కేసీఆర్ ఇజ్జత్ ను ఇట్టా తీసేవేంది చంద్రశేఖరా?

Fri Mar 17 2023 18:00:01 GMT+0530 (India Standard Time)

Will Chandrashekhar take away KCR's

టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్నారు.. తెలంగాణ సీఎం కేసీఆర్. కాలం కలిసి వచ్చి.. అన్ని రాజకీయ సమీకరణాలు కలిసివస్తే ప్రధానమంత్రి కూడా కావాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలో అన్ని రాష్ట్రాల్లో పార్టీ నేతలను చేర్చుకుంటున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర ఒడిశా ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ లో కొందరు నేతలు చేరారు.అయితే కేసీఆర్ ఆశలన్నీ తెలంగాణతోపాటు మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ పైనే ఉన్నాయి. ఏపీలోనూ మంచి సీట్లు సాధించాలని కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ ను నియమించారు.

కాగా తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రా ప్రజలను సంస్కృతిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన కేసీఆర్ ను ఏపీ ప్రజలు ఆదరించడమనేది కలలో మాట అని అంటున్నారు. రాష్ట్రాన్ని విభజించి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీనే నామరూపాలు లేకుండా చేసిన ఏపీ ప్రజలు ఇక కేసీఆర్ పార్టీకి ఏ గతి పట్టిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదంటున్నారు.

ఈ నేపథ్యంలో ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ రూటు మార్చారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిందని.. దీనికి బీజేపీ వంతపాడిందని ఆయన అంటున్నారు. అంటే రాష్ట్ర విభజనలో కేసీఆర్ పాత్ర ఏమీ లేదని.. అంతా కాంగ్రెస్ బీజేపీలే చేశాయన్నదే ఆయన ఉద్దేశంగా కనిపిస్తోందని చెబుతున్నారు.

మరి అలాంటప్పుడు చావు అంచుల వరకు వెళ్లి తెలంగాణ తెచ్చింది కేసీఆరేనని ఆ పార్టీ నేతలు చెప్పుకున్నదంతా ఉత్త మాటేనని తేలిపోతుంది. ఎందుకంటే స్వయంగా బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడే రాష్ట్ర విభజన చేసింది కాంగ్రెస్ బీజేపీలేనని వాటికి ఘనతను ఆపాదిస్తున్నారు. కేసీఆర్ పై ఏపీ ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తొలగించడానికి తోట చంద్రశేఖర్ ఈ మాటలంటున్నా.. అంతిమంగా కేసీఆర్ ఇజ్జత్ ను తీసినట్టేనని చెబుతున్నారు. కేసీఆర్ సైతం మీ తెలంగాణ బిడ్డ అయిన కేసీఆరే చావుతో కొట్లాడి మరీ తెలంగాణ తెచ్చానని పలుమార్లు గొప్పగా చెప్పుకున్నారు.

మరి ఇప్పుడు తోట చంద్రశేఖర్ ఏమో రాష్ట్రాన్ని విభజించి ఏపీ ప్రజలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ అని.. దానికి సహకరించింది బీజేపీ అని అంటున్నారు. ఏపీలో బీఆర్ఎస్ ఓట్లు వచ్చేది ఎంతవరకో గానీ తమ అధినేత కేసీఆర్ ఇజ్జత్ ను మాత్రం తోట తీసేస్తున్న సంగతి గుర్తించారో.. లేదో!

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.