మొన్నటివరకు అందరివాడుగా ఉన్న సోను సోదరి మాళవిక కారణంగా కాంగ్రెస్ వాదిగా మారిపోవటం ఖాయంగానే ఉంది. మరి ఈ పరిస్ధితుల్లో బీజేపీ ఊరికే వదిలిపెడుతుందా ?