Begin typing your search above and press return to search.

అన్నయ్యా....ఇదే ఫైనలా... ?

By:  Tupaki Desk   |   16 Jan 2022 1:30 AM GMT
అన్నయ్యా....ఇదే ఫైనలా... ?
X
మెగాస్టార్ చిరంజీవి అందరికీ అన్నయ్య. ఆయన సినీ రంగాన రాజకీయ రంగాన కూడా విశేషంగా తమ్ముళ్లను సంపాదించుకున్నారు. ఎన్టీయార్ రాజకీయాల్లోకి వచ్చి అన్న అనిపించుకుంటే మెగాస్టార్ ఎప్పటికీ అన్నయ్య తానే అని అంటారు. అలాంటి మెగాస్టార్ కి రాజకీయాలు ఎందుకో సరిపడలేదు. ఆయన ఇప్పటికి దశాబ్దర కాలం క్రితం రాజకీయ అరంగేట్రం చేశారు. ప్రజా రాజ్యం పార్టీ పెట్టి సంచలన రికార్డులు నమోదు చేయాలనుకున్నారు. ఆయనకు ఉన్న చరిష్మా చూసినా ఆయన సామాజిక నేపధ్యం చూసినా అది సాధ్యపడేదే.

కానీ ఆయన పార్టీ పెట్టిన టై, మాత్రం రాంగ్ అంటారు. అప్పట్లో ఒక వైపు తెలంగాణా ఉద్యమం పీక్స్ లో ఉంది. మరో వైపు టీడీపీ గట్టిగా ఉంది. వైఎస్సార్ బ్రహ్మాండంగా వెలిగిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ పెట్టి చిరంజీవి దూసుకువచ్చారు. అయినా సరే ఆయనకేమి తక్కువ ఆదరణ దక్కలేదు. 70 లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి. పద్దెనిమిది సీట్లు కూడా గెలుచుకున్నారు.

అయితే రాజకీయాల్లో తొలి అడుగే అలా పడడంతో చిరంజీవి కొంత అప్ సెట్ అయ్యారు. దానికి తోడు సొంత పార్టీలో రాజకీయం, బయట రాజకీయం చూసి ఆయన విసుగుచెందారు. మొత్తానికి పద్మవ్యూహన అభిమన్యుడు కాకుండా ఆయన విజయవంతంగా రాజకీయ రొంపి నుంచి బయటకు వచ్చారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో చిరంజీవి కేంద్ర మంత్రి కావడమే సక్సెస్ అనుకోవాలి

అయితే ఈ మాత్రం దానికి పార్టీ పెట్టాలా అన్న వారూ ఉన్నారు. అవును చిరంజీవికి ఉన్న ఇమేజ్ దృష్ట్యా ఆయన ఏ పార్టీలో చేరినా కేంద్ర మంత్రిని సునాయాసంగా చేస్తారు. అయితే చిరంజీవి ఒక ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చారు. దానికి అవరోధాలు కలిగాయి. అందుకే వద్దు మనకీ పాలిటిక్స్ అనేసుకున్నారు.

తిరిగి సినిమాల్లో నటిస్తూ బిజీ అయిపోయారు. మొత్తానికి చూస్తే మెగాస్టార్ రీ ఎంట్రీతో సినిమాల్లో అదరగొడుతున్నారు. ఆయన క్రేజూ మోజూ అలాగే కంటిన్యూ అవుతోంది. ఇవన్నీ పక్కన పెడితే చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి రావాలన్న మాట మాత్రం విభజన తరువాత నుంచి గట్టిగా వినిపిస్తోంది. ఆయన రాజకీయానికి ఇది సరైన టైమ్ అన్న వారూ ఉన్నారు

ఏపీలో చూసుకుంటే ఒక బలమైన ఆకాంక్షలతో బలమైన సామాజికవర్గం ఉంది. ఇక చిరంజీవి లాంటి వారు వస్తే కనుక కచ్చితంగా ఆదరించే సీన్ ఉంది. కానీ చిరంజీవి మాత్రం ఎందుకో నో అనేస్తున్నారు. ఇవన్నీ ఇలాగే అనుకున్నా ఆయన లేటెస్ట్ గా మీడియాతో మాట్లాడుతూ తాను ఇక మీదట రాజకీయాల్లోకి వచ్చేది లేదు, చట్ట సభల్లోకి వెళ్ళేది లేదు అంటూ ఇచ్చిన స్ట్రాంగ్ స్టేట్మెంట్ మాత్రం ఆయన అభిమానులకు తీరని నిరాశనే కలిగిస్తోంది.

నిజానికి ఏపీలో మారుతున్న రాజకీయ పరిణామాలు, కొత్త సామాజిక సమీకరణల నేపధ్యమో చిరంజీవి 2024 ఎన్నికలలో కీలక పాత్ర పోషిస్తారు అని అంతా భావించారు. కానీ మెగాస్టార్ తన మీద ఈ మధ్య వచ్చిన రూమర్స్ ని ఖండిస్తూ అసలు రాజకీయాల ఊసే వద్దు అనేశారు. దాంతో ఆయన మీద ఆశలు పెట్టుకున్న వారంతా అన్నయ్యా ఇదేనా ఫైనల్ డెసిషన్ అంటున్నారు. చూడాలి మరి ఏమైనా మెగాస్టార్ తన ఆలోచనలు ఏమైనా మార్చుకుంటారో ఏమో.