బండి సంజయ్ కు మరో ఛాన్స్ ఇస్తారా?

Fri Mar 17 2023 19:00:01 GMT+0530 (India Standard Time)

Will BJP Give Another Chance to Bandi Sanjay

తెలంగాణ బీజేపీకి కాస్త దూకుడు నేర్పిన బండి సంజయ్ అంతే స్థాయిలో వివాదాలు రాజేశారన్న ప్రచారం రాజకీయవర్గాల్లో ఉంది. తన మాటలద్వారానే మంటపెట్టిన బండి సంజయ్ పదవీకాలం పూర్తయ్యింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో మరోసారి బండి సంజయ్ నేతృత్వంలోనే తెలంగాణ బీజేపీ ముందుకెళుతుందా? ఆయనకు పొడిగింపు ఇస్తారా? లేదా? అన్నది ఉత్కంఠ రేపుతోంది.తెలంగాణలో కేసీఆర్ ను కొట్టాలి. వచ్చే ఎన్నికల్లో ఓడించాలి. బీజేపీ అధికారంలోకి రావాలి. ఇందుకోసం ఏం చేయడానికైనా వెనుకాడమని బీజేపీ పట్టుదలగా ఉంది. 'ఫాంహౌస్ ఫైల్స్' బయటపడ్డప్పుడు బీజేపీ చర్యలపై విమర్శల వాన కురిసింది.  

ఇటీవల బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జి తరుణ్ చుగ్ మరోసారి బండి సంజయ్ నే బీజేపీ చీఫ్ గా ఉంటారని అయితే అధికారిక ప్రకటన ఢిల్లీ నుంచి వెలువడుతుందని ట్విస్ట్ ఇచ్చాడు. బండి సంజయ్ పై మోడీ అమిత్ షాలకు సానుకూలత ఉంది. కానీ రాష్ట్ర బీజేపీలో మాత్రం వ్యతిరేకత బాగా ఉందన్న ప్రచారం సాగుతోంది. ఇటీవలే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సైతం బండి నోటి వ్యాఖ్యలను తప్పుపట్టారు.

బండి సంజయ్ అధ్యక్షుడిగా తన ఇమేజ్ పెంచుకుంటున్నాడని.. పార్టీ బలోపేతం చేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. తెలంగాణలో ఒట్టి ఊకదంపుడు ఆందోళనలు గాయి గత్తర లేపడం తప్పితే కేసీఆర్ ను ఇరుకునపెట్టేలా బండి సంజయ్ రాజకీయాలు చేయడంలేదన్న ఆరోపణలున్నాయి.  

తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టడానికి బీజేపీ చేయని ప్రయత్నాలు లేవు..  దూకుడు స్వభావంతో ముందుకెళ్తున్న ఆ పార్టీ నాయకులు కేసీఆర్ ఆలోచనలు అందుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నోటిదురుసు బీజేపీకి బాగా మైనస్ అవుతోంది. అయితే మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ తరుణంలో బీజేపీ నుంచి సీఎం అభ్యర్థి ఎవరనే విషయంపై తీవ్రంగా చర్చ సాగుతోంది. ఈ సమయంలో బండి సంజయ్ ను చేస్తే బీజేపీ మరింత డ్యామేజ్ అవుతుందని.. అతడికి కేంద్రంలో పదవి ఇచ్చి సాగనంపాలని స్కెచ్ గీస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.. బండి సంజయ్ కి కేంద్రంలో సముచిత స్థానం ఇస్తారని రాష్ట్రంలో ఈటల రాజేందర్ కు పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని అంటున్నారు. దీనిపై పార్టీ అధికారిక ప్రకటన చేయలేదు.

ఇటీవల బండి సంజయ్ కేసీఆర్ కూతురు కవితపై చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. ఇతర పార్టీల నుంచి చేరిన ఈటల వివేక్ కోమటిరెడ్డి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సైతం బండిపై వ్యతిరేకతతో ఉన్నారని ప్రచారం సాగుతోంది. ఆయన దూకుడు పార్టీకి నష్టం తెస్తుందా? లాభం తెస్తుందా? అన్న దానిపై బీజేపీ ఆరాతీస్తోందని సమాచారం.
 
బండి సంజయ్ ను కొనసాగించాలని ఒక వర్గం గట్టిగా కోరుతుండగా.. సీనియర్లు మాత్రం పొడిగించవద్దని లాబీయింగ్ చేస్తున్నట్టు సమాచారం. మరి అధికారిక ప్రకటన వస్తే కానీ బండి సంజయ్ మరోసారి బీజేపీ చీఫ్ గా కొనసాగుతాడా? లేదా? అన్నది తెలియదు. ఈ ఊహాగానాలకు చెక్ పడదు. చూడాలి మరీ ఏం జరుగుతుందో..  


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.